అక్షర సేద్యమై కదలు…!!!
తేలుతు తెలవారేటి ఆటలతో
అలల లతలకు అతుకుబడుతు…
పడిలేచే కడలి తరంగాలు ప్రకృతి
పరవశానికి చేయూతలు ఆ చిన్నారులు
ఏతమేయలేని క్షణాలతో మెలిదిప్ప
బడలేని ఆహ్వానాలు బడి బాటను
చూడలేక పోతున్నవి…
వెలుగున జ్ఞాపకాలు వెలకట్టలేనివే
అయినా…
వడి వడిగా కదిలే ప్రపంచానికి
పాఠశాల గదులు జ్ఞాన మందిరాలే…
గతమంతటి గుణాల కూర్పును
సమయమంతటి అవకాశాన్ని
నిలుపుతు…
పనికట్టిన బతుకు దెరువుతో లోకం
తెరలు మూయక… కదిలే కాలాన
వెలిగే జ్యోతులని పిల్లలతో అక్షరాలను
దిద్దిస్తు దేశ ప్రగతిని వెలుగు పరుచు…
అక్షరమొక వెలుగులతో సందేశమని…
నిత్య హారతులతో నియమాలను
అక్షరాలుగా చదువాలని…
ఆ వెలుగులతో కదలిన రూపాల
నిరంతరానికి పునాదవుతు…
చీకటి కోణాలతో కలువని నిరర్ధకాన్ని
అక్షర బంధంతో రూపుమాపుతు
ఆదేశాలతో చక్కబడుతు ఆశయాలను
అక్షరాలతో సాధించు…
పగలిపోని పదార్థం చెదరిపోని శాశ్వత
శ్రీకారం అనువనువున సంకేతాలతో
ఆచరణవుతు…
ప్రార్థించే పరమోత్తమాలతో పాఠశాల
పదిలబడతు అక్షరాలు లక్ష వరాలని
పరుచుకొన్న దారులలో నవయుగ
నిర్మాతలు నడువాలని శ్వాసల
గమనంతో అక్షర సేద్యమై కదలు…
– దేరంగుల భైరవ