ఆశల బాణం

ఆశల బాణం

ఉదయమో ఆశల పల్లకి
ఉదయమో వేణుగాన పల్లవి
కష్టాల చిత్తడిలో కూరుకుంటే
చేయిచాస్తూ కిరణం చిరునవ్వవుతుంది

చిత్తభ్రమలు చాపల్యాలు వైఫల్యాలు
విషాదాల పెనంపై నిను తిరగేస్తుంటే
తిరగబడని మౌనం చిన్నబుచ్చుకుని చీకటితెరలలో బందీ కాగా
శ్వాసందించేకు వస్తాడు భానుడు

ఊరుకోని సమాజం
ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది
కరుకు మనుషులతో
బతుకు దారంతా గతుకులే కాగా
దిక్కుతోచనివేళ
కాస్తన్నా ఊరటనిచ్చే ఉదయపు వెలుగుతో సాగావనుకో
మనోవీధిలో దీపాలు వెలగొచ్చు

మనుషులున్నచోట మాటలున్నట్టే
మాటలున్నచోట భేదాలు విభేదాలుంటాయి
మొలిచే గోడలతో ఒంటరి ద్వీపమవుతుంటే
ఉదయాన్ని ఆసరాచేసుకో
వెలుగుకిరణాల నిచ్చెనపై
ముందు గోడలు దాటొచ్చు
క్రమేణా కూల్చొచ్చు

ఎవరేమన్నా వినకుండా
అర్థించే జీవితాన్ని
ఉదయంతో ప్రార్థించు
పరవశం ప్రవహించొచ్చు
పాట ప్రాణం పోసుకోవచ్చు
ఏతావాతా ఉదయంలో నీ ఉనికి
స్వప్నాలను నేలకు దింపి
ఆకాశంలోకి ఆశల బాణమేసినట్టు

– సి.యస్.రాంబాబు

Related Posts