అలనాటి రాతలు
అలనాటి రాతలు ఎన్ని అని చెప్పను ఏమని చెప్పను
తెచ్చిన కట్నం చాలా లేదని కొట్టిన దెబ్బల గురించి చెప్పనా,
అందంగా లేవంటూ సిగరెట్ తో పెట్టిన వాతల గురించి చెప్పనా,
చేసిన వంటలకు వంకలు పెడుతూ కట్టెల పొయ్యి లో ఉన్న
కట్టే తో కొట్టిన గాయాల గురించి చెప్పనా,
వదిన అనే గౌరవం కూడా లేకుండా తిడుతున్న
నీ చెల్లిని ఆపకుండా నవ్వుతూ ఉన్నావని చెప్పనా,
అదే ఆడపడుచు మొగుడు కూడా చెయ్యి చేసుకుంటూ
ఉంటే కొట్టు కొట్టు అంటూ కొట్టిచ్చిన నీ గురించి చెప్పనా,
నిన్ను చంపితే మా వాడికి ఇంకో సంబంధం వస్తుందని
కిరోసిన్ పోసి న మీ అమ్మ గురించి చెప్పనా ,
కోడలు అంటే కూతురుతో సమానం అని కూడా
తెలియకుండా తన మగత్వాన్ని చూపించిన నీ తండ్రి గురించి చెప్పనా,
పిల్లలకు పాలిస్తుంటే వద్దంటూ పటకారు తో
వాటిని చిదుముతూ నా నోరు నొక్కిన నీ గురించి చెప్పనా,
వదిన అని కూడా చూడకుండా నా జడ కత్తిరించిన
నీ తమ్ముళ్ళ గురించి చెప్పనా ,
ఇన్ని జరుగుతున్నా ఒక్క మాట కూడా అడగని
నా తల్లిదండ్రుల అసమర్థత గురించి చెప్పనా
నా వెనక నా చెల్లెళ్ళు ఉన్నారని బాధలన్నీ మౌనంగా
అనుభవిస్తూ, కన్నిళ్లన్ని కడుపులో దాచుకున్నా నా గురించి చెప్పనా ,
అలనాటి రాతలన్ని నేటి నా నొప్పులనీ చెప్పనా,
నేడు అనుభవిస్తున్నా నరకాన్ని గురించి చెప్పనా ,
నెత్తి మీద గుద్దితే లేచే నొప్పి గురించి చెప్పనా,
గతమంతా గుర్తొచ్చి నిద్ర లేని ఇప్పటి రాత్రులను గురించి చెప్పనా,
ఎడగాయలను ఎవరూ మన్పలేరని ,అవి మరుచిపొదామన్నా
నొప్పుల రూపం లో గుర్తొస్తూ ఉన్నాయని చెప్పనా ,
ఏమని చెప్పను, ఎన్నని చెప్పను ఆనాటి రాతలు, ఈనాటి వెతలు….
-భవ్యచారు