అక్కన్నపేట ఉప్మా

అక్కన్నపేట ఉప్మా

అబ్బబ్బా ఎప్పుడూ చూసినా ఉప్మా నేనా? నీకు వేరే టిఫిన్ చేయడం రాదా? ఒక్క ఉప్మానే చేస్తూ ఉంటావు ఎప్పుడూ…. అంటూ తినకుండానే వెళ్ళాడు నా కొడుకు. ఎప్పుడు వాళ్లకు ఇష్టమైన టిఫిన్స్ మాత్రమే చేస్తాను ఒక్క రోజు ఇలా ఉప్మా చేసినందుకు నన్ను తిట్టుకుంటూ తినకుండా వెళ్లారు అందరూ.

అయినా పర్లేదు బయట ఏదో తింటారులే అని మనసుకు సర్ది చెప్పుకుని నేను ఉప్మా తినడం మొదలు పెట్టాను. మంచి ఉప్మా రవ్వను తీసుకుని మొదట వేయించి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు వేసి నీళ్ళు మరిగించి అందులో రవ్వ వేసి కలుపుతూ ఉడికించిన ఉప్మాలో పై నుండి కొంత నెయ్యి వేస్తే అహ ఎంతో బాగుంటుంది.

కానీ, అక్కన్న పేట ఉప్మా రుచి మాత్రం రాదు. నాకు ఎందుకో ఉప్మా నేను చేసుకుంటే నచ్చదు అదే వేరే వాళ్లు చేస్తే మాత్రం తెగ నచ్చుతుంది. పైగా ఎవరూ చేసిన మొదట తిన్న ఆ అక్కన్న పేట రుచి మాత్రం నాకు ఇంతవరకు దొరక లేదు.

File:A photo of Upma.jpg - Wikimedia Commons

కొందరు ఉప్మాను పొడిగా చేస్తే, కొందరు జారు గా చేస్తారు. కొందరు సేమ్యా కలిపి చేస్తారు, కొందరు బియ్యం రవ్వతో చేస్తారు. ఇలా రకరకాల ఉప్మాలు చేయడం అందరికీ అలవాటు. నేను అన్ని రకాల ఉప్మాను రుచి చూశాను. కానీ, అక్కన్న పేట ఉప్మా లాగా మాత్రం ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, చేయరు కూడా. మరి నేను ఇంతగా చెప్తున్నా కదా మరి అక్కన్న పేట ఎక్కడుంది? దాని ఉప్మా కథ ఎంటి? చెప్తాను ఆగండి ఎందుకంత తొందర….

మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లాలి అంటే ట్రైన్ ఎక్కి వెళ్లే వాళ్ళం, అయితే మేము పల్లెలో నిజామాబాద్ రైలు ఎక్కి మా అమ్మమ్మ వాళ్ళ ఊరైన కామారెడ్డికి వెళ్ళే దారిలో అక్కన్న పేట అనే ఊర్లో ట్రైన్ ఒక పది నిమిషాలు ఆగేది. నేను మొదటి సారి రైలు ప్రయాణం చేసేటప్పుడు నాన్నగారు రాలేదు. అమ్మతో కలిసి వెళ్ళాను. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్లీ మేము వెళ్ళాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి..

ఎలాగంటే, అప్పుడు వేసవి సెలవులు కావడంతో అందరం నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకున్నాం. అయితే నానమ్మ వాళ్ళింటికి వెళ్లాలి అంటే ముందుగా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఒక రోజు ఉండి వెళ్దాం అన్నారు నాన్న గారు. దాంతో, అందరం రెడీ అయ్య ము సంతోషంగా ..

ఆ రోజు అమ్మ ప్రొద్దున్నే మమల్ని లేపి రెడీ చేసింది. అయిదు గంటల బస్ కోసం అందరం బిస్తర్ (అంటే మా కట్టుకునే బట్టలు, చద్దర్లు ఒకే దగ్గర కట్టడం) తీసుకుని రోడ్ మీదకు వచ్చాము బస్ రెడీ గా ఉంది. అది నైట్ హాల్ట్ బస్ మేము ఎక్కి కూర్చున్న తర్వాత బస్ బయలుదేరింది. చల్లని గాలి రావడంతో నిద్ర సరిపోని మేము కురుకుతు ఉన్నాం. బస్ ఆగింది.

Akkannapeta Upma Story

తమ్ముడిని నాన్న ఎత్తుకుంటే, చిన్నొడిని అమ్మ ఎత్తుకుంది, నన్ను చేతిలో పట్టుకుని బిస్తర్ నెత్తి మీద పెట్టుకుంది అమ్మ. అంతే మరి, ఎప్పుడైనా అమ్మనే మోయాలి బిస్తర్. మా పెద్ద తమ్ముడు చాలా లావుగా ఉండేవాడు చిన్నప్పుడు. ఇప్పుడు లావుగా లేడు లెండి. వాడిని ఎత్తుకోవడం అంటే నాలుగు బిస్తర్లు మోయడం అంత బరువు ఉండేవాడు మరి..

అక్కన్నపేట ఉప్మా

అలా నడుచుకుంటూ మేము స్టేషన్ కు నడుస్తూ వెళ్ళాం. ఇంకా రైలు రాలేదు అన్నారు. నాన్న టికెట్స్ తీసుకున్నారు. చాలా సార్లు వెళ్ళేవాళ్ళం కాబట్టి నాన్నకు అందరూ తెలుసు. నాన్న సిగరెట్ తాగుతూ వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ నిల్చుంటే, మమల్ని అమ్మ బెంచిపై బిస్తరు పెట్టీ మాకు మొహాలు కడిగించింది పళ్ళ పొడితో. మరి బస్ పోతుందని మేము మొహాలు కడగలేదు అక్కడే బాత్రూంకు కూడా వెళ్ళాం.

అమ్మ కూడా మొహం కడగడం చూసిన నాన్న పక్కనే ఉన్న గుడిసె హోటల్ నుండి చాయి తెచ్చాడు. వన్ బై టూ అని ఇద్దరు తాగారు. మ పెద్దోడు కూడా కావాలని అనడంతో నాన్న తన చాయి తాగించాడు. వాడికి అన్ని కావాలి. అలా కాసేపటికి రైలు వచ్చింది, మమల్ని ఎక్కించాడు నాన్న, కొద్దీ నిమిషాలే అగి బయలు దేరింది రైలు. అలా ఒక గంట అంటే ఆరున్నర ఏడు మధ్యలో అక్కన్న పేటలో ఆగింది అక్కడ స్టేషన్ ఉంది. నాన్న కూడా అక్కడ దిగాడు.

Upma | Upendra Kanda | Flickr

మళ్ళీ రైలు కదులుతూ ఉంది. నాన్న ఇంకా రాలేదని అమ్మ కంగారుగా అటు ఇటు చూస్తుంటే, నాన్న చేతిలో రెండు మోతుకు ఆకు గిన్నె లాంటి దానిలో వేడి వేడిగా ఏదో తీసుకుని వచ్చాడు. ఒకటి అమ్మ కు ఇచ్చి తినమని ఇంకొక గిన్నె లంటిదాన్ని పెద్దోడి ముందు పెట్టాడు వాడికి ఏదైనా ఎక్కువగానే కావాలి మరి…

అమ్మా, నాకు, తమ్ముడికి చేతితోనే పెట్టడం మొదలు పెట్టింది. అమ్మా పెడుతూ ఉంటే అహ ఎంత కమ్మగా ఉందో… తెల్లని రవ్వలో నల్లని అవాలు, శనగపప్పు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి, కమ్మని నెయ్యి వాసనతో చూడగానే ఆకలి రెట్టింపు అయ్యేలా ఉంది అది. నోట్లో వెయ్యగానే కరిగిపోతూ ఉండడంతో, ఇంకా కావాలని అనిపించింది దాని రుచి ముందు వేరే ఏదీ కనిపించదు. అంతా రుచిగా ఉంది మరి…

అలాంటి రుచి ఇప్పటికీ నాకు ఎక్కడా దొరకలేదు. మోతుకు ఆకులను పుల్లలతో దొప్ప లాగా కుట్టి అందులో వేడి వేడి ఉప్మా వేశారు. ఆ ఆకుల సారం కలిసి అలా అనిపించిందో, మరి ఇంకేదో కానీ, ఎంత అద్భుతంగా ఉందని నెల రోజుకు అయినా ఆ రుచిని మర్చిపోలేదు మేము…

అదొక్కసరే కాదు, తిరిగి వచ్చేటప్పుడు కూడా అలాగే తిన్నాం. దానికి అంటే ఆ ఉప్మా కు మా నాన్న ఫిదా అయ్యారు. ఎప్పుడూ వెళ్ళినా అక్కన్న పేట ఉప్మా తినకుండా ఉండరు. అలా ఆ ఒక్కసారే కాకుండా, మేము వెళ్ళినన్ని రోజులు ఆ ఉప్మా రుచి చూసాము. నాకు తెలిసినంత వరకు తినకుండా ఎప్పుడూ లేము.

 

File:Upma made simple, without extra vegetables.jpg - Wikimedia Commons

ఇప్పటికీ తల్చుకుంటే అహ అనిపిస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తరువాత దాన్ని ఆపేశారు అని తెలిసిం.ది మేము వెళ్లడం కూడా తగ్గిపోయింది. బస్ లో వెళ్లే వాళ్ళం ఎందుకంటే అక్కడ ఏదో ప్రమాదం జరిగింది అనేవారు నాన్నగారు. అలా మా రైలు ప్రయాణం మారి బస్ ప్రయాణం మొదలైంది. మా చదువులో పడి ఆ విషయం మర్చిపోయాం.

కొన్ని రోజులకు నాన్న హఠాత్తుగా చనిపోవడంతో అస్థికలు కలపడానికి మళ్ళీ అదే స్టేషన్ లో బాసరకు వెళ్ళాలని నిలబడ్డ మాకు, నాన్నకు తెలిసిన స్టేషన్ మాస్టర్ వచ్చి పలకరించడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మరి, ఇన్నేళ్ల తర్వాత అతను గుర్తు పట్టాడు అంటే అదొక ఆనందమే కదా, ఇంతలో రైలు రావడంతో మేము అతనికి కృతజ్యతలు చెప్పి రైలు ఎక్కాము. రైలు వెళ్తూ ఉంటే అప్పటి జ్ఞాపకాలు నా మనసును తట్టిలేపాయి. అన్నీ గుర్తుకు వచ్చాయి. దాంతో పాటు అక్కన్న పేట ఉప్మా కూడా కూడా వచ్చింది.

కానీ, అక్కడ ఎవరూ లేరు. ఉప్మా గుమగుమలు, మాటలు, ముచ్చట్లు, జనాల హడావుడి, ఎది కనిపించలేదు. అంతా ఖాళీగా ఉంది. మా నాన్నగారు లేని మా కుటుంబంలో ఏదో లోటుగా, పువ్వులు లేని చెట్టులా, అంతా నిర్మానుష్యంగా ఉంది.

గతాన్ని తల్చుకుని ఏడుస్తున్న నాపై ఎవరిదో చేయి పడడంతో ఉల్లికి పడి వెనక్కి తిరిగి చూశాను. అమ్మా నన్ను దగ్గరికి తీసుకుంది ఆమె గుండెల్లో తల దాచుకున్నా నేను. తనకు గతం గుర్తొచ్చినట్లుగా ఉంది కళ్ళు తుడుచుకుంటూ నన్ను ఓదార్చ సాగింది. పాపం అమ్మ …

హా ఇదండీ మా అక్కన్న పేట ఉప్మా కథ. ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళింది కదా. కొన్ని బంధాల్ని మర్చిపోలేము. అలాగే నాన్న తెచ్చిన అక్కన్న పేట ఉప్మా ను కూడా…

మికేవరికైన ఇలాంటి అనుభవాలు ఉంటే నాతో పంచుకోండి ….

Related Posts

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *