సారున్నారా?

మధ్యాహ్నం కమ్మగా నిద్రపోతున్న వేళ హాల్లో  లాండ్ లైన్ ఫోన్ గణగణ మోగింది…కమ్మటి నిద్ర చెదిరింది…

అసలు నాకు ఒక్కటర్ధం కాదు  నిద్రని ’కమ్మగా’ అని ఎందుకంటారో? అదేమైనా తినే వస్తువా?

సర్లె  ఈ మిట్టమధ్యాహ్నం సమయంలో తెలుగు గ్రామరు గురించి ఆలోచించడం ఎందుకు అనుకొంటూ పక్క మీద ఇంకోవైపుకి ఒత్తిగిల్లాను..మోగీమోగీ అదే ఆగి పోతుందిలే అనుకొంటూ…

పక్కన శ్రీవారి గుర్రు లయబధ్ధంగా వినిపిస్తొంది.. ఆయన లేచి ఫోనెత్తే ప్రశ్నే లేదు…

కాస్సేపు మోగీ ఆ ఫోను ఆగిపోయింది..”అమ్మయ్యా” అనుకొని కళ్ళుమూసుకొనేసరికల్లా మళ్ళా మోగింది…

ఇంక తప్పదనుకొంటూ పక్క దిగి హాల్లోకి నడిచాను.

“హలొ ఇది ఫలానా స్వరాజ్యలక్ష్మి గారి ఫోనేనా మాడమ్?” ఓ కోకిల స్వరం తియ్యగా అడిగింది.

“ఆ ఫలానా స్వరాజ్యలక్ష్మిగారి ఫోనే”

“మాడం నేను ఎస్ బీ ఐ మూచువల్ ఫండ్స్ ఆఫీసులోంచి మాట్లాడుతున్నాను”

“చెప్పమ్మా”

“మాడం సారున్నారా?”

“తల్లీ మీరు ఫలానా స్వరాజ్యలక్ష్మి గారి గురించి అడిగారు కదా ఆ ఫలానాను నేనే”

“అవును మాడమ్ ఫొను మీ పేరున రిజిస్టర్ అయిందని కన్ఫర్మ్  అయిందిలెండి..కానీ నేను మాట్లాడవలసింది సారుతో”

“ఏమైనా చెప్పాల్సింది ఉంటే నాతో చెప్పమ్మా”

“ఇది ఫైనన్షియల్ డెసిషన్ తీసుకొనే మాటర్ మాడమ్, అందుకే సార్ని పిలవమన్నాను మా మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పలి…సారునొకసారి పిలుస్తారా మాడమ్”

“సారు నిద్రపోతున్నారు..ఆ మ్యూచువల్ ఫండ్స్ గురించి నాకైనా చెప్పచ్చు..నేను ఫైనాన్సు డిపార్టుమెంటునుంచి రిటైరు అయ్యాను.. నాకూ ఆ విషయాలు తెలుసు…”

’సారు నిద్ర పోతున్నారు’ అన్న మాట వినపడగానే అట్నించీ టక్కున ఫొన్ పెట్టేసిన శబ్దం వినిపించింది నేను చెప్తున్న మిగిలిన మాటలు వినకుండానే!

జుత్తు పీక్కోబోయీ మానేశాను అసలే గుప్పెడు వెంట్రుకలు…అవికూడ పోతే చాలా కష్టం!

************

వంటింట్లో గుత్తివంకాయ కూరతో కుస్తీ పడుతుంటే కాలింగ్ బెల్లు చక్కగా గొంతెత్తి పాడడం మొదలెట్టింది..

“సరిగ్గా వంట మధ్యలో ఉన్నప్పుడే ఈ కాలింగ్ బెల్లుకి పాటపాడాలని బుధ్ధి పుడుతుంది” అని విసుక్కొంటూ వీధి తలుపు తియ్యడానికెళ్ళాను.

“రాముడు బుధ్ధిమంతుడు” అన్న స్టైల్లో తయారయి నిల్చొన్నాడొక పాతికేళ్ళ కుర్రాడు గుమ్మం ముందు…

ఆ డ్రెస్సూ..ఆ టై…చేతీలో ఆ ఫైలూ…చూస్తేనే తెలిసిపోతోంది రియలెస్టేట్ బాపతనీ

“మాడమ్ సారున్నారా?

“లేరు బజారుకెళ్ళారు… కాస్సేపట్లో వస్తారు. ఆయనకి ఏమైనా చెప్పాలా?”

” నేను ఫలానా రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి వచ్చాను. ఈ పేపర్లు చూపించి ఆయనతో మా వెంచర్ గురించి చెప్పాలి..సరే ఐతే సారొచ్చాక మళ్ళా వస్తా మాడమ్”

“ఆ పేపర్లేవో నాకూ చూపించవచ్చు..నాకూ వాటి గురించి తెలుసు..” నేను వాక్యం పూర్తి చేసే లోపల ఆ కుర్రాడు సగం మెట్లు దిగిపోయాడు!

గోడకేసి బుర్ర బాదుకొందామనిపించింది…కానీ ఈ బుర్రతో ఇంకా ముందుముందు చాలా పనుందనీ ఆ ప్రయత్నం మానుకొన్నాను.

***********

“పోస్ట్” అన్నకేకతో చేతిలో పని వదిలేసి వీధి గుమ్మంకేసి పరిగెత్తాను.

నేననుకొన్నట్లుగానే చేతిలో పాస్పోర్టున్న కవరుతో పోస్ట్ మాన్…

“వాహ్, రెన్యూ చేసిన పాస్పోర్టు వచ్చేసిందన్నమాట!” ఉత్సాహంగా అనుకొన్నాను. 

“ఫలానా స్వరాజ్యలక్ష్మిగారు మీరేనా మాడమ్?”

“అవును నేనే!”

“ఇదిగో మీకు పాస్పోర్ట్ వచ్చింది”

కవరందుకొనీ పోస్ట్మాన్ చెప్పిన చోట కాగితం మీద సంతకం చెసేశాను.

కాగితం పోస్ట్మాన్ చేతికందిస్తూ “థాంక్స్” అన్నాను.

కాగితం అందుకొన్నాక కూడా వెళ్ళిపోకుండా ఇంకా అక్కడే నిల్చొన్నాడు పోస్ట్మాన్.

“అమ్మా సారున్నారా?” నసుగుతూ అడిగాడు.

“ఏమిటి సారు పాస్పోర్టు కూడా వచ్చిందా” ఆత్రంగా అడిగాను.

“కాదమ్మా ఇలా పాస్పోర్టు వచ్చినప్పుడల్లా మాకు సంతోషంగా ఎంతోకొంత ఇస్తారు, సారు ఇంట్లో ఉంటే ఆయన్ను అడుగుదామనీ…” నీళ్ళు నమిలాడు పోస్ట్మాన్..

“ఓహో డబ్బులివ్వాలా…ఒక్క నిమిషం ఉండండి” అంటూ లొపలికేళ్ళి కొంత డబ్బు తెచ్చి అతని చేతిలో పెట్టాను.

“సారుకు థాంక్సు చెప్పండమ్మా..ఎవరూ మాకింత ఎక్కువ మామూలు ఇవ్వరు” అంటూ నిష్క్రమించాడు పోస్ట్మాన్

భోరుమంటూ ఏడవాలని బుధ్ధి పుట్టింది కానీ మరీ వీధిలోనే బావురుమంటే బాగోదనీ లోపలికి నడిచాను…

 

*************

“సారున్నారా” అని అడగడం ఒక్క ఇండియాలోనే జరుగుతుందా ఇంకా ఎక్కడైనా కూడానా?” అన్నది ప్రస్థుతం నా మిలియన్ డాలర్ల క్వశ్చను!

అమెరికాకి మా అబ్బాయి దగ్గరికెళ్ళినప్పుడు అక్కడా ఇలాంటి సేల్సుమాన్లు వచ్చేవారు…కానీ అక్కడ వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న ” మీ ఇంట్లో ఫైనాన్షియల్ డెసిషన్స్ (ఆర్ధికపరమైన నిర్ణయాలు) ఎవరు తీసుకొంటారండీ? ఎవరు తీసుకొంటే వాళ్ళతో మేము కాస్త మాట్లాడాలి”

ఇక్కడికి అలాంటి రోజు ఎప్పుడొస్తుందో!!!

 

Related Posts

2 Comments

  1. చాలా బాగుంది… మహిళలు ఎంత సాధించినా ఇంకా వంటింటి కుందేళ్ళుగా ఉన్నారు అని చాలా బాగా చెప్పారు అమ్మ…

  2. ఇదివరకు పరిస్థితులు అలాగే ఉండేవి.
    ఇప్పుడు మారాయి. కధ ఆలోచించే
    విధంగా ఉంది.

Comments are closed.