ఛీ ఛి ఎప్పుడూ ఇవే కూరగాయలు తెస్తారు, చూడండి ఎలా ఉన్నాయో, సగం కుళ్ళిపోయి, సగం పాడైనవి, తక్కువ ధరవి, అయిదు రూపాయల కుప్పలు తీసుకుని వస్తారు, ఎప్పుడైనా మీ మొహానికి మంచి ధర పెట్టి, నిగనిగలాడే తాజాగా ఉన్న కూరగాయలు తెచ్చారా ఏమిటి పెళ్లి అయ్యి ఏడేళ్లు అవుతున్నా, ఎదుగు బోదుగు లేని సంసారం అని భర్తని తిడుతూ, సంచిలో ఉన్న కూరగాయలు కింద పోసింది పరిమళ.
ఆమె అరుపులు పక్క వాళ్ళు వింటే పరువు పోతుందని భావించిన మురళి కిటికీలు, తలుపులు ముసాడు, అది చూసి ఇంకా రెచ్చిపోయిన పరిమళ ఓయబ్బో దీనికి మాత్రం ఏమి తక్కువ లేదు. మహా ఆ పరువేదో మీకే ఉన్నట్టు, దేశంలో మీరోక్కరే మంచి వాళ్ళు ఆయినట్టు, అయినా మీ పిచ్చి కానీ లంచం తీసుకుంటే మాత్రం ఎవరికి తెలుస్తుంది, అదేదో తెచ్చి నా మొఖన పారేస్తే నా తిప్పలేవో నేను పడతాను.
పోనీ మీకు చాత కాదంటే చెప్పండి ఇచ్చే వారితో నేను మాట్లాడి బేరం కుదురుస్తాను అని అంటున్న పరిమళ మాటలకు ఆవేశంగా, కోపంగా తన దగ్గరగా వచ్చి, చూడు నేను ఇలాగే ఉంటాను, నేను సంపాదించేది ఇంతే, అని ఇంకేదో అనబోతున్న వాడల్లా పిల్లలు నాన్న అంటూ రావడంతో, పరిమళను వదిలి వాళ్ళను దగ్గరకు తీసుకున్నాడు. పిల్లలిద్దరూ బాబు, పాప. ఇద్దరూ రెండు, నాలుగేళ్ళలోపు వారు కావడంతో వారికి ఏమి అర్థం కాక తండ్రికి ఎదో చెప్తూ, ముందు గదిలోకి తిసుకుని వెళ్లారు..
గంట అవుతున్నా ఇంకా వంటింట్లోంచి ఏ చప్పుడు రాకపోవడంతో లేచి వచ్చి చూసాడు మురళి ఉన్నది తిన్న పరిమళ ముసుగుతన్ని నిద్రపోతుంది, అది చూసి గట్టిగా నిట్టూర్చి, పిల్లల కోసం కిచెన్ లోకి వెళ్లి వంట చేసే ఓపిక లేకపోవడంతో ఉప్మా మెత్తగా చేసి, వారికి పెట్టి తన ఆకలి పరిమళ మాటలకు చచ్చిపోవడంతో తినలేక, కూరగాయలు అన్ని సర్దేసి, ముందు గదిలో చాప వేసుకుని పిల్లలను చెరో దిక్కుగా పడుకోబెట్టుకుని పడుకున్నాడు మురళి.
పైన చూరుకేసి చూస్తూ పడుకున్న మురళికి గతం కళ్ళ ముందు కదలాడింది. తన కాలేజి రోజుల్లో తన హీరోయిజం చూసే కదా తన వెంట పడి మరి ప్రేమించింది పరిమళ, తన కోసం తన ప్రేమ పొందడం కోసం తన వెనకే తిరిగింది కుక్కలా, ప్రేమించిన ఆడదాన్ని కుక్క తో పోల్చాల్సి రావడం నిజంగా బాధకరం, కానీ ఆ రోజుల్లో తన మాటలకు, లంచాలు తీసుకునే వారంటే తనకు అయిష్టం, వారు సంఘంలో ఉన్న చీడ పురుగులు అని మాట్లాడిన పరిమళ ఇప్పుడు, అవన్నీ కాదని తనని లంచాలు తీసుకోమని ప్రోత్సాహిస్తుంది.
తాను ఆమె మాటలు విని లంచం తిసుకుంటే ఇంకేమైనా ఉందా తన ప్రిన్సిఫుల్స్ ని గంగలో కలిపినట్టే, ఆ లంచాన్ని ఇవ్వలేకే కదా తన ప్రాణ మిత్రుడు చనిపోయింది, ఆ లంచం ఇవ్వలేకే కదా తనకు వచ్చే అఫిసర్ ఉద్యోగాన్ని తన జూనియర్ దక్కించుకుంది. లంచం ఇవ్వద్దు అనే కారణంతో ఈ గుమస్తా గిరి చేస్తున్నది.
నిజానికి లంచం ఇవ్వడం అంటే అవినీతిని వృద్ధి చేసినట్టే, కానీ లంచం ఇవ్వక పోతే ఈ దేశంలో ఏ పనులు కావు అలా అని అందరిలా కాకుండా, నాలా కొందరు అయినా మంచి వాళ్ళు ఉండబట్టే ఈ లోకo ఇలా సాగుతుంది. తాను ఏమి ఆశించకుండా వారి పని చేసి పెడితే వారి కళ్ళలో కనిపించే ఆనందం, తృప్తి ఎంత లంచం తీసుకుంటే మాత్రం వస్తుంది.
వాళ్ళు తనని, తన కుటుంబాన్ని చల్లగా ఉండాలని దివిస్తుంటే తన మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది, అది పరిమళకు చెప్తే అర్థం కాదు. పేరుకే పరిమళ కానీ బుద్ది అంతా మురికి గుంట, ప్రేమించిన పాపానికి అదేం అన్నా విని వినకుండా, పట్టించుకోకుండా ఉంటున్నాడు..
ఒక వేళ ఏదయినా అంటే తనను పిల్లలను వదిలేసి పోతే సంఘంలో పరువు మర్యాదలు పోతాయి, లేదా పిల్లలకు తల్లిను దూరం చెసిన వాడిని అవుతాను అని ఒక వైపు, పది మందిలో భార్య వదిలేసి వెళ్ళింది అంటే సమాజం అనే సూటి పోటీ మాటలు, మగాడివి కాదా అని గుచ్చుకునే చూపులు గుర్తొచ్చి, ఒక సగటు వ్యక్తిలా సమాజానికి భయపడి పరిమళ ఏం అంటున్నా నాలుగు గోడల మధ్యనే కదా అని ఉరుకుంటున్నాడు.
మురళి ఆలోచనలతో ఎప్పుడూ నిద్ర పట్టిందో కానీ అమ్మ పాలు అని అంటున్న పాల వాడి పిలుపుకు మెలకువ వచ్చిన మురళి పరిమళ అలికిడి వినిపించక పోవడంతో, పిల్లలిద్దరిని కాస్త జరిపి లేచి గిన్నె తీసుకుని వెళ్లి పాలు పట్టాడు, అది చూసిన పాల వాడు కిసుక్కున నవ్వడంతో బిక్క చచ్చి పోయాడు మురళి, అమ్మగారు లేరా బాబు అని కూడా అడిగాడు.
తడబాటు గా ఉండి లోపల ఎదో పనిలో ఉంది అని సర్ది చెప్పాడు మురళి అయినా వాడి అనుమానం చూపులు గుచ్చుకుంటూనే ఉన్నాయి మురళి వీపుకు, తలుపేసి వచ్చి పాలు తీసుకుని వెళ్లి వంటింట్లో పెట్టాడు. అతని అలికిడికి లేచిన పరిమళ ముభావంగానే వెళ్లి అతను మొఖం కడుక్కుని వచ్చేoతలో టీ పెట్టి, వెళ్లి తాను కూడా మొహం కడిగి భర్త చూస్తూ ఉండగా గూట్లో టీ గ్లాస్ ని చప్పుడు చేస్తూ పెట్టి, విసురుగా లోనికి వెళ్ళింది.
మురళికి కోపం వచ్చింది కానీ కోపంతో టీ తాగాక పోతే అది వృధా అవుతుంది, గ్యాస్, నీళ్లు, పాలు, టీ పొడి అన్ని వేస్ట్ అని ఆలోచించి, పైగా రాత్రి అన్నం తినక పోవడంతో కడుపులో ఆత్మ రాముడి గోల వల్ల అది తీసుకుని తాగేసి, స్నానానికి వెళ్ళాడు. అది చూసి పరిమళ పిల్లలను లేపి, రెడి చేస్తూ, రాత్రి తాను తినగా మిగిలి పోయిన అన్నములో తాలింపు పెట్టేసి, నిమ్మకాయ పిండి పులిహోర చేసి, పిల్లలకు పెట్టి, దాన్నే మురళికి బాక్స్ లో పెట్టేసింది.
మురళి ఆమె చేస్తున్నది అంతా చూస్తూనే ఆఫీస్ కి రెడి అవుతున్నా, పరిమళ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రోజు అరుస్తూ, ఎదో ఒకటి మాట్లాడే పరిమళ అలా నోరెత్తకుండా ఉండడం మురళికి ఏమి నచ్చలేదు. కానీ ఇప్పుడు తానేమైన అంటే మళ్ళీ ఎక్కడ అరుస్తుందో, పక్క వారు ఏమనుకుంటారో, విని నవ్వుకుంటారేమో అని ఏం మాట్లాడకుండా బాక్స్ తీసుకుని, పిల్లలను బండి మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడు….
పిల్లలను స్కూల్ లో దించేసి, వాళ్లకు టాటా చెప్పాడు, వారికి స్కూల్ రెండు గంటల వరకే, రెండు గంటలకు పరిమళ వచ్చి, వారిని తీసుకుని వెళ్తుంది, బండి మీద వెళ్తున్న మురళీకి పరిమళ మీద జాలి వేసింది. పాపం తాను మాత్రం ఏం చేస్తుంది, ఎన్నో కోరికలతో, ఎన్నో ఆశలతో తనని పెళ్లి చేసుకుంది, చేసుకున్నప్పటి నుండి తనకు ఉద్యోగం రావడానికి మూడేళ్లు పట్టింది.
ఈ మూడేళ్ళలో ఎన్నో ఇబ్బందులు, తన తల్లిదండ్రులు పోవడం, చెల్లి పెళ్లి ఇవ్వన్నీ చూసేసి, అప్పుల వారి మాటలు, చెల్లికి ఇవ్వాల్సిన సారె కోసం ఆమె అత్తింటి ఎత్తి పొడుపు, మాటలు ఇవ్వన్నీ తనను బాగా కదిలించాయి. అసలే పేదరికంలోంచి వచ్చిందేమో, ఇక్కడైన సంతోషంగా ఉండాలని అనుకుంటే ఇక్కడ కూడా అదే పేదరికాన్ని చూసి తట్టుకోలేక అలా అరుస్తుంది. పాపం ఇక నుండీ తనను ఏమి అనకూడదని తన పిల్లల మీద ఒట్టేసుకున్నాడు మనసులోనే…,
ఆలోచనలో ఉండగానే అలవాటు అయిన దారి కాబట్టి బండి ఆఫీస్ ముందు అగడంతో, ఆలోచనలోంచి బయటకు వచ్చేసి, లోనికి వెళ్లి, సంతకం పెట్టేసి తన సీట్లో కూర్చున్నాడు. దాంతో ఇక బయట విషయాలన్నీ మర్చిపోయి తన పనిలో పడి పోయాడు మురళి. సాయంత్రం బయటకు వచ్చేసరికి మేఘాలు బాగా కమ్ముకున్నాయి. వర్షం అపుడో, ఇప్పుడో పడేలా ఉంది. త్వరగా ఇంటికి వెళ్లిపోవాలి అనే తొందరలో ఉన్న మురళి గబగబా బండి తీసి స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు.
మధ్యలోనే వర్షం స్టార్ట్ అయ్యింది చిన్నగా కానీ మురళి ఎక్కువగా తడవకుండానే ఇంటికి వచ్చేసి, బైక్ పార్క్ చేసి, లోపలికి అడుగు పెట్టబోయాడు ఇంతలో లోపల నుండి పరిమళ నవ్వులు బిగ్గరగా వినిపించాయి. ఇన్నేళ్ల తన కాపురంలో ఏనాడూ అంతగా నవ్వని పరిమళ అలా నవ్వడం వింటూ తన భార్యని అంతగా నవ్విస్తున్నది ఏమిటో అని కుతూహలంగా లోనికి వెళ్లి చూసాడు.
అక్కడ ఉన్న ఇనప కుర్చీలో కూర్చున్న వ్యక్తి మాటలకు పరిమళ అంతగా నవ్వుతుంది అనే విషయం అర్ధo కావడానికి అతనికి రెండు నిమిషాలు పట్టింది. అతని రాకను గమనించిన పరిమళ అతన్ని చూడగానే ఏమండీ వచ్చారా చూడండి ఎవరొచ్చారో అదే నేను అప్పుడప్పుడు చెప్తుంటానే మా మేనత్త కొడుకు వినయ్ అని అతనే ఇతను ఇన్నాళ్లు మన కోసం ఎక్కడెక్కడో వెతికాడoట ఇన్ని రోజులకు ఇక్కడున్నామని తెలిసి నా కోసం వచ్చాడు.
బావ పెద్ద బిజినెస్ ఎదో చేస్తున్నాడు అంట, ఇక్కడికి కారులోనే వచ్చాడు కానీ ఈ గల్లీలో మళ్ళీ వెనక్కి తిప్పలేను అని పక్క గల్లీలో పార్క్ చేసాడు. అని చూడండి నా కోసమేం తెచ్చాడో అని అంటూ రాత్రి జరిగిన గొడవ ఏం తెలియనట్లు, భర్త తడిచి వచ్చాడు అని కూడా చూడక తన బావ గురించి గొప్పగా కళ్ళు ఇంతగా చేసుకుని తనకు తెచ్చిన ఖరీదైన చీరను చూసి మురిసి పోతున్న పరిమళను చూస్తూ, ఏమి అనలేక పరాయి వ్యక్తి ముందు తనని కించపరచడం ఇష్టం లేక ఓహ్ అవునా మంచిదే మరి మీ బావను నాకు పరిచయo చేయవా అని అడిగాడు ఏమి అనలేక…
అయ్యో నా మతి మండ అంటూ బావ ఇదిగో ఈయనే మా ఆయన పేరు మురళి అని పరిచయం చేయగానే అతను హలొ అంటూ చేయి ఇచ్చాడు, తాను కూడా హలొ అని తనకు అక్కడ ఉండడం ఇష్టం లేక డ్రెస్ మార్చుకుంటా అంటూ లోనికి వెళ్ళాడు.
ఇక అప్పటి నుండి మొదలైంది వారి వికారపు చేష్టలు, అతనేమో పరిమళను ఆప్యాయంగా, ఒక రాణీలా చూస్తే, పరిమళ వినయ్ ని ఒక దేవుడిలా చూడడం, మురళిని పట్టించుకోకుండా ఉండడం. అతను బహుమతుల పేరిట ఇంట్లోకి కావాల్సిన సామాను కొంటుంటే ముందు తిరస్కరించినా, భార్య నోటికి భయపడి, నలుగురిలో పరువు పోవడం, పిల్లల ముందు అలుసు కావడం ఇష్టంలేని సగటుజీవి మురళి భార్య ఏం చేసినా ఏమి అనలేక నోరుముసుకుని ఉండడం అలవాటు చేసుకున్నాడు.
పైగా తనను డబ్బు కూడా అడగకుండానే ఇంట్లో కావాల్సిన పదార్థాలు ఉండడం, నచ్చింది చేసుకుని తినడంతో పరిమళ కాస్త బొద్దుగా ముద్దుగా అయ్యింది. కానీ తనకు ఎక్కడో అనుమానం, ఇంత డబ్బు వాడు ఊరికే ఇస్తాడా, ఇది ఏమి ఇవ్వకుండా అనే అనుమానం కానీ వారిద్దరూ ఎప్పుడూ తన ముందు అలా ప్రవర్తిoచ లేదు.
పోనీలే నాకు డబ్బు మిగులుతుందని అనుకుంటూ, తన పిల్లల మీద ఒట్టేసుకున్నాడు కాబట్టి పరిమళను ఏమి అనలేక, అడగలేక పోతున్నాడు మురళి, అలా అని భార్య వ్యక్తిత్వాన్ని అనుమానించలేక పోతున్నాడు. ఎందుకంటే తనని ప్రాణంగా ప్రేమించి, తన కోసం తన వాళ్ళను కూడా వదిలేసుకొని, మూడేళ్లు తన కోసం ఎదురు చూసిన తన భార్య తప్పు చెయ్యదు అనే నమ్మకంతోనూ, ఒక వేళ చేసినా తాను అడిగితే తన సంసారాన్ని తానే బజార్లో పెట్టుకున్నట్టు అవుతుంది.
ఇప్పటికే చాటుగా మాట్లాడుకుంటున్న వారికి ఇంకా ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని, అది పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుంది అని అతనితో అదే వినయ్ తో లేని స్నేహాన్ని నటిస్తూ, అంతా తనకు తెలిసే జరుగుతుంది అన్నట్టుగా సమాజానికి చూపించసాగాడు మురళి. నిజానికి వారి మధ్య ఏదైనా ఉందంటారా? లేదంటారా? మీరే ఉహించండి కామెంట్స్ లో పెట్టండి ముగింపు మీకే వదిలేస్తున్నా ….