సమయపాలనతో తెలుసుకో

సమయపాలనతో తెలుసుకో…!!!

అడవి ధర్మంతో మృగం బతుకును
మానవ ధర్మంతో సమాజం నడుచును
చీకటి వెలుగుల సూచికలే కాలచక్రమని…
పలుకే నోళ్ళకు సూక్తులుగా చేదెక్కిపోయి
కసి కంటితో కొరికిన స్వార్థం తోడేలైతే…
తలలెత్తని గొర్రెలుగా చస్తూ బతకాల్సిందే…

ధర్మార్థ కామ మోక్షాలకు అర్థాలు
సాంకేతిక లోపాలతో వీధిన బడ్డాయి…
తోడుకొనే వాటంతో కరుడుగట్టి పోయి
సంఘంలో దోచే వాడిదే పై చేయిగా
అధికారాల భూయిష్టాలే అడుగులైతే…
పోయిన బానిసత్వానికి మళ్ళీ స్వాగతమే…

కప్పిపుచ్చిన కథలతో సర్ధుకుపోకు
తిరగబడిన తీర్పు కావాలి తరాలకు…
యాచన కాదు యదార్థాన్ని బోధించాలి
గూకిన పొద్దు గుడిసెలలో దీపమై నిలిచి
రేపటి నవతరానికి సూర్యోదయమవ్వాలి
కార్యశీలతలతో కదంతొక్కి నడువాలి…
నిదరోని సమయం నీ గుండె సప్పుడవ్వాలి…

ముఖాలు మారే మనుషుల గుణాలు
నిలువని జాడలతో దారులు కాచేవే…
పూటకు దోసిడైన కల్లబొల్లి మాటలను
పరిస్థితులను సమయపాలనతో తెలుసుకో…
నీకు సాయపడడమన్నది తెలిసిన మోసం
నీకు నీవే సాక్ష్యమై నమ్మకమే ప్రయాణమై…
వీరుల త్యాగాలు సంస్కృతి సాంప్రదాయాల
ఆస్వాధింపులతో ఎత్తుబడక ఏతమవుతు…
పెత్తనాలులేని ప్రజాస్వామ్యాన్ని నడిపించు…

దేరంగుల భైరవ (కర్నూలు)
9100688395

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *