అక్క-కోట్ల సంపద లెక్క

అక్క-కోట్ల సంపద లెక్క

నా దృష్టిలో అక్క అంటే….

మనం పుట్టిన క్షణం నుంచి తోడుండే తొలి నేస్తం
తన తమ్ముణ్ని ఎవరూ ముట్టనివ్వని తియ్యటి స్వార్థం
మా తమ్ముణ్ణి ఆడనిస్తేనే నేను ఆడతాను అని జట్టు కట్టగల ప్రేమ
తమ్ముడి కోసం తనకు ఇష్టమైన వాటిని వదులుకోగల త్యాగం
తాను ముందు నడుస్తూ మనకు దారి చూపే మార్గదర్శి
మంచి, చెడులు వివరించి మంచిదారిలో నడిపించే బాధ్యత.
మన బలాలు, బలహీనతలు తెలిసిన స్నేహితురాలు.
మనం తప్పు చేస్తే ప్రశ్నించే అధికారం అక్క అంటే.
తప్పులు మన్నించి దగ్గరకు తీసుకునే మమకారం
మన విజయాలకు పొంగిపోయే అభిమానం
కష్టాల్లో నేనున్నాను అని ఆదుకొనే ధైర్యం.
రాఖీ కట్టినా, యమ ద్వితీయకు భోజనం పెట్టినా తమ్ముడి క్షేమం కాంక్షించే చల్లని దీవెన.
తమ్ముడి ఇంట వేడుకను అంతా తానై నడుంకట్టి జరిపించే సందడి.
వదిన వచ్చాక అన్న మారిపోతాడేమో కానీ, తాను పెళ్లి చేసుకొని వెళ్లినా మన పక్షాన నిలబడి బావని కూడా నిలబడేలా చేసే భరోసా.
లోకం మొత్తం ఏకమైనా తన తమ్ముడిపై ఈగ కూడా వాలనివ్వని బలం, బలగం
ఇన్ని మాటలేలా అమ్మ తరువాత అమ్మ.
ప్రతి అక్క దృష్టిలో తన తమ్ముడు ఎప్పుడూ అమాయకుడే.
నా దృష్టిలో అక్క ఉన్న ప్రతి తమ్ముడుా అదృష్టవంతుడే, కోట్ల సంపదలున్న ధనవంతుడే.
– రవి పీసపాటి

Related Posts