ఆడది అంటే అంత అలుసా?
మీరు అసలు మనుషులేనా?
ఒక తండ్రికి పుట్టిన వారేనా?
తల్లికి పుట్టిన వారేనా?
ఉచ్ఛం , నీచం మరిచి,
ఆడదని కూడా చూడక
నలుగురు చూస్తూ ఉండగా నిన్ను కన్నది,
పెంచింది,
తోడ బుట్టింది,
నీ అలనా , పాలనా చూసేది , ఒక ఆడదే అని మరచి,
ఒకరి ఆలిని,
ఇంకొకరి తల్లిని,
సృష్టికి జీవం పోసేది ఒక ఆడది అని మరచి,
తన బట్టలు విప్పి నగ్నంగా చేసి,
తనను అవమానిస్తూ,
ఊరంతా తిప్పుతూ,
చెప్పులతో, రాళ్లతో కొడుతూ,
చదువుకున్నామనే సంస్కారం మరిచి,
పశువుల్లా మీద పడి కొడుతూ,
రక్కుతూ ప్రాణాలు తియ్యాలని చూస్తారా?
మీరొక మనుషులేనా ,
చదువుకున్న ముర్ఖుల్లా ప్రవర్తించే పశువుల్లా మారి,
అమ్మతనాన్ని కించపరుస్తూ ,
మానాభిమనాలతో ఆడుకుంటారా ?
అదే పని మీ అమ్మకో ,
అక్కకో జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటారా ?
ఎక్కడో ఏదో జరిగితే దాన్ని సోషల్ మీడియాలో
వైరల్ చేస్తూ ఉండే మీరు ఒక
ఆడదాన్ని నగ్నంగా మార్చి కొడుతూ ఊరేగిస్తూ ఉంటే,
వినోదం గా చూస్తారా ?
కనీసం ఆమె మీద గుడ్డ ముక్క అయినా కప్పాలని మీకు అనిపించలేదా ?
భారత దేశాన్ని ఏదో అన్నారని పాకిస్థాన్ ను తిట్టే మీరు ,
మీ అమ్మ లాంటి ఆడదాన్ని అగౌరవ పరుస్తుంటే ఆపకుండా ఉంటారా ?
ఆడది అంటే అంత అలుసా మీకు ? తల్లి లేని జననం ఉందా ? అక్క లేని జీవితం ఉందా ?
ఆలి లేని మనుగడ ఉందా ?
నీ జన్మకు కారణమై ,
నీ అభివృద్ధి కి ఆలంబన అయి ,
నీ వంశాన్ని పెంచే ,
నీ ఇంటిని నడిపే నిత్యతోరణమై నిలిచే ,
ఆడదాన్ని అబల అంటూ ఆడుకుంటూ ఉంటే వింతగా చూస్తూ ,
ఆమె అందాలను కొలుస్తూ నిలబడతారా ?
మీది ఒక బతుకేనా
కుక్కల వలె , నక్కల వలె ,
ఛీ అవయినా కళ్ళు మూసుకుని ఉంటాయేమో ,
కానీ మీలాగా వింతనుకుంటూ చూడవు.
ఇంకెన్నాళ్ళు ఈ హింస ?
కులం తక్కువైనా ,
కులం పెద్దదైనా ,
డబ్బున్న వాళ్ళు అయినా , డబ్బులేని పేద అయినా ,
మహిళల పట్ల హింసా ధోరణి మాత్రం ఒకేలా ఉంది.
ఇదెప్పుడు అంతం అవుతుంది ?
మగాళ్లు ఒకటి తెలుసుకోండి , ఆడవాళ్ళని హింసిస్తూ
మీరు ఆనంద పడతారేమో కానీ
ఆడది కన్నీరు కారిస్తే మీ అంతం మొదలయినట్టే ,
ఇప్పటికే అమ్మాయిలు కరువై పోతుంటే ,
ఉన్నవారిని ఏడిపించడం మీకు మాములైపోయింది.
అదే ఆడవాళ్ళు ఒక్కసారి తిరగ బడితే ,
అబలలం కాదంటూ మీ అంతు తెలిస్తే ,
ఉప్పెనలాగా చుట్టూ ముడితే ,
మీ రెక్కలు విరిచేస్తే ,
మీ కన్నా బలవంతులము అంటూ శక్తి చూపితే ,
మీ బొక్కలు విరగ్గొడితే ,
బిడ్డను కనే నొప్పిని తట్టుకున్న మాకు మీరెంత అనుకుంటే ,
తన శక్తి ముందు నిలబడే దమ్ము మీకుందా ?
సహనం కోల్పోతే , సహించడం మానేస్తే ,
అసలు తెగిస్తే మీరంటు ఉంటారా ? ఆలోచించండి ….
అంత వరకు తెచ్చుకోకండి ..
ఆడది అబల కాదు అనేది గుర్తుంచుకుని మసలండి.
ఇది కవిత కాదు నా ఆవేదన
Ilantivi chadivinappudu ilanti samajam lo nenu unnana ani badestundi
Nice bagundi but inka adavallu banisalam ani bhavinchinthakalam ilage untundi lokam thana varaku vachaka tiragapadaka povadam mana adavalla thappe avuthundi