వేసవికాలంలో అమ్మమ్మ గారిల్లు- మొదటి భాగం

వేసవి కాలం లో అమ్మమ్మ గారిల్లు

మేము మా అమ్మమ్మ గారి ఇంటికి ఎప్పుడూ వెళ్ళేవాళ్ళం కాదు అదేంటో మా అమ్మమ్మ మా నాన్నని ఎప్పుడు అడిగినా రేపు మాపు అంటూ రోజులు గడిపేసే వాడు తప్ప అమ్మమ్మ వాళ్ళింటికి మాత్రం పంపే వారు కాదు కానీ మా నానమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాలంటే మాత్రం తను నిమిషంలో నిర్ణయం తీసుకొని మాతో చెప్పేవాడు దాంతో ఖచ్చితంగా మేము బయలుదేరవలసి వచ్చేది.

అక్కడికి వెళ్లడం మాకు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు అయినా తప్పేది కాదు ఏమైనా జ్వరం వచ్చినా వర్షం పడినా ఆరు నూరైనా ఆ ప్రయాణం ఆగేది కాదు వెళ్ళాలి అంటే వెళ్ళాలి అంటే దానికి తిరుగులేదు. కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మాత్రం మేము ఎంతో ప్రయాసపడాల్సి వచ్చేది. ఎంతో బ్రతిమిలాడాల్సి వచ్చేది. ఎన్నో రోజుల తరబడి అడిగితే మా నాన్నగారికి ఎన్నోరకాలుగా మెప్పించి తనకు నచ్చిన వంటకాలు చేసి పెట్టి వేడుకుంటే ( ఇది చాలా అన్యాయం కదా కానీ అప్పట్లో మా అమ్మ మా నాన్నని ఏం అనలేకపోయింది అదేంటో )

చివరికి నానమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఇష్టంగా ఇబ్బందిగా గడిపిన తర్వాత అక్కడి నుండి మళ్లీ మా మేనత్త ఇంటికి వెళ్లి అక్కడ ఒక పదిహేను రోజులు ఉండాల్సివచ్చేది అక్కడ కొంతనయం ఎందుకంటే మాతో ఆడుకోవడానికి పిల్లలు ఉండేవారు అయినా అమ్మమ్మగారిల్లు అంటేనే ఉన్న మజానే వేరు నానమ్మ మేనత్త వాళ్ళ ఇంట్లో ఉండని ప్రైవసీ స్వేచ్ఛ స్వాతంత్రాలు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవి అందుకే మాకు అక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని తెగ ఉబలాటంగా ఉండేది.

అలా ఎలాగోలా రోజులు గడిపేసి ఇంకో వారం లో స్కూల్ తెరుస్తారు అనగా అప్పుడు నాన్న మమ్మల్ని ఆ బస్సు ఎక్కించే వారు లేదా తను కూడా మాతో పాటు వచ్చి బస్టాండ్లో టీ తాగి మేము గల్లీలో తిరిగే వరకు చూసి ఆ తర్వాత ఇంకో బస్సు ఎక్కి వెళ్ళిపోయేవాడు.

అమ్మకు కరెక్టుగా వారంరోజుల్లో వచ్చేయాలని మరీ మరీ చెప్పేవాడు కానీ నాన్న మాత్రం అమ్మమ్మ వాళ్ళింటికి ఎప్పుడూ వచ్చేవాడు కాదు (అలా ఊరికే వస్తే  అలుసు అవుతాం అని తర్వాత తెలిసింది. దీన్నే అల్లుడిరికం )   అంటారేమో ..

మేము బస్టాండ్ లో బస్సు దిగిన తర్వాత ఆ రోడ్డుపై ఉండే బస్సు బస్టాండ్ కి వెళ్ళేది మేము మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చే వాళ్ళం. అది కాస్త కొత్తగా గందరగోళంగా ఉండేది. రోడ్డు క్రాస్ చేసి ఎదురుగా ఉన్న గల్లీలో కి వెళ్ళాక కాసేపు నడిచి తిరిగి ఎడమ వైపు తిరగాలి ఆ తర్వాత రోడ్డుపై తిరిగి గల్లి చివరి వరకు వెళ్లాలి ఇది కాస్త గందరగోళంగా ఉంది కదా…..

కానీ బాగుండేది మెలికలు గా ఇది కొత్తగా చేరిన ఇల్లు కాని అంతకు ముందు ఉన్న ఇల్లు మాత్రం సూపర్ గా ఉండేది అది నాకు ఎంతో బాగా నచ్చింది చుట్టూ స్థలం  ఉండేది ఆడుకోవడానికి . ఈ కొత్త ఇంట్లో మాత్రం రెండే గదిలో ఉండేవి అయినా ఎండాకాలం కదా అందరం పైన డాబా పైన పడుకునే వాళ్ళం.

ఇక ఈ కొత్త ఇల్లు గురించి తరువాత మాట్లాడుకుందాం కానీ పాత ఇల్లు చాలా బాగుంటుంది అని చెప్పాను కదా. ఆ ఇంటికి వెళ్లాలంటే మాత్రం వెనక్కి వెళ్లాలి. అప్పుడే కొత్తగా కడుతున్నారు ఆపట్నం అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది నిజానికి అది జిల్లా కేంద్రం అన్నమాట. అంటే తాలూకా అంటారు అప్పుడు సరే అలా బస్టాండ్ వెనక్కి వెళ్ళాలి. తిరిగి రెండవ పక్కకు తిరిగితే స్ట్రెయిట్ గా వెళ్ళాలి. అక్కడ అన్ని తుమ్మ చెట్ల తో అడవిలాగా ఉంటుంది. నిర్మానుష్యంగా ఉంటుంది అది హౌసింగ్ బోర్డ్ కాలనీ లాగా కడుతున్నారు.

దాంతో ఇల్లు విసిరేసినట్టుగా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి. అలా ఉన్నా ఇళ్ళల్లో నే మా అమ్మమ్మ గారి ఇల్లు కూడా ఉంది. ఇక స్ట్రెయిట్ గా వచ్చి కుడివైపు తిరిగితే, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు  కనిపిస్తూ ఉండేది. ఆ పక్కన ఆ ఇల్లు కట్టడానికి వచ్చిన మేస్త్రీలు, కూలీలు గుడిసెలు వేసుకొని ఉండేవారు. అలా వచ్చేస్తే ఇండ్ల మధ్యలో ఉండేది. చుట్టూ ప్రహరీ గోడ కట్టి వదిలేశారు. ఆ గోడ ని దాటి లోపలికి వెళ్లగానే మట్టిలో సన్నని బాట ఉండేది.

కుడి పక్కన ఏవో పిచ్చి చెట్లు ఉండేవి. ఎడమ వైపున మాత్రం రెండు జామ చెట్లు, పక్కనే నీళ్ల తొట్టి అంటే హవుజు  దాన్ని ఆనుకొని ఒక బట్టలు ఉతికే బండ, అక్కడే దొడ్డు మల్లె చెట్టు ఉండేది. అక్కడే మా పిల్లల స్నానాలు, ఆ నీళ్లు జామ చేట్లకి, మల్లె చట్లకు ఆధారంగా దారి చేశారు. ఇక వేసవి కాలం అని కాకుండా జామ చెట్లకు పండ్లు కాసేవి. అవి చాలా తియ్యగా ఉండేవి. ఎడమవైపు చెట్లు ఆ పక్కనే రెండూ బాత్రూం లు ఉండేవి. దాని పక్కనే బోరు మోటర్, అక్కడే బావి బావిలో నీళ్ళు ఉండేవి. అంటే బావిలో నీళ్ళు ఉండగా మళ్లీ బోర్ వేసారు అన్నమాట.

అయితే బావి పక్కన చిన్న సంధు ఉండేది. ఒక మనిషి పట్టెట్టుగా… ఎదురుగా ఆ ఇంటి చివర ఇంకో ఇనపగేటు ఉండేది. కుడి వైపున కాస్త స్థలం ఉంది. చిన్న చిన్న గడ్డి పూల చెట్లు ఉండేవి. అయితే అది రెండు పోర్షన్ ల ఇల్లు. ఇంకొక రెండు గదుల్లో కాలేజీ స్టూడెంట్స్ ఉండేవారు. అమ్మమ్మ వాళ్ళది హాలు పెద్దగా ఉండి, కిచెన్ చిన్నగా ఉన్నా పొడవుగా ఉండేది. అందులోనే బాత్రూం ఉండేది. కానీ, అది వాడేవారు కాదు. ఇక ఆ ఇంటి ఓనర్ ఆ ఇంటిని అమ్మమ్మ వాళ్లకి అప్పగించారు. కిరాయిలు బ్యాంక్ లో వెయ్యండి అని వాళ్ళు హైదరాబాద్ కి వెళ్లిపోయారంట. వాళ్ళు ముస్లిం లు.

అమ్మమ్మ వాళ్లు కాలేజీ పిల్లలు బ్రతిమిలాడితే ఇచ్చారంట. వాళ్లు వండుకొనితింటూ, కాలేజీకి వెళుతూ చదువుకుంటూ, ఉన్నారు. అందరూ ఆ పక్కల ఉన్న పల్లెల్లోని వాళ్లే. వాళ్లకి ఆ పల్లెల నుండి కూరగాయలు బియ్యం వస్తాయి. దాంతో అమ్మమ్మ వాళ్ళు కూడా ఇచ్చేవారు అంట. ఇక ఆ ఇల్లు ఇల్లు స్లాబు వేసిన డాబా అనుకోవచ్చు. నేను ముందు చెప్పినట్లుగా బావి పక్కన మెట్లు ఉండేవి పైకి వెళ్లడానికి వీలుగా.

అక్కడ అంటే బావికి మోటార్ కి మధ్య మెట్ల మధ్య పెద్ద తులసి కోట పెట్టుకుంది మా అమ్మమ్మ. ఇక సాయంత్రాలు కాస్త చల్లబడగానే, మా పిన్నిల్లో ఎవరో ఒకరు, బావిలో నుండి నీరు చేది, డాబా పైకి తీసుకువెళ్లి చల్లేవారు. ఆ సమయంలో అందరం బయట కూర్చునే వాళ్ళం. ఎందుకంటే పైనున్న వేడి, ఇంట్లోకి వస్తుందని. మేమంతా అక్కడ అంటే ఇంటి ముందు చిన్న అరుగు ఉండేది. దాని ముందు ఇసుక ఉండేది.

ఆ ఇసుకపై చాప వేసుకొని కూర్చొనేవాళ్ళం. ప్రహరీ గోడ ఉంది కాబట్టి, మనకు అక్కడినుండి వెళ్ళేవారు కనపడరు మనం వారికి కనపడము. కాని, కుడివైపు నుండి వెళ్లేవారు, వచ్చేవారు మనకి కనపడతారు. చెట్లు చాటు ఉండడం వల్ల మనం వాళ్ళకి కనపడము. అక్కడినుండి మళ్ళీ బస్టాండ్ కు వెళ్లాలంటే ఖచ్చితంగా స్కూటర్ కానీ, సైకిల్ కానీ ఉండాల్సిందే. అక్కడ షాప్స్ కూడా చాలా తక్కువగా ఉండేవి. అందుకె నెలకు ఒక్కసారి సామాను తెచ్చుకునేవాళ్ళం అత్యవసరం అయినవి ఏవి ఉండేవి కావు.

పాలు, పెరుగు, కూరగాయలు, చుట్టూ ఉన్న పల్లెలనుం డి తెచ్చి అమ్మేవారు. దాంతో ఇక అవసరాలు అంటూ ఎవి ఉండేవి కాదు. ఇక అక్కడి నెలంతా నల్లని మట్టితో ఉండేది. ఆ మట్టిపై నీళ్లు పడితే కమ్మని వాసన వచ్చేది. ఇక నీళ్ళ తొట్టిలో ఉన్న దొడ్డు మల్లెల చెట్టుకు చాలా పూవులు పూచేవి. చూడడానికి చిన్న చెట్టే అయినా, కానీ బుట్టెడు పువ్వులు కాకపోయినా మా అమ్మ తో కలిపి నలుగురి తల్లోకి వచ్చేవి. తలా కొన్ని కాంటకు గుచ్చి పెట్టుకునేవారు వేసవి మొదట్లో అలా, వేసవి పూర్తయ్యే సరికి తలా మూరా వచ్చేవి బయట కొనే కన్నా ఇది మంచిదే కదా….

ఇక ఇల్లు చాలా పొడవుగా, విశాలంగా, అందంగా ఉండేది (అంతా ప్లేస్ ఉన్నప్పుడు మా అమ్మమ్మవాళ్లు రకరకాల పూల, పండ్ల చెట్లు పెంచుకోవచ్చు కదా… కానీ ఎందుకో అలా చెయ్యలేదు. ఇప్పుడైతే ఆ ఇల్లు ఎలా ఉందో) ఇక ఇంటి వెనకాల ఇనుప గేటు ఉన్న తలుపు తీసుకొని వెళ్తే, అక్కడ అంతా కొత్త ఇళ్ళ కోసమో, స్థలం గుర్తింపు కోసమో కానీ, చిన్న చిన్న రాళ్ళు ఉండేవి. అక్కడే గుబురుగా తుమ్మ చెట్లు కూడా ఉండేవి.

వాటితో పాటు విసిరేసినట్టుగా ఇల్లు కూడా ఉండేవి. అక్కడ చాలామంది స్థలం తక్కువ ధరకు వస్తుందని కొనుక్కుని ఇల్లు కట్టుకుని ఉంటున్నవారు. చాలా మంది సొంత ఇల్లు వారే కిరాయికి ఉన్న వారిని వేళ్లపైన లెక్కపెట్టవచ్చు మార్కెట్లో అమ్మడు కానీ కూరగాయలు ఇక్కడ అమ్ముకొని వెళ్లేవారు. లేదా పొద్దుటే పల్లె నుండి వచ్చి ఆ వీధుల్లో తిరిగి అమ్మేవారు

వారిదగ్గర కూరగాయలు చాలా లేతగా బాగుండేవి. అలా తీసుకోగానే ఇలా వండితే అబ్బో ఆ రుచి వర్ణించలేము. దాని గురించి తర్వాతి భాగంలో చెప్పుకుందాం కానీ ఇక ఈ ఇళ్లలోని వారంతా దాదాపు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండటం విశేషం. కిరాయికి ఉన్న వారిలో చాలామంది ఉపాధ్యాయులు లెక్చరర్ కావడం ఇంకో విశేషం. ఇక ఇల్లు అంటే ఇలాగే ఉండాలి ఇలా లేదంటే అది ఇల్లు కాదు అనిపించేది నాకు అప్పుడు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా అంతే చుట్టూ ప్రహరీ కోట లాంటి ఇల్లు ఉండాలి నీటి వసతి కరెంటు వసతి ఉండాలి. అలాగే ఆ ఇంట్లో జామ చెట్లు పెంచుకుని వాటికి తాడు కట్టుకుని ఉయ్యాల ఊగాలి. లేదా ఆ చెట్ల నీడలో పడక కుర్చీ వేసుకుని చెట్లపై వదిన రామచిలుకల కువకువలు వింటూ అలాగే నిద్రపోవాలని చల్లని సాయంత్రాలు మా ఇంటి డాబాపై తిరుగుతూ చుట్టూ ఉన్న ప్రకృతినీ అస్తమిస్తున్న సూర్యుడు ని చూడాలని ఆ ఖాళీ అయిన స్థలంలో నాకు నచ్చిన పూల పళ్ళ మొక్కలను పెంచుతూ వాటికి సేవ చేస్తూ ఆ ప్రకృతిలో మమేకం అవ్వాలని నా చిరకాల కల.

ఇది తీరుతుందో లేదో నాకు తెలియదు కానీ జీవితంలో నాకు ఉన్న తీరని కోరిక నా జీవిత లక్ష్యం అదే అయ్యో మాటల్లో పడి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను సరేలే మళ్ళీ తరువాత అమ్మమ్మగారిల్లు రెండో భాగంలో మా వేసవికాలపు వినోదాలు వింతలు అనుభూతులు మీతో పంచుకోవడానికి మళ్ళీ వస్తాను ఇక్కడితో అయిపోలేదు ఇంకా చాలా ఉంది…

********** భవ్యచారు

Related Posts