ఆకలి కేక

ఆకలి కేక

సమయం రాత్రి ఏడుగంటల అవుతుంది చిన్న పెంకుటిల్లు నుంచి రెండు సంవత్సరాల పిల్లవాడు ఏడుస్తున్నాడు ఎంతకి ఆపడం లేదు ఆ ఇంట్లోకి వచ్చే వారు రావడం లేదు వెళ్లడం లేదు ఎంతగా ఎదురు చూస్తున్నాయి. ఆ కళ్ళు అయిన ఎవరూ కూడా చూడడం లేదు.

పిల్లాడు ఏడుస్తున్నా, ఎవరూ పట్టించుకోవడo లేదు. ఎవరు కూడా రావడం లేదు. ఎందుకు ఎవరికీ పట్టింపు లేదు. వర్షం రావడం వల్ల ఎవరికి వారే, వారి ఇంట్లో పని చేసుకుంటున్నారు.

ఇప్పుడు అలా చేస్తేనే, ఏ అర్ధ రాత్రో వాళ్లు, కడుపునిండా తింటారు. అందరి ఇళ్ళ లోకి జనాలు వెళ్లడం చూసి, తన ఇంట్లోకి ఎవరూ రాకపోవడం, చూసి, వైదేహి బయటకు వచ్చింది. ఇక లాభం లేదని ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చింది.

పిల్ల వాడి ఏడుపు పట్టించుకోక, ఆ పిల్లవాడి ఏడుపు ఆపాలంటే, కడుపునిండా అన్నం పెట్టాలి. అది పెట్టడానికి తన దగ్గర ఏమీ లేవు. ఇంట్లో కూడా ఏమీ లేవు. అందుకే విధిలేని పరిస్థితుల్లో, ఆ వానలో తడుస్తూనే వెళుతుంది.

ఆ వీధి చివర ఒక చిన్న దుకాణం ఉంది. దాంట్లో ఏమైనా వెళ్లి తీసుకురావాలి, అని అనుకుని, గబగబా నడవసాగింది… వర్షం కురుస్తూనే ఉంది, చాలా బీభత్సం గా ఉంది వాతావరణం….

అలా పూర్తిగా తడిచిపోయింది. చీర కాళ్ళకి తట్టుకుంటుంది. తడిసిన చీరలో నడవలేక, నడుస్తూనే, ఆ వీధి చివరి వరకు వెళ్ళింది. కానీ, అక్కడ చూసేసరికి, ఇంకా నీరసం ఆవహించింది.

అది కట్టేసి ఉంది. ఎలాగైనా బిడ్డ కడుపు నింపాలని ఉంది. కానీ, అక్కడ దుకాణం మూసి ఉండటంతో, ఏం చేయాలో తెలియక, ఒక ఐదు నిమిషాలు అలాగే నిలబడింది.

ఆ అయిదు నిమిషాల్లో, ఎన్నో ఆలోచనలు, ఈ రోజు కూడా తిండి లేకపోతే, పాలు రావు, బాబు తాను ఆకలితో చనిపోవలసిందే. ఈరోజు ఎలాగైనా తాను తినాలి, బిడ్డని బ్రతికించుకోవాలి.

వారం రోజులుగా పస్తులతో, ఓ పూట తిని, ఓ పూట తినక ఉంటుంది. దానివల్ల నీరసం వచ్చింది. కానీ, ఏ ఒక్కరూ దయ చూపించి, పని ఇవ్వలేదు.

కాదు, వాళ్లు చూపించిన ఆ పనికి, ఆమె ఒప్పుకోలేదు. ప్రేమించిన వాడు నమ్మించి, తల్లిని చేసి, పిల్లడు పుట్టాక, తను తెచ్చిన నగలతో, డబ్బులతో, ఉడాయించాడు.

దాంతో ఉన్న ఇల్లు ఖాళీ చేయవలసి వచ్చింది. బయట రోడ్డు మీద తిరుగుతున్న, తనని పని చూపిస్తా, అని నమ్మించి తెచ్చి, ఈ ఊరిలో అమ్మి వేసింది. ఒక ఆడది, ఆడదానికి ఆడదే శత్రువు, అనేది అప్పుడు అర్థమైంది తనకి కానీ, చేసేదేమీ లేదు.

తాను తన కొడుకు పస్తులతో, చనిపోవాలి. పది రోజుల నుండి, పని కోసం వెతుకుతూ ఉంది. కానీ, అందరి కళ్ళు, తన శరీరం మీద పడ్డాయి. ఎవరూ పని ఇవ్వలేదు. అందులోనూ బిడ్డ తల్లివి, నువ్వేం చేస్తావ్! అని అన్నారు.

ఈ రోజు తప్పక బయటకు రావాల్సి వచ్చింది. అక్కడికి తనని ఆమ్మిన ఆమె, యజమాని బ్రతిమాలింది. ఏదో ఒక పని చూసి పెట్టమని ఆత్మాభిమానం చంపుకుని తాను ఆ పనికి ఒప్పుకుంటున్నా అని, కానీ ఆవిడ ఒప్పుకోలేదు.

బిడ్డ తల్లివి, పైగా పాలిస్తున్నావ్? నీకు ఎవడు వస్తాడు? వచ్చినప్పుడు చూస్తాలే, అయినా మాకే ఇప్పటికీ ఎవరు దిక్కు లేదు, అంతవరకు, నీ వరకు వస్తే చూద్దాం, అంది డబ్బు అడిగితే…

అదే ఉంటే, నీకు నీతులు చెబుతూ ఇక్కడ కూర్చుంటానా ? నాకు పొద్దటి నుండి ఒక్క గిరాకీ లేదు. వెళ్ళు, వెళ్ళు అంది ఈసాడిస్తూ ,

ఒక్కసారిగా తన ఊరు, ఊర్లో ఉన్న కన్నవారు, గుర్తుకు వచ్చారు. వాళ్లని మోసం చేసి , ఇక్కడికి వచ్చినందుకు, తనకి తగిన శాస్తి జరగాల్సిందే…. అని అనుకొని

వాన లో తడుస్తున్న, అదేం పట్టించుకోకుండా. ఒక్క పది రూపాయలు అయినా, దొరికితే పిల్లవాడికి పాలు పట్టవచ్చు, అని అనుకుంది. నడుస్తూ, ఎదురుగా పెద్ద మేడ ఉంది. అందులోకి వెళ్లి ఎవరినైనా, సహాయం అడగాలి అని అనుకుంది.

అలా అనుకుని , సెక్యూరిటీని తప్పించుకొని లోనికి వెళ్ళింది. ఎవరు కనిపించలేదు. ఆమె ఆశ్చర్య పోయింది. అంత పెద్ద బంగాళా లో, ఎవరూ లేరు అని అనుకుంటూ, ఓ పక్కగా ఉన్న, కిటికీ తీసి చూసింది.

బయట ఎవరు లేకున్నా, లోపల చాలామంది ఉన్నారు. ఎవరి పని వాళ్లు చేస్తున్నారు. శబ్దం లేకుండా, ఒక తెల్లటి పొడిని, ప్యాకెట్లు లో వేసి, నింపుతున్నారు. మిగతా వారు వాటిని డబ్బా లో పెడుతున్నారు, చటుక్కున తనని ఎవరో చూస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగింది. కిటికీ మూస్తూ…

ఏయ్ ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావ్? ఏం చూసావ్? చెప్పు, అరేయ్ ఇది ఎవత్తో వచ్చి, మన బిజినెస్ అంతా చూసింది. దీన్ని ఓ చూపు చూద్దాం, రండి. అని పిలిచాడు వాడు..

అది కాదు, నాకు పని కావాలి. నా కొడుకు పాల కోసం ఏడుస్తున్నాడు. నాకు ఒక పది రూపాయలు ఇస్తే , వెళ్లి బిడ్డకు పాలు పట్టాలి. అని అంది ఏడుస్తూ….

ఏంటి ఏవేవో కథలు చెప్తున్నావ్? మా చెవిలో పువ్వులు ఏమైనా కనిపిస్తున్నాయా నీకు? చెప్పు ఎవరు పంపరూ నిన్ను అంటూ….. చేతిని పట్టుకుని గుంజుతున్నాడు.

నన్ను ఎవరూ పంపలేదు. నేను ఏం చూడలేదు. ఈ వివరాలన్నీ ఎవరికీ చెప్పను. దయచేసి, నన్ను వదిలి పెట్టండి.

నాకు పది రూపాయలు ఇవ్వండి. ఇస్తే, వెళ్ళిపోతాను, అంది దీనంగా. అదంతా, వింటున్న వారిలో ఒకడు, నిజంగా అది పిచ్చిది ఏమోరా… పది రూపాయలు ఇస్తే పోతుందేమో? అన్నాడు.

అరేయ్, ఇప్పుడు పోలీసులు ఇలాగే వస్తున్నారా.. ఎవర్ని నమ్మడానికి వీలు లేదు. ఇది అన్ని కథలు చెబుతోంది.

దీని పట్టుకోండి, అనగానే అది కాదు, నేను చెప్పేది వినండి. దయచేసి, అన్నది వైదేహి. ఏంటే నువ్వు చెప్పేది… నువ్వు ఏం చెప్పినా మేము వినం…..

ఇక్కడ చూసింది, నీతోనే సమాధి కావాలి. అంటుండగానే, అతని చేయి కొరికి ఆమె బయటికి పరిగెత్తింది. ఎక్కడి నుంచి వచ్చిందో అంత శక్తి? అలా పరుగు తీస్తూనే ఉంది.

తన వెనకే తన మృత్యువు, తరుముకుంటూ వస్తోంది. వాళ్లు తను చెప్పింది నమ్మడం లేదు. ఎలాగైనా తను తప్పించుకోవాలి అని అనుకొంది. తాను పరుగెత్తుతుంది……

వానలో తడుస్తూ, తనకు తానే కోరుకున్నట్టు, మృతువు ని కోరుకున్నట్టు అయింది. తానూ నిజం చెప్పినా వారు వినడం లేదు. ఏదైనా పని అడగాలని ఉంది. కానీ, దానికి అవకాశం ఇవ్వడం లేదు వాళ్లు, తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇంతకీ తను చేసిన తప్పేమిటి? బాబు ఆకలి తీర్చడానికి బయటకి రావడం? అవును తన జీవితాన్ని నాశనం చేసింది వాన. నమ్మినవాడు చేసిన పని తన జీవితాన్ని నాశనం చేసింది ఈ వాన లొనే… వాన తన జీవితంతో ఆడుకుంటుంది..

అలా పరిగెత్తుతూనే ఆలోచిస్తోంది, అలా పరిగెత్తి, పరిగెత్తి తన ఇల్లు చేరింది. బాబు ఏడ్చి, ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. బాబు ని తీసుకుని వెనక వస్తున్న రౌడీలను చూస్తూ, తిరిగి రోడ్డు మీదికి వచ్చింది.

ఆ సమయంలో రోడ్డుమీద ఒకటో, రెండో లారీలు పోతున్నాయి. అయినా అలాగే, చూస్తూ పోతున్నది. చీర అడ్డు వస్తుంది. జాకెట్ మొత్తం అతుక్కుపోయింది ఒంటికి. అయినా ఏదో తెలియని ధైర్యంతో ముందుకు సాగుతోంది.

వెనక రౌడీలు, ముందు ఆమె, పైన వాన, అలా పరిగెత్తి పరిగెత్తి ఇక పరుగెత్త లేక, గోడ చాటున నక్కింది. ఈ లోపున ఆ రౌడీలు, దగ్గరగా వచ్చారు. వీధి లైట్స్ సరిగ్గా వెలగడం లేదు. కాబట్టి ఆమె ఏ వైపుగా వెళ్ళిందో, అర్థంకాక నాలుగు దిక్కులు చూస్తున్నారు రౌడీలు…

అంతలో ఆమె అదృష్టం బాగా లేకపోవడం వల్ల, ఒక లారీ, అటువైపుగా వస్తూ, ఆమె ఉనికిని తెలియజేసింది. అది చూసిన రౌడీలు అదిగో రా, అది ఆక్కడ ఉంది అని అన్నారు గట్టిగా….

ఆ మాటలు వినిపించాయి. వైదేహి కి అర్థమైంది వాళ్లు తనని వదలరు అని. దాంతో ముందుకు పరిగెత్తుతూ వెళ్తుంది. ఆ రోడ్డు సరిగా మెయిన్ రోడ్ కి పోతుంది…..

ఆమె మెయిన్ రోడ్డు వైపు, పరుగెత్తడం చూసి, వెనుక రౌడీలు పట్టుకోండి, పట్టుకోండి అంటూ అరుస్తూ వెళ్తున్నారు. మెయిన్ రోడ్ కి ఇంకో రెండు అడుగులు వేస్తే వస్తుంది అంతలో ఒక రౌడి తన దగ్గరున్న కత్తి తీసి, ఆమె వైపు విసిరాడు. అది సరిగ్గా వెళ్లి, ఆమె వీపు లో దిగబడింది….

అమ్మా అని ఆమె గొంతు లోంచి రాకముందే, ఇంకో వైపు నుంచి, ఒక లారీ దూసుకువచ్చి, ఆమె నీ, బిడ్డని ఢీ కొట్టి, వెళ్ళిపోయింది. ఆమె కేక గొంతులోనే ఉండిపోయింది.

చేతిలో బిడ్డ కూడా ఎగిరి రోడ్డు మీద పడ్డాడు, అలా పడడంతోనే, ఆ బిడ్డ ఊపిరి ఆగిపోయింది….

ఆ సంఘటన అక్కడ ఎవరు చూడలేదు, వెనుక నుండి పరిగెత్తుతూ, వచ్చిన రౌడీలు వైదేహి కి లారీ గుద్దడం చూసి, హమ్మయ్యా అనుకుంటూ, వెనక్కి తిరిగారు….

ఆమె అబల, ఒక మగవాడిని నమ్మిన పాపానికి, మోసపోయి, ఆకలికి తాళలేక, ఒళ్లు అమ్ముకోలేక, ఒక తప్పును చూసిన పాపానికి, రెండు నిండు ప్రాణాలు బలి అయిపోయాయి. ఆమె బిడ్డ ఆకలి తీర్చాలని, తన ఆకలి తీరాలని అని అనుకుంది.

కానీ ఆమె ఆకలికి బలైపోయింది. ఆమె అనుకున్నట్టు వర్షం, ఆమె జీవితంలో భాగమైంది. ఆమె ఆశలు, ఆశయాలు, ఆకలి అన్నీ అన్నీ అదే వాన లో, ఆమె గొంతు లోనే ఉండి పోయాయి.

చివరికి ఆకలి కేక బయటకు రాలేక పోయింది. అలా రెండు జీవితాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఆమె ఆకలి కేక బయటకు రాకుండానే వానలో తడిసి పోయింది..

ఈ విషయాలు ఏమీ తెలియని వర్షం కురుస్తూనే ఉంది భీకరంగా…..

– భవ్య చారు

Related Posts