420

420

తనింకా యూత్ అని ఫీలయిపోతూ చిన్న వాళ్ళతో కలిసి పోతుంటాడు సీతారాముడు. యంగ్ జనరేషన్ తో ఎక్కువ కాలం గడపాలని ఆతని కోరిక.

సాయంత్రం పూట కాఫీ తాగడానికి తన బ్యాంకు పక్కనే ఉన్న తాజ్ మహల్ హోటల్ కి రోజూ వస్తూ ఉంటాడు. ఆ సాయంత్రమూ అలానే వచ్చాడు.

“హలో అంకుల్ ” పక్కింటి పున్నారావు కొడుకు వినాశ్ పిలుస్తూ కనిపించాడు. ఆ యంగ్ తరంగం పిలుపుకు ఫిదా అయిపోయి అటెళ్ళాడు సీతారాముడు

“ఏం చేస్తున్నావమ్మా”

“బ్యాంకు ఎగ్జామ్స్ ప్రిపేరవుతున్నా అంకుల్”
“నైస్”

వీళ్లు మాటల్లో ఉండగానే టీ తెచ్చాడు బేరర్. “ఓహో నువు చెప్పేశావా. బేరర్ నాకో కాఫీ” తన ఆర్డర్ చెప్పేశాడు. “ఏమిటోయ్ విశేషాలు క్రికెట్ చూస్తుంటావా
విరాట్ ను టీంలో ఉంచాలంటావా! పంత్ ఓపెనర్ కరెక్టేనా! సీతారామం చూశావా భలే తీశాడయ్యా..” ఇలా క్రికెట్ నుంచి సినిమాల వరకు తన పరిజ్ఞానాన్ని ప్రకటిస్తూ బేరర్ తెచ్చిన కాఫీని ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తాగేశాడు.

“బేరర్ రెండు బిల్లులు తేగానే అతని మీదపడి లాక్కున్నంత పని చేశాడు. ఫోల్డర్ పట్రా అని ఆర్డర్ వేసి, తెప్పించి రెండు బిల్స్ కు ఫోల్డర్ లో ఐదొందల నోటు ఉంచి అప్పుడడిగాడు. ఇంతకీ. ఎలా వచ్చావు దేనికొచ్చావు అంటూ

“బుక్స్ కొనటం కోసం అంకుల్” 
“కొనేశావా”
“లేదంకుల్, నెక్స్ట్ వీక్ రమ్మన్నాడు”
“సరే.. నేను డ్రాప్ చేస్తాను పద” అంటుండగానే బేరర్ బిల్ ఫోల్డర్ తెచ్చాడు.

ఛేంజ్ తీసుకుందామని చూసి షాక్ తిన్నాడు సీతారాముడు. ఇరవై నోటు మాత్రమే ఉంది. ఒక కాఫీ, ఒక టీ వందలోపే కదా అనుకుంటూ అప్పుడు చూశాడు వినాశ్ బిల్లు టీ తో పాటు మంచూరియా, పన్నీర్ మసాలా దోశ కూడా ఉన్నాయి. టోటల్ బిల్లు 420.

తన బిల్లు నలభై టాక్సులతో మొత్తం అక్షరాలా 480 రూపాయలు.. మింగలేక కక్కలేక వినాశ్ వంక వెర్రి నవ్వు నవ్వి లేచాడు.

కొసమెరుపేమిటింటే సీతారాముడు అంకుల్ ని బాగా స్టడీ చేసిన వినాశ్ ప్రీప్లాన్డ్ గా బిల్లు లో బాగా ఇరికించేయటం. ఆ తరువాత నుంచి సీతారాముడు యూత్ వంక కన్నెత్తి చూడకపోవటం.. కాఫీ కూడా ఒక్కడే తాగి వెళ్లి పోతుండటం…

– సి. యస్.రాంబాబు

Related Posts