శక్తికి ప్రతిరూపం మహిళ

శక్తికి ప్రతిరూపం మహిళ ప్రకృతి పర్యాయపదం ఆడది. సముద్రమంతా లోతు ,ఆకాశం అంత మనసు …సృష్టిలో ప్రతి జీవి చూసేది తొలుత స్త్రీ మూర్తినే… అటువంటి స్త్రీ మూర్తికి సమాజంలో అడుగడుగున అవరోధాలే…
పురుషాధిపత్య సమాజంలో స్త్రీ అడుగనుగునా అణచివేతకు గురవుతూ వస్తుంది.

గత కాలపు అణిచివేతలతో ఆనాటి స్త్రీ తనలో తనని పరికించడంలో ఎక్కడో వెనుకబడింది. నేటి తరం స్త్రీ తనకేమి కావాలో తనను తాను తెలుసుకొని ముందుకు వెళ్లడానికి కొత్తదారులు వెతుకుతుంది.
నేటితరం మహిళలు పురుషులతో దీటుగా అన్ని రంగాలలో పోటీ పడుతూ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ పోటీ తత్వంలోనే కొందరు తమని తాము మర్చిపోతున్నారు, మానసికంగా కుంగిపోతున్నారు లేదా మేము పురుషులకంటే అదములము కాము అనే భావనతో పాతాళానికి జారుకుంటున్నారు.

ఒక మహిళ సాధికారత పొందితే ఒక కుటుంబం, ఒక తరమే కాకుండా దేశం మొత్తం అభివృద్ధి చెందుతుంది అని నానుడి ఉంది. అటువంటి కీలకమైన బాధ్యత కలిగిన స్త్రీ నేటి సమాజంలో రక్షణ లేకుండా పోతుంది ఆడవారి రక్షణ కోసం రాజ్యాంగం కల్పించిన ఎన్నో చట్టాలు వారికి అవగాహన లేకపోవడం వల్ల వినియోగానికి నోచుకోలేకపోతున్నారు. కొందరైతే అవే చట్టాల అడ్డం పెట్టుకొని వారి స్వప్రయోజనాలకు వాడుకునే వారు ఉన్నారు. ఈ దుర్వినియోగం వల్లే నిజంగా రక్షణ కలిగించాల్సిన చోట కూడా వ్యవస్థలు విఫలమవుతున్నాయి.

నేటితరం స్త్రీలు ముఖ్యంగా తమను తాము తెలుసుకొని జీవించాలి. కుటుంబం పట్ల బాధ్యత సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలి. దీనికి దోహదపడేది మాత్రం కుటుంబ వ్యవస్థ .కుటుంబంలో విలువలతో కూడిన జీవితం అలవర్చుకుంటే సమాజం బాగుంటుంది .చిన్న వయసును నుంచే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వారి స్వేచ్ఛ, హక్కులు వంటి వాటిపై అవగాహన కల్పించాలి. వీటి కోసం తల్లిదండ్రులు ప్రత్యేకంగా సమయం వెచ్చించాలి.

-రచన : జనని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *