సాగిపోతున్న సహన శీలివి…!!!

సాగిపోతున్న సహన శీలివి…!!!

ముఖారవిందం ముడుతల మయం
పొరలు గమ్మిన చూపులు మందగమనం
రుచుల నాలుక పదునారుతు జారిన
దవడలు గొంతున తెగని ఆలోచనలతో
తరిగేదే జీవితమని తెలిసినా…
తపనని మార్చుకోక తరాల
వారసత్వాన్ని నడిపిస్తున్నావు…

తడి ఆరిపోతున్నది తనువైనా
మనస్సున మర్మాలకు రెక్కలు విరువక
తనవారి కోసం తనువెల్లా ఆనందాన్ని
తలుపులుగా తెరుచుకొని చూస్తావు…
విజయమైనా ఘోర పరాజయమైనా
ఒదిగిన ఓర్పును మననం చేసి
మజిలీగా నిలుపుకొంటావు…

ఎన్నో మూలాలకు మూలాధారం నీవు…
తరిగే బతుకున నిరుత్సాహాన్ని
నీరుగా తాగక…
ఆరంభం కాని ఆవిష్కరణలతో ఆగిపోక
ఎత్తి దించిన ఈ లోకంలో మనుషుల
రూపాలు నీగర్భధామం నుంచి దొరలిన
దాతువులే…నిన్ను గుర్తించని ప్రతిది
అంధకార బంధమే…

ఆకారాల వికారాలతో విలాసాన్ని
చూడాలనుకోవు…
కలగన్న కాలాన్ని కల్పనగా పిలువవు…
నీవొక సంగ్రామం తెలిసిన బతుకుకు
సాయుధ పోరాటానివి…ఒకనాటికి
ఒరగక తప్పదని తెలిసి నిత్య కర్మల
ప్రాకారాలపై సమయాన్ని తరుస్తూ…
చివరికై సాగిపోతున్న సహనశీలివి…

దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *