వేసవి కాలం లో అమ్మమ్మ గారిల్లు (తాతయ్య ముచ్చట్లు)

వేసవి కాలం లో అమ్మమ్మ గారిల్లు

(తాతయ్య ముచ్చట్లు)

నమస్తే అండి.. మా అమ్మమ్మ గారింట్లో సిరిస్ లో ఈ రోజు తాతయ్య గురించి తెలుసుకుందాం … మా తాతయ్య గారు గవర్నమెంట్ కాలేజి లో యు.డి.సి . గా పని చేసేవారు అయితే తను చదువుకున్నది అప్పటి కాలపు చదువు హెచ్.యెస్ .ఎల్. సి . నో  డిగ్రీ  నో  ఏమిటో నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం అయితే చేసేవారు. అప్పట్లో అది రావడం చాలా గొప్ప కానీ జీతాలు మాత్రం తక్కువ, మరియు అవి రావడం కూడా ఆలస్యం అయ్యేది దాని వల్ల కొన్ని సమస్యలు వచ్చేవి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం … ..ఇక అది వదిలేద్దాం మన ముచ్చట్లోకి వచ్చేద్దాం….

ప్రొద్దున్నే అయిదు గంటలకు లేచేవారు తాత గారు తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని చెప్పులు వేసుకుని బయటకు వెళ్ళేవారు. తను నడుచుకుంటు బస్ స్టాండ్ వరకు వెళ్ళేవారు అది మూడు కిలోమీటర్లు ఉండేది అని ముందు భాగం లో చెప్పాను కదా .. అలా వెళ్ళేవారు అంటే వాకింగ్ లాగా అన్నమాట అలా వెళ్లి అక్కడ పేపర్ చదివేసి, టీ తాగుతూ తెలిసిన వారితో మాట్లాడి కొద్దిసేపు కాలక్షేపం చేసి ఏవైనా కూరలో, పళ్ళో తనకు నచ్చినవి, ఒక వేళా తినాలని అనిపిస్తే  కనిపిస్తే తీసుకుని వచ్చేవారు.

ఇక రాగానే కళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చేసి కూరగాయలు అమ్మమ్మకు ఇచ్చేసి మళ్ళి కాసేపు ఒరిగేవారు పది నిమిషాల తర్వాత లేచి అమ్మమ్మ ఇచ్చిన టీ తాగి ,అలా ఇంటి ముందుకో, వెనక్కో వెళ్ళి చుట్టూ చూస్తూ ఎక్కడైనా చెట్లు కానీ, రాళ్ళూ కానీ కనిపిస్తే ఏరుతూ వాటిని పక్కకు వేస్తూ ఉండేవారు పిల్లలకు గుచ్చుకుంటాయి అని. పక్కన ఉన్న కాలేజి పిల్లలతో ఎదో ఒక పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండేవారు. అప్పటికి సమయం ఏడున్నర అయ్యేది దాంతో మళ్ళి అమ్మమ్మ ఇంకొక టీ ఇచ్చేది.దాన్ని తగిన తర్వాత రేడియో పెట్టేసి తానూ స్నానానికి వెళ్ళేవారు.

స్నానం నుండి రాగానే బయట సూర్యుడి ముందు నమస్కారం, సంధ్యావందనం చేసుకుని చిన్న షెల్ప్ లో ఉన్న దేవుడి ముందు దీపం పెట్టేసి తిరిగి మళ్ళి ఇంటి ముందుకు వచ్చి తుడుచుకునే వాళ్ళు  ఆ సమయం లో ఎవరైనా పాల వాళ్ళు కానీ, లేదా కుర్ల వాళ్ళు కానీ వస్తే మా అమ్మమ్మను పిలిచేవాళ్ళు తీసుకొమ్మని నచ్చితే తానే తీసుకునే వారు.

ఇక రెడీ అవ్వడానికి తెల్లని  ధోతి కమీజు వేసుకుని రెడీ అయ్యేవారు తాను ప్యాంటు వేసుకోగా నేనెప్పుడూ చూడలేదు నాకు ఉహ తెలిసేప్పటికే తాతయ్య గారు ధోతి లోకి మారి పోయారు.ఇక రెడీ అవ్వడం ఆలస్యం అనసూయా అని అమ్మమ్మను పిలిచేవారు. దాంతో అమ్మమ్మ ఆ వస్తున్నా ఒక్క నిమిషం అని అయిదు నిమిషాలు చేసి వచ్చి స్టూల్ నీ జరిపేది. తాతయ్య మంచం కోడుమీద కూర్చునె వారు అమ్మమ్మ ఒక పెద్ద కంచం, నీళ్ళు తెచ్చి  పెట్టి ముందుగ ఒక పచ్చడి, కూర , ఒక గిన్నెలో పప్పు వేసి అన్నం వడ్డించేది వేడి వేడిగా తాతయ్య తినేసే వారు మేము ఆ కంచాన్ని అపురూపంగా చూసేవాళ్ళం అది చాలా పెద్దగా ఉండేది వెండి కంచం కాదు స్టీల్ కంచమే కానీ దానికో కథ ఉందని చెప్పేది అమ్మమ్మ. దాని గురించి మళ్ళి చెప్తాను లెండి..

ఇక తినడం అయ్యాక,బయటకు వెళ్లి కడుక్కుని వచ్చేవాళ్ళు, ఆ తర్వాత కొంచం వక్కలు దంచి ఇచ్చేది అమ్మమ్మ దాంతో పాటూ పుదిన వేసి ఇచ్చేది దాన్ని వేసుకుని  కాసేపు కూర్చునేవారు మా పిల్లల్లో ఎవరినో ఒకర్ని దగ్గరకు తీసుకుని ముచ్చట్లు పెట్టె వారు ఇంతలోనే రేడియోలో హిందీ వార్తలేవో వచ్చేవి అవి వినేసి, తొమ్మిది గంటలకు ఇక బయలు దేరుతూ అమ్మమ్మని పిలిచి ఏదైనా చెప్పేది ఉంటె చెప్పేవారు. అమ్మమ్మ ఏదైనా ఇంట్లోకి ఇది కావలి, అని చెప్పిన వెంటనే సరే ఎవరినైనా పంపిస్తాను అని చెప్పేసి , జేబులోంచి ఒక అయిదు రూపాయలు తీసి అమ్మమ్మ చేతిలో పెట్టేవారు కూరగాయల కోసం,అయినా ఇంకేదైనా పళ్ళ కోసం అయినా పిల్లలకు ఏదైనా వస్తే తీసుకొమ్మని చెప్పేవారు.

ఆ తర్వాత మా పిల్లల్లో ఎవరినో ఒకర్ని తీసుకుని బయలుదేరేవారు నన్ను ఎత్తుకున్న గుర్తు అయితే నాకు లేదు మరి చిన్నగా ఉన్నప్పుడు ఎత్తుకున్నారేమో కానీ ఉహ తెలిసాక ఎత్తుకోలేదు అయితే దగ్గరగా కూర్చోబెట్టుకుని కథలు చెప్పేవారు లేదా కబుర్లు చెప్పేవారు. ఇక తమ్ముడిని తిస్ఉకుని బయటకు నడిచి కాస్త దూరం లో ఉన్న కొట్టు దగ్గరికి వెళ్లి అక్కడ తనకు పల్లి పట్టి కానీ, బొంగులు కానీ ఇప్పించి వాటిని తమ్ముడి జేబులో వేసి మళ్ళి తిరిగి వచ్చి తమ్ముడిని ఇంట్లో ఇచ్చేసి వెళ్ళిపోయేవారు.

ఇక తాతయ్య ప్రొద్దున వెళ్ళారు అంటే తిరిగి రావడం రాత్రి ఏడూ గంటలకే మధ్యానం అన్నం తినడానికి వచ్చేవారు కాదు ఎందుకంటే నాలుగు కిలోమీటర్ల దూరం  ఉండేది కాలేజి ఇక మధ్యానం లంచ్ సమయం లో ఎవరినైనా కాలేజి లో పనిచేసే చేప్రాసిని పంపేవారు కట్టెలు తెమ్మని అతను పంతులు పంపాడు అని అంటూ కట్టెలు తెచ్చి ఇచ్చేవాడు అప్పటికే కట్టే కార్ఖానాలు ఉన్నాయి వాటిలో మంచి ఎండిన కట్టెలు అమ్మేవారు రెండు రూపాయలకు కిలో కట్టెలు లాగా వాటితోనే వంట చేసేది అమ్మమ్మ ఇక రాత్రుళ్ళు వర్షా కాలం లో  అయితే  కిరోసిన్ స్టవ్ మీద వండేది.

కాలేజి అయ్యాక అన్ని సర్దేసుకుని  అటూ నుండి తాతయ్య తన అన్నయ్య వారి ఇంటికి వెళ్లి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుని వస్తూ,వస్తూ జామకాయలో, సపోటాలో,మామిడి పళ్ళో లేదా రేగీపళ్ళో  తీసుకుని రాత్రి రేడియోలో ఏడుగంటల వార్తలు వచ్చేసమయానికి తాతయ్య ఇంటికి వచ్చేవారు. తాతయ్య రాగానే మేము తాత తాత అంటూ ఎదురు వెళ్ళేవాళ్ళం. మాకు పళ్ళు ఇచ్చేసి మళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి కాసేపు పిల్లలతో, మాతో,  అమ్మమ్మ తో కాలేజి కబుర్లు, తన అన్నగారి కబుర్లు చెప్పేసి ఎనిమిది గంటలకు అన్నం తినేసి, కాసేపు బయట తిరిగి వచ్చి పడుకునే వారు. ఇలాగే ప్రతి రొజూ క్రమం తప్పకుండా జరిగేది…కొన్నాళ్ళకు విషయం మారిపోయింది ఎంతో బాగుండే తాతయ్య ఏదోలా అయ్యాడు ? అదేంటి ? అనేది మీకు మళ్ళి వారం చెప్తానేం ఏం జరిగి ఉంటుందో  ? అనేది మీరేమైనా ఉహిస్తే కామెంట్స్ చెయ్యండి…. బై

Related Posts

3 Comments

Comments are closed.