ఆడజన్మ
ఆకాశం చిన్నదనిపిస్తుంది
ఆమె ఔన్నత్యం ముందు..
ఐనా ఎక్కడో పురుషాధిపత్యం
మేమే గొప్పని విర్రవీగుతుంది..
భూగోళం తేలికనిపిస్తుంది
ఆమె ఔదార్యం ముందు..
ఐనా ఒక చులకన భావం
గుండెను బరువెక్కిస్తుంది..
అక్షయపాత్ర చిన్నబోతుంది
ఆమె వడ్డించిన విస్తరి ముందు..
ఐనా ఐనోళ్ళందరి ఆకలి తీర్చి
తాను పస్థులుండాల్సొస్తుంది..
సముద్రం సిగ్గుపడుతుంది
ఆమె లోతైన మనసు ముందు..
ఐనా తరతరాల అహంకారం
పంజారాల్లో బంధిస్తుంది..
జ్ఞానగ్రంధాలు దిగదుడుపే
ఆమె లోకజ్ఞానం ముందు..
ఐనా ఒక వెనుకబాటుతనం
మనసుని క్రుంగదీస్తుంది..
సైనిక శిక్షణలేం సరిపోవు
ఆమె క్రమశిక్షణ ముందు..
ఐనా స్వార్ధపు వారసత్వం
పనిమనిషనే భావిస్తుంది..
అంతరిక్షం మొత్తం సరిపోదు
ఆమె విశ్వరూపం దాలిస్తే..
ఐనా ఒంటరిగా వెళ్లలేనితనం
మానసికంగా వేధిస్తూంటుంది..
‘ఆడజన్మ’ ఘన కీర్తి కొన్నిసార్లు
కవిత్వానికే పరిమితమౌతుంది..
(అన్నిరంగాల్లోనూ రాణిస్తున్న స్త్రీలు ఎక్కడో ఇంకా వివక్షతకు గురౌతూనే ఉన్నారన్న వాస్తవం జీర్ణించుకోలేం..)
-గురువర్థన్ రెడ్డి