"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

ఆత్మ నా?

ఆత్మ నా?

అవి బతుకమ్మ పండగ రోజులు… నేను, నా స్నేహితులు కలిసి చిన్న బతుకమ్మలు చేస్తూ, రోజూ ఆడుకుంటూ కాలువలో నిమజ్జనం చేసేవాళ్ళం.

అలా రోజు బతుకమ్మను పేర్చుకుంటూ సంతోషంగా సాయంత్రం కాగానే ఇంటి ముందు ముగ్గులు వేసుకుని కాసేపు అడుకుని కాలువకు ప్రసాదాలు తీసుకుని వెళ్ళేవాళ్ళం.

అమ్మ రోజు ఏదో ఒక ప్రసాదం చేసి ఇచ్చేది. నా స్నేహితులకు అమ్మ చేసే ప్రసాదం అంటే చాలా ఇష్టం. బతుకమ్మ వేయడం ఆలస్యం నా ప్రసాదం మొత్తం వాళ్ళే లాక్కుని మరి తినేవాళ్ళు. నాకు మిగల్చకుండా..

అలా ఒకరోజు బతుకమ్మ ఆడుకుని కాలువలో నిమజ్జనం చేయడానికి వెళ్ళినప్పుడు, మా వెనకాలే ఎవరో వస్తున్నట్టు అనిపించింది. కానీ మేము వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు.

మామూలుగా కాలువ సైడ్ సాయంత్రం పూట ఎవరు ఉండరు. దూరంగా పశువులను ఇళ్లకు తోలుకొస్తూ ఎవరో ఒకరు కనిపిస్తారు. కాని దగ్గరగా రారు. అక్కడ మగాళ్లు ఎవరూ ఉండరని మేమంతా సరదాగా ఉంటాము.

కానీ మా వెనక ఎవరో వస్తున్నట్టు అనిపించడంతో, కొంచం భయపడిన మాట వాస్తవమే అయినా, ఎవరో పశువుల కాపర్లు అనుకుంటూ వెళ్లిపోయాం. ఆ రోజు ఎందుకో అందరూ కాస్త ముందుగానే బతుకమ్మ నిమజ్జనం చేసి, వాళ్ళు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్లారు.

నా పట్టులంగా తడిచి పోవడంతో, గట్టిగా పిండుకుని, సిబ్బి తీసుకుని నేను మెల్లిగా వస్తున్న, ఎందుకంటే అక్కడ అంతా బురద గా ఉంటుంది. కాబట్టి జారీ పడతానేమో అని అలా మెల్లిగా వస్తుంటే,నా ముందు ఎవరో నిలబడినట్టు అనిపించింది.

ఎవరని చూసాను, అయితే చీకట్లు అప్పుడే ముసురుతున్నాయి. అందువల్ల మొహం కనిపించలేదు. కానీ మాటలు వినిపించాయి.

శాంతి నేను దశరథ్ ను నాకు ఆకలిగా ఉంది. కొంచం ప్రసాదం పెట్టావా అంటూ అడిగాడు. నేను వెంటనే గొంతు  గుర్తుపట్టాను. అతను నా క్లాస్ మేట్ దశరథ్, వాళ్లకు ఆవులు ఉన్నాయి.

అప్పుడప్పుడు వాటిని ఇలా కాస్తూ ఉండడం అతనికి అలవాటే, దాంతో దశరథ్ ఈ రోజు స్కూల్ కి ఎందుకు రాలేదు అంటూ అడిగాను.

దానికి అతను పశువులను కాయడానికి పొలం వెళ్ళాను, అందుకే రాలేదు అన్నాడు. నేను ఓహ్ అవునా సరే అంటూ నా బాక్స్ లోంచి ప్రసాదం తీసి, అతని చేతుల్లో పెట్టాను. కానీ సగానికి పైగా కింద పడిపోయింది.

అయ్యో రామా మొత్తం పారేసావు, అంటూ ఇంకాస్త పెట్టబోయాను, వద్దు శాంతి చాలు అన్నాడు. సరే మరి రేపు స్కూల్ కి వస్తున్నావు కదా అన్నాను. దానికి దశరథ్ ఇక ఎప్పటికీ రాను అన్నాడు.

ఇంతలో.. శాంతి అంటూ నా స్నేహితులు గట్టిగా పిలవడంతో అతను ఏమన్నదీ సరిగ్గా అర్దం కాక, సర్లే వెళ్తున్నా అంటూ నేను ముందుకు పరుగెత్తాను.

నేను వెళ్ళేసరికి ఏంటే ఇంత సేపా అన్నారు. అబ్బా ఏం లేదే దశరథ్ ప్రసాదం పెట్టామన్నాడు అన్న, అది విని వాళ్ళు ఒక్క సారిగా ఏంటి దశరథ్ హా అన్నారు.

అవునే అతనే ఎందుకు అలా అరిచారు అన్నాను. శాంతి నువ్వు దశరథ్ తో మాట్లాడవా ?  అని అడిగాడు నా స్నేహితురాలి అన్నయ్య , అప్పుడు చూసాను నేను అతన్ని చీకట్లో సైకిల్ పైన ఉన్న అతన్ని నేను గమనించలేదు.

అవును అన్నయ్య చూసాను ఎందుకు అలా అడిగావు, ప్రసాదం కూడా ఇచ్చాను అన్నాను అయోమయంగా. అతను వెంటనే సరే పదండి అంటూ అక్కడి నుండి మమల్ని తొందర పెట్టీ తీసుకుని వెళ్ళాడు.

నాకంత అయోమయంగా అనిపించింది. ఏంటి సరదాగా మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళం. ఇతను రావడం ఏంటి అనుకుంటూ వెనకే నడిచాను. కొంచం ఊర్లోకి వచ్చాక, గ్రామ పంచాయితీ ముందు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.

మేము వాళ్ళని దాటి మా గల్లి ముందుకు వచ్చాక నా స్నేహితురాలి అన్నయ్య నాతో, శాంతి నేను మీ ఇంటి వరకు వస్తాను  పద అన్నాడు.

అదేంటి ఇక్కడే కదా, మా ఇల్లు నాకేం భయం లేదు. అంటున్నా కూడా అతను నా వెనకే వచ్చి, ఇంట్లోకి వెళ్తున్న నన్ను పిలిచి శాంతి ఒక మాట అన్నాడు.

నాతో ఇతనికి ఏం మాటలు అనుకున్నా, నాకు అతని అతి నచ్చలేదు ఎందుకో, మమల్ని సరదాగా ఉందనివ్వలేదు అనే కోపం కావచ్చు.

అతను నాతో శాంతి భయపడకు మీ క్లాస్ దశరథ్ పొద్దున పొలంలో పాముకరిచి చనిపోయాడు.రాత్రి అయ్యింది కాబట్టి అన్ని రేపు జరుగుతాయి.

రేపు స్కూల్ నుండి అందరం చివరిసారిగా చూడడానికి వెళ్తున్నాం అన్నాడు. అతని మాటలు వింటున్న నేను వణికి పోయాను. పొద్దున చనిపోయిన దశరథ్ నన్ను ప్రసాదం ఎలా అడిగాడో అర్దం కాలేదు.

పిచ్చిచూపులు చూసాను అతని వైపు. అతను నన్ను చూసి దశరథ్ విషయం తెలియగానే నేను మీ కోసం వచ్చాను, భయపడతారు అని అన్నాడు.

అన్నా అబద్దం చెప్పకు ఇప్పుడే నేను అతనికి ప్రసాదం ఇచ్చాను అన్నాను. అతను నేను అబద్దం చెప్పడం లేదు కావాలంటే సార్ నీ అడుగు వెళ్లి అన్నాడు.

నేను నాన్న అంటూ పిలిచాను. నాన్న లోపలి నుండి వస్తూ ఏంటమ్మా ఏమయ్యింది అన్నారు.

నాన్న అన్న చూడు మా క్లాస్ మేట్ దశరథ్ చనిపోయాడు అని చెప్తున్నారు అన్నాను. దానికి నాన్న అవునమ్మ నిజమే మధ్యాహ్నంమో, పొద్దున్నో జరిగింది అంట, హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళారు. కానీ లాభం లేకుండా పోయింది అన్నారు.

అది తెలిసే నేనే అన్నయ్యను మీ దగ్గరికి పంపించాను, చీకట్లో భయపడతారు అని అన్నారు నాన్న గారు. దానికి నేను అదికాదు నాన్న ,నేను తనకు ఇప్పుడే ప్రసాదం ఇచ్చాను అని చెప్పాను.

వళ్లంతా వణికిపోతుంటే , నీకు అతను కనిపించడం ఏంటి ? అంటూ నాన్న ఎదో ఆలోచిస్తూ అయినా చనిపోయిన వాళ్ళు కాసేపు తమవాళ్ళ కోసం ఇలా ఊర్లో తిరుగుతారు అంట, దశరథ్ నీకు కనిపించాడు అంటే ప్రసాదం తిన్నాడు అంటే, ఆకలితో పోయి ఉంటాడు.

అందుకే తినేసి వెళ్ళాడు.అంటూ నాన్న నన్ను కాళ్ళు కడుక్కోమని చెప్పి, లోనికి తీసుకుని వెళ్లి దేవుడి దగ్గర ఉన్న బొట్టు పెట్టుకోమన్నారు. అమ్మ నాకు బొట్టు పెట్టింది. ఆ రాత్రంతా నేను ఏవేవో కలవరించాను అంట,

తెల్లారి పొద్దున దశరథ్ నీ చూడడానికి వెళ్ళినప్పుడు అతని చేయి చూసాను. ఆ చేతి లో నేను పెట్టిన పులిహోర ప్రసాదం మెతుకులు కనిపించాయి. నాకు భయం తో చెమట్లు పట్టాయి. వెంటనే బయటకు వచ్చేసాను.

ఆ సంఘటన నుండి ఆరు నెలల వరకు తెరుకోలేకపోయాను. ఇప్పటికీ గుర్తొస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి…

– భవ్య చారు

 

Related Posts

1 Comment

  1. నిజంగా జరిగిందాండీ.
    కధ బాగా వ్రాసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *