ఆత్మా రాముడు

ఆత్మా రాముడు

ఆహా ఏమి నా అదృష్టము ఇన్నేళ్ల తర్వాత పెళ్ళి భోజనం చెయ్యడానికి వెళ్తున్నా అంటే అది అదృష్టం కాదా మరి. ఇదేం విడ్డూరం పెళ్లికి వెళ్ళడం కూడా గొప్పెనా అంటారా గొప్పే మరి….

ఎందుకంటారా రెండేళ్లుగా ఇంట్లో పంజరంలో చిలుకలా బంధించి ఉంచిన నన్ను ఈ కరోనా పుణ్యమా అంటూ ఏవి తినివ్వకుండ తగానివ్వకుండ కషాయాల పేరిట ఏవేవో తాగించి నాలుకకి ఏ రుచి లేకుండా చేశారు.

నాలుక మరీ మొద్దు బారిపాయింది. ఈ లాక్ డౌన్ తిసేశక ఇదోగో ఇదే నేను మొట్ట మొదటి సారిగా బయట అడుగు పెట్టబోతున్నాను.

ఇదంతా వెళ్ళేది పెళ్లి వారి మీదున్న అభిమానంతో కాదని వాళ్ళు పెట్టే భోజనం గురించి అని ఎవరికీ తెలియదు నాకు తప్ప.

క్యాబ్ మాట్లాడుకుని అందరం కలిసి వెళ్ళాం. ఫంక్షన్ హాల్ బయటకు వంటల ఘుమఘుమలు గాల్లో తేలుతూ వస్తున్నాయి.

వాసన తోనే కడుపు నిండేలా ఉంది అమ్మో నిండితే ఎలా అసలే నిన్నటి నుండి కడుపు ఖాళీ గా ఉంచుకున్నా మరి..

సరే లోపలికి వెళ్ళాం నలుగురితో నవ్వుతూ మాట్లాడుతున్నా కానీ నాకు భోజనాలు ఎక్కడున్నాయో అనే నా కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి.

మొత్తానికి సూత్రధరణ జరిగాక భోజనాల హాల్ వైపు అడుగులు వేసాను. బఫే కాబట్టి ప్లేట్ చేతిలోకి పట్టుకుని లైన్ లో నిల్చున్న, లైన్ పెద్దగానే ఉంది.

నా వంతు వచ్చేసరికి ఎంత సమయం అవుతుందో అనుకుంటూ దిక్కులు చూస్తూ నిల్చున్న ఈ లైన్ అయ్యేలోపు ఏవి అయిపోకుండా చూడు స్వామి అంటూ వేడుకున్నా..

లైన్ మెల్లిగా ముందుకు కదిలింది హమ్మయ్య అనుకున్నాను నేను గబగబా ముందుకు నడిచాను. ప్లేటు పట్టాను ఒక్కో పదార్థం చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి.

ముందుగా మైసూర్పాక్ ఆ తర్వాత బాదుషా ఆ తర్వాత జిలేబి ఆ తర్వాత మిర్చి ఆ తర్వాత ఆవకాయ, తర్వాత గుత్తి వంకాయ ఆపై తెల్లని అన్నం ఆపై కొంచెం వెజిటేబుల్ బిర్యాని, పాలకూర పప్పు, వేశారు.

ఇవన్నీ అయ్యేలోపు సాంబార్ తర్వాత వేసుకోవచ్చులే అనుకోని అప్పడాలు తీసుకొని ముందుకు కదిలాను.

ప్లేట్ లో నవ వంటకాలు ఊరిస్తూ ఉంటే ఇంకా అగగలనా, వెంటనే ప్లేట్ లో ఉన్న వంటకాల పై దాడి మొదలు పెట్టాను.

ముందుగా ఆవకాయ అన్నం గట్టిగా కలిపి నెయ్యి ఉందేమో అని వెతుక్కుని చూసి కాస్త నెయ్యి వేసుకుని గబగబా నాలుగు ముద్దులు పెట్టాను ఆహా ఏమి రుచి ఏమి రుచి అందుకే కదా అందరం ఆవకాయని ఇష్టపడేది.

ఆ తర్వాత పాలకూర పప్పు లో కూడా ఆవకాయ మిక్స్ చేసుకొని మింగాను. ఇప్పుడు గుత్తు వంకాయ వెజిటేబుల్ బిర్యానీ లో గుత్తొంకాయ వేసుకొని గబగబా లాగించాను.

ఇంకా సాంబార్ అన్నం మిగిలింది కదా అనుకుంటూ పక్కనే ఉన్న స్వీట్స్ కాసేపు పక్కన పెట్టి మీ పని తర్వాత చూద్దాం అనుకుంటూ మళ్లీ అన్నం కోసం పరుగులెత్తే తెల్ల అన్నం చిక్కని మునక్కాయ సొరకాయ ముక్కలు వేసిన సాంబార్తో నాలుగు ముద్దలు తిన్నాను.

ఎందుకో వెజిటేబుల్ బిర్యానీ చాలా అద్భుతంగా ఉంది అనిపించింది అందులో పెరుగు చట్నీ వేసుకొని తింటే ఇంకా అద్భుతం అనిపించి సాంబార్ అన్నం అయిన తర్వాత వెజిటేబుల్ బిర్యానీ వేసుకుని అందులో పెరుగు చట్నీ వేసుకొని తినేసాను.

ఇక్కడితో ఆత్మారాముడు కాస్త శాంతించినా మరోవైపు స్వీట్లు రారా మంటూ పిలవడంతో ఒక్కో స్వీట్ ను ఎంతో ఆస్వాదిస్తూ తిన్నాను.

వంటలు చేయడం ఎంత శ్రద్ధగా చేస్తారో తినడం కూడా అంతే శ్రద్ధగా తినాలి. ఆస్వాదిస్తూ తింటే ఆ రుచి అద్భుతః.

ఇక చివరగా మజ్జిగ అన్నంతో గుత్తొంకాయ నంజుకుతింటుంటే స్వర్గం ఎక్కడో లేదు అనిపించింది ఇక ముగించి చేతులు కడిగేసుకున్నా.. ఇక చల్లని ఐస్ క్రీమ్ తో నాలో ఉన్న కోరికను చల్ల పరిచాను.

కడుపు నిండడంతో ఆయాసం తీర్చుకుంటున్నా ఒక కుర్చీలో హాయిగా కూర్చున్న. అప్పుడు వచ్చింది మహాకాళిలా మా యావిడ. ఏంటండీ క్యాబు మీరు ఒక్కరు ఎక్కేస్తే అయిపోతుందా మేము ఎక్కామో లేదో చూసుకోరా అంటూ నాకు క్లాస్ పీకడం మొదలు పెట్టింది.

ఒక్క క్షణం గతుక్కుమన్న. నిజమే నేను క్యాబ్లో ముందు కూర్చున్న వెనకాల వాళ్లు కూర్చున్నారో లేదొ అంతగా గమనించలేదు.

నా తిండి యావలో పడి వాళ్ళను మర్చిపోయా అన్న సంగతి గుర్తు చేసుకుంటూ, ఏంటి నువ్వు అలంకరణలు అంటూ ఆలస్యం చేసి నన్ను అంటావు అంటూ నిందను ఆమె పై వేసేసాను నిశ్చింతగా.

చాల్లెండి మీ తిండి యావ లో పడి మమ్మల్ని మర్చిపోయాను అనే విషయాన్ని దాచి నింద నా మీద వేస్తున్నారా ఆగండి ఇంటికి వెళ్ళాక మీ సంగతి చెప్తాను అంటూ రుసరుస లాడుతూ వేదిక పైకి వెళ్ళిపోయింది.

ఇంటికెళ్లాక సంగతి దేవుడెరుగు. ఇప్పుడు మాత్రం నా ఆత్మారాముడు శాంతించాడు అని అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారిపోయాను….

– అర్చన

Related Posts