అమ్మ ముసలిది అయ్యింది

అమ్మ ముసలిది అయ్యింది

అమ్మ ఎక్కడ ఉన్నావు? అంటూ వచ్చింది అరుణ తల్లిని ఇక్కడ ఉన్నారా అంది సుశీల వంటింట్లో నుండి. ఏంటమ్మా? ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేస్తూ ఉంటావు కొంచం రెస్ట్ తీసుకోవచ్చు కదా అంది అరుణ తల్లి భుజాల చుట్టూ చేతులు వేస్తూ … బంగారు తల్లి నేను ఏది చేసినా నీ కోసం మీ అన్నయ్యల కోసమే కదా అంది సుశీల. అవునవును అన్ని వాళ్ళకే చెయ్యి నన్ను మాత్రం పట్టించుకోక అన్నాడు పేపర్ చదివి ఇంట్లోకి వచ్చిన మూర్తి గారు.

అయ్యో, ఏంటి ఆ మాటలు మిమల్ని పట్టించుకోకుండా నేనేం చేశాను అంది సుశీల నొచ్చుకుంటూ. ఏం చేసాను అని అడుగుతున్నావ్ సరిపోయింది పో, పొద్దున్న ఎప్పుడో ఇంత కాఫీ పోసావు , ఇప్పటి వరకు రెండోది రానే లేదు, దీన్ని బట్టి నీకు అర్థం కావడం లేదా నన్ను ఎంతగా పట్టించుకుని , చూసుకుంటూన్నావు అనేది అన్నాడు నిష్టూరంగా..

అయ్యో నా మతి మండా, కాఫీ చేశాను అండి ఇవ్వడం మర్చిపోయా ఇదిగో ఇప్పుడే ఇస్తున్నా అంటూ కాఫీ పోసి భర్త చేతికి ఇచ్చింది సుశీల. సరే కానీ, నరేష్ ఉద్యోగం గురించి ఏమన్నా చెప్పాడా అంటూ అరాలు తీశాడు. తల్లి దండ్రి ఇద్దరు మాటల్లో పడడం చూసిన అరుణ అక్కడి నుండి వెళ్ళిపోయింది.

అవునండీ వాడికి ఉద్యోగం వేయాలంటే లక్ష కావాలట అంది గుసగుసగా భర్తకు చెప్తూ … అవునా, ఇప్పుడేం చేద్దాం మరి అంటూ ఆలోచనలో పడ్డాడు మూర్తి. మీరేం గాబరా పడకండి నా గాజులు ఉన్నాయిగా అవి అమ్మేసి ఇవ్వండి  . మనం తర్వాత చూసుకుందాం అంది సుశీల. భార్య వంక చూస్తూ ఏంటి? నీ గాజులా వద్దు సుశి నేనే ఎలాగో చూస్తాను అవి అక్కరకు వస్తాయి ఉండని నువ్వు దాని గురించి పట్టించుకోకు అన్నారు మూర్తి గారు.

మన పిల్లలే కదండీ, వాడు ఉద్యోగం రాగానే చేయిస్తాడు లేండి అంది. లేదు వద్దు సుశీల నేను చూస్తా కదా అన్నాడు. సరే మీరు స్నానం చేయండి మళ్లీ టైం అయ్యిందంటే కంగారు పడతారు అంటూ భర్తకు బాక్స్ కట్టడంలో మునిగిపోయింది. సరేలే, వెళ్తున్నా కానీ చిన్నోడు ఇంజనీరింగ్ కాలేజీలో ఏదో ప్రోగ్రాం ఉందట, రమ్మని ఫోన్ చేశాడు ఇద్దరం వెళ్దాం అన్నారు మూర్తి గారు.

అమ్మ ముసలిది అయ్యింది
అమ్మ ముసలిది అయ్యింది

అవునా మరి అమ్మాయి ఎలా? అంది సుశీల. లేదులే, అమ్మాయికి చెప్పాను ముందే.. తనకు పరీక్షలు కదా తనని ఇంట్లోనే ఉండమని చెప్పాను దానికి అరుణ కూడా సరే అంది. రేపు మన ప్రయాణం కొడుకు కోసం ఏవి తయారు చేయక, నెలలో వస్తాడు వాడు ఇంకా అవసరం లేదు అంటూ స్నానానికి వెళ్ళాడు. ఆ మీరు అలాగే అంటారు కానీ తల్లి ప్రాణం ఊరుకుంటుందా? అంటూ ఏమేమి చేయాలో ఆలోచించ సాగింది సుశీల.

*****

ఇంకా తెచ్చేవి ఏమన్నా ఉన్నాయా అంటూ అడిగారు మూర్తి గారు . అవునండీ సున్నుండల డబ్బా మర్చే పోయాను అంటూ లోపలికి వెళ్తున్న సుశీలను ఆపేసి, అవేవీ వద్దు గానీ, పద టైం అవుతుంది అంటూ ఆటోలో కూర్చున్నారు. అయ్యో వాడికి అవంటే చాలా ఇష్టం అండి అంది సుశీల. సరే వచ్చాక తింటాడు లే… బాబు నువ్వు పోని అని ఆటో అతని భుజం పై తట్టారు, ఆటో కదిలింది. అమ్మా అరుణ జాగ్రత్తా రాత్రికి నీ స్నేహితురాలి ఇంటికి వెళ్ళి పడుకో అంటూ జాగ్రత్తలు చెప్పి కదిలారు దంపతులు.

సంతోషంగా సాగిపోతున్న జీవితంలో ఒక్క సంఘటన వల్ల జీవితం మొత్తం అస్తవ్యస్తం అవ్వచ్చు, ఆ సంఘటన వల్ల మనిషి తలరాతే మారవచ్చు, ఆశలు, కోరికలు అన్ని తలకిందులు అవ్వచ్చు, మనం మంచిగా ఉన్నా, మన చుట్టూ ఉన్న వ్యక్తుల వల్లనో, లేదా మన పూర్వ కర్మల వల్లనో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయ్యో మనం అప్పుడు వెళ్ళకపోతే ఇలా జరిగి ఉండేది కాదేమో అని అనుకుంటాం. కానీ, జరగాలని ఉంటే ఎవరూ ఆపలేరు. అలాంటి సంఘటనే సుశీల జీవితంలో జరిగింది.

*****

కానీ వాళ్ళు బయలు దేరిన సమయం బాగా లేదో, లేదా అలా జరగాలని రాసి ఉందో కానీ, వీళ్ళు వెళ్తున్న బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్ యాక్సిడెంట్ అయ్యింది. ఆ ప్రమాదంలో ముర్తి గారు మరణించి, సుశీల ఒక చేయి కోల్పోయింది. సుశీల తమ్ముడు వచ్చి అక్కను, పిల్లలను ఓదార్చి, మూర్తి గారి ఖర్మ జరిపించాడు. ఇంత దుఖంలో ఒక సంతోషకరమైన విషయం పెద్ద వాడికి ఉద్యోగం రావడం.

సుశీల తమ్ముడు సంవత్సరం తిరగక ముందే అరుణకి ఒక సంబంధం తెచ్చాడు. అది అందరికీ నచ్చింది. కానీ, కట్నం ఎలా అనే ప్రశ్న ఉదయించింది. దానికి సమాధానంగా ఎంతో అపురూపంగా, పైసా ,పైసా కూడబెట్టి, పస్తులు ఉండి , డబ్బులు కూడబెట్టి కట్టుకున్న తమ ఆశల పొదరిల్లును అమ్మాల్సి వచ్చింది. అయినా సుశీల బాధ పడలేదు. తన బిడ్డల కోసమే కదా అనుకుంది.

అరుణకు కన్యాదానం చేయాలి అంటే, ముందు పెద్ద వాడికి పెళ్లి చేయాలి అని అనుకుంటున్న సమయంలో తాను ప్రేమించిన అమ్మాయిని తీసుకుని వచ్చాడు నరేష్. దానికి ఇంకా సంతోషించింది సుశీల. తన భర్త కానీ, తను కానీ, పిల్లల ఇష్టాలు ఎప్పుడు కాదనలేదు. కులం కానీ అమ్మాయి అయినా పెద్ద మనసుతో ఒప్పుకుంది. కోడల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంది.

ఇల్లు అమ్మిన డబ్బుతో అరుణ పెళ్లి చాలా గ్రాండ్ గానే జరిపించారు అన్నలు ఇద్దరు. అరుణ అత్తారింటికి వెళ్ళిపోయింది. ఇల్లు అమ్మారు కాబట్టి నరేష్ కొత్త ఇల్లును అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. తమ్ముడు సురేష్ ఉద్యోగం వేటలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు సుశీల, తన పెద్ద కొడుకు ఇంట్లో వారితో పాటే ఉండసాగింది.

అమ్మ ముసలిది అయ్యింది
అమ్మ ముసలిది అయ్యింది

***

ధభేల్ అంటూ ఎదో పడిన చప్పుడుకు సంజన ఉల్లిక్కి పడి లేచి, బయటకు వచ్చి, చూస్తూ

ఏంటి అత్తయ్య ఇది? నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా, మీరెందుకు ఇవన్నీ చేస్తారు? బంగారం లాంటి పింగాణీ ప్లేట్ పగల కొట్టారు. నా స్నేహితురాలు నా పెళ్లికి పెట్టిన గిఫ్ట్ అది అంది కోడలు సంజన. అయ్యో నేను చూడలేదమ్మ, తప్పయ్యింది తల్లి అంది సుశీల. నొచ్చుకుంటూ, అయినా మీరెందుకు కిచెన్ లోకి రావడం? నన్ను అడగవచ్చు కదా ఏదైనా కావాలి అంటే అంటూ సుశీల వైపు చీత్కారంగా చూస్తూ…

అమ్మా నాకు ఆకలిగా ఉంది. ఏదైనా ఉందేమో అని వచ్చాను అంది తల దించుకుని సుశీల సిగ్గును చంపుకుని మరి.. ఏంటి ఆకలిగా ఉందా? ఇప్పుడే కదా కంచం నిండా తిన్నారు . మళ్లీ ఆకలి అంటావు ఏంటి అంది సంజన. 

అది పొద్దున ఎప్పుడో పది గంటలకు పెట్టావు అమ్మా, అది కూడా కంచం నిండా కాదు . ఇప్పుడు టైం ఏడు అవుతుంది నాకు ఆకలిగా ఉంది. పెద్ద దాన్ని కదా, పొద్దెక్కి తింటే అరగదు తల్లి అందుకే అన్నం తినాలని వచ్చాను. కానీ కళ్ళు సరిగా కనిపించక ఆ ప్లేట్ పగలగొట్టాను అంది సుశీల .

ఆ ఆ ఆకలికి ఏం తక్కువ లేదు. ఇంటి పని ఒక్కటి చేయవు కనీసం నీ కంచం కూడా కడగవు కానీ, కంచలు కంచాలు ఖాళీ చేస్తావు, నా ఖర్మ ఇలా తగల బడింది. ఇయనకు చెప్తే అమ్మ, అమ్మ అంటూ కొంగు పట్టుకుని తిరుగుతాడు. ఇంట్లో బండెడు చాకిరీ చేస్తున్న ఒక్క దాన్ని ఒక్క సాయం కూడా చేయవు, కూర్చుని తినడానికి ఇక్కడ ఏం ఆస్తులు లేవు, నా మొగుడి సంపాదనే దిక్కు. కాస్త సాయం చేస్తే ఏమన్నా అరిగిపోతావా? ఏంటి ? సరే తెస్తాను పద పద బయటకు నడు మళ్లీ గాజు పెంకులు గుచ్చితే, అదో బాధ నాకు నేనే చేయాలి సేవ నీకు అంటూ కించెన్ లోంచి సుశీలను గెంటేసినంత పని చేసింది సంజన.

సుశీల కోడలు అన్ని మాటలు అంటున్నా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకు నడిచింది. సుశీల కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కానీ ఆ కన్నీళ్ళు బయటకు వస్తే సంజన చూస్తే అదొక తిట్ల పురాణం మళ్లీ, నా ఇంట్లో ఏడవకు అంటూ, ఇంతలో నాన్నమ్మ అంటూ పిల్లలు ఇద్దరు దగ్గరికి వచ్చారు.

ఏయ్, ఏయ్ వెళ్ళండి అవతలికి డర్టీ నాని, వద్దు వెళ్ళండి, వెళ్లి హోం వర్క్ చేసుకోండి అంటూ దగ్గరికి రాబోయిన పిల్లల్ని కసురుతూ కంచం తెచ్చి మంచం ముందుకు నూకేసింది సంజన, తినండి మళ్లీ నీ కొడుకు వస్తె నన్ను తిడతాడు. అనగానే సుశీల కంచాన్ని తడుముతూ చేతులు చాచి వెతుక్కుంటూ తీసుకుంది.

సంజన పిల్లలు ఆ కంచంలో ఉన్న అన్నం చూస్తూ అమ్మ యాంట్స్ (చీమలు) అన్నారు, చప్పున వాళ్ళ నోరు మూసిన సంజన వెళ్లి చదువుకోండి అంటూ వారినీ పంపేసింది. వాళ్ళు సుశీల వైపు జాలిగా చూస్తూ తమ గదిలోకి వెళ్ళారు. సుశీల మాత్రం కంచం నిండా పారుతున్న చీమలను గమనించకుండా ఆకలికి తట్టుకోలేక ఆబగా ఆ చీమల అన్నం తినసాగింది.

ఆకలి చాలా చెడ్డది. ఆకలి బాధను తట్టుకోలేము, ప్లేట్ ఇడ్లీ కోసం శరీరాన్ని అమ్ముకున్న వారు ఉన్నారు. బిర్యానీ కోసం బాధలు పడిన వారు ఉన్నారు, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒక్కొక్కరినీ ఒక్కోలా మారుస్తుంది. ఆకలి విలువ తెలియాలి అంటే ఆకలితో అలమటిస్తున్న వారిని చూస్తే చాలు. అనుభవించాల్సిన అవసరం లేదు. కానీ, మన జీవితం లో కూడా అలాంటి పరిస్థితి ఒక్కసారి అయినా వచ్చే ఉంటుంది.

చీమలు అన్ని మొఖం పైన చేతుల పైన పారుతున్నా ఆకలి బాధ కు అవేవీ పట్టనట్టుగా చేసింది. అన్నం మొత్తం తినేసింది సుశీల చీమల అన్నం లో నిన్న రాత్రి మిగిలిన పప్పు పాచి పోయింది వేసినా కూడా అమృతం లాగా అనిపించింది.ఆకలి రుచి ఎరగదు అంటే ఇదేనేమో…

కడుపు నిండిన తర్వాత , చీమలు కుడుతూ ఉంటే అబ్బా అంటూ చేయితో ఆ చీమని తీసేసింది సుశీల కానీ చీర పైన ఒంటి పైన పారుతున్న వాటిని ఎలా తీసెయ్యాలో తెలియక చీరంతా విప్పుకుని దులుపుకోసాగింది .

అమ్మ ముసలిది అయ్యింది
అమ్మ ముసలిది అయ్యింది

సరిగ్గా అదే సమయంలో కొడుకు నరేష్, సురేష్, అరుణ అందరూ బిల బిల మంటూ ఇంట్లోకి ప్రవేశించటం జరిగింది. నరేష్ , సురేష్ తల్లిని బట్టలు లేకుండా చూసి ఎంటమ్మ ఇది ఛీ ఛీ మరి బట్టలు విప్పుకుని నిల్చున్నావు అన్నారు కళ్ళు మూసుకుంటూ…

అమ్మ ఏంటే ఇది ఇలాగేనా చేయడం ఇంట్లో మగపిల్లలు ఉన్నారని ఇంగితం కూడా లేదా నీకు , అంటూ పక్కనే ఉన్న టవల్ తీసి తల్లి యద పై వేసింది అరుణ.

అప్పుడే లోపలి నుండి వస్తున్న సంజన దొరికిందే ఛాన్స్ అనుకుంటూ.. వచ్చారా రండి, రండి చూడండి మీ అమ్మగారి భాగోతం నేను చెప్తే వినలేదు మీరు. పొద్దంతా ఇదిగో ఇలాగే చేస్తుంది.

బట్టలు విప్పుతున్నది, బాత్రూం కూడా ఇక్కడే పోతుంది, అదే చేయితో అన్నం తింటుంది. నన్ను నానా మాటలు అంటుంది. పిల్లల్ని కొడుతుంది. బాత్రూం లోకి వెళ్లి నీళ్లన్నీ తెచ్చి ఇల్లంతా పోస్తుంది.

అవి నేను శుభ్రం చేయలేక చావాలి. ఇంత చేసినా మళ్లీ అన్నం పెట్టడం లేదు అని నన్ను తిడతారు. చూసారు కదా మీ కళ్ళారా ఇప్పుడు చెప్పండి ఏం చేయమంటారో.. అంటూ ముగ్గుర్నీ నిలదీసింది సంజన.

ముగ్గురు మొహాలు చూసుకున్నారు. నిజమే రా అన్నయ్య నేను రెండు మూడు సార్లు చూసాను బట్టలన్నీ విప్పేసింది. ఏదో పారుతున్నట్టు ఉందని నీళ్ళు తెచ్చి పారబోసింది. ఎందుకే అంటే కడుగుతూన్న అంది.

బాత్రూం కు వెళ్లొచ్చి అలాగే నా కొడుకును ఎత్తుకోబోయింది అంది అరుణ. పాపం మనవడు చీర తడిపితే శుభ్రం చేసుకున్న అని సుశీల చెప్పలేక పోయింది. వీళ్ళ మాటలు విన్న సుశీల అది కాదురా నరేష్ నాకు చీమలు పారినట్టు అనిపించింది .

అందుకే దులుపుకుని కట్టుకుందామని అనుకున్న ఇంతలో మీరు వచ్చారు. అని చెప్ప బోతున్న తల్లిని సురేష్ అయిష్టంగా చూస్తూ అపమ్మ నీ సోది మాటలు , మేము మా కళ్ళారా చూశాక కూడా నువ్వు కాదు అంటా వెంటి , అయినా ఇదేం బుద్ధి నీకు , వదిన్ని ఇలా ఇబ్బంది పెట్టడం బాగుందా అంటూ సురేష్ అనేసరికి ఇంకేం మాట్లాడలేక పోయింది.

సరే ,సరే పదండి సంజన అన్నం పెట్టు అన్నాడు నరేష్. చూడండి చీమలు అంటుంది ఇక్కడ ఎక్కడ ఉన్నాయో చూడండి అంది సంజన . అరుణ చుట్టూ చూసింది కానీ చీమలు కనిపించలేదు.

లేవు వదిన అమ్మ అబద్దం ఆడుతుంది. ముసలిది అయ్యింది కదా అలాగే అనిపిస్తుంది లే, పద ఏం వండావు అంటూ లోనికి వెళ్ళిపోయారు ముగ్గురు.

*****
అరుణ.. తన కూతురు తనను ముసలిది అయ్యిందని అంటుంది. హా పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు, చిన్నప్పుడు వీళ్ళకు ముడ్డి కడిగి, లాల పోసి, జోల పాడి సేవలు చేస్తే ఇప్పుడు ఇలా అంటున్నారు నా మాటలు ఎవరు నమ్మడం లేదు.

అంతేలే బెల్లం ఉంటేనే చీమలు వచ్చినట్టు పిల్లలు కూడా చీమలే నా దగ్గర ఉన్న గాజులు తీసుకునే వరకు పెద్దాడు మంచిగానే చూసుకున్నాడు. నా భర్త చేయించిన వాటిని తీసుకుని ఇప్పుడు నాకు వయసు అయిపోయిందని నన్నిలా అవమానిస్తున్నారు. ఆయన ఎప్పుడో చెప్పారు ఆ గాజులు నీవే జాగ్రత్తగా దాచుకో అని , కానీ నేనే నా పిల్లలు అంటూ ఇచ్చాను.

అమ్మ ముసలిది అయ్యింది
అమ్మ ముసలిది అయ్యింది

నా కడుపున పుట్టిన పిల్లలే నన్ను నమ్మకుండా ముసలిది అంటూ నన్ను హింసలు పెడుతున్నారు. కోడలు చెప్పిన మాటలను నమ్ముతున్నారు. రేపు వాళ్ళే కదా దానికి ఏదైనా చేసేది అని అరుణ కూడా వాళ్ళ వైపే మాట్లాడుతుంది.

అవును అవసరం ఉన్నంత వరకే ఎవరైనా , అవసరం తీరాక అంతా వృథానే..ఎంత ప్రేమగా పెంచుకున్నా నేను అరుణ ను,అది పెద్ద మనిషి అయినప్పుడు దాని ముట్టు బట్టలు కూడా తెల్లగా పిండాను , అది డెలివరీ అయినప్పుడు దాని వళ్లంతా ఒంటి చేయితో రుద్ది స్నానం పోసాను అప్పుడు అమ్మ ముసలిది అని గుర్తుకు రాలేదు.

పరాయి పిల్ల అయినా సంజన కు కూడా పిల్లలు పుట్టిన తరువాత ఎన్నో సేవలు చేశాను , ఉచ్చ కూడా తీసి పోసాను అప్పుడు ముసలిది అని గుర్తుకు రాలేదు. నరేష్ , సురేష్ లకు ఏమైనా తక్కువ చేశానా, వాళ్ళకు  చీమిడి వస్తే అసహ్య పడకుండా నా కొంగుతో తుడిచాను, బట్టలు కట్టుకోవటం దగ్గరి నుండి ఎలా షేవ్ చేసుకోవాలి అనే వరకు అన్ని నేర్పించాను.

ఇప్పుడు అమ్మ వాళ్లకు ముసలిది అయ్యింది. డబ్బుంటేనే బంధాలు గుర్తుకు ఉంటాయి. లేదంటే బంధాలు అనుబంధాలు ఏవి ఉండవు. అని సుశీల ఆలోచిస్తూ ఉంటే … అక్కడ లోపల అన్నా చెల్లెళ్ళు ఇంకోలా ఆలోచిస్తున్నారు.

*******

అన్నయ్య ఒక మాట చెప్తాను విను అమ్మకు ఇప్పుడు ఏమి కనిపించడం లేదు ,వినిపించడం లేదు. ఇక్కడ ఉంటే వదినకు కూడా చాలా ఇబ్బంది గా మారింది రా తనని ఏదైనా ఆశ్రమంలో చేర్పించడం మంచిది అంది అరుణ.

అవును అన్నయ్య ఇక్కడ ఇలా చేస్తుంటే వదిన మాత్రం ఎంతని చేస్తుంది. పైగా పిల్లల్ని కూడా చూసుకోవాలి తను ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి అంటే ఇబ్బందే కదా , అరుణ అన్నట్టు తనను ఆశ్రమంలో చేర్పించడం మంచిది అని నా ఉద్దేశ్యం కూడా అన్నాడు సురేష్.

అవును కానీ అలా చేర్పిస్తే మన గురించి అందరూ అనుకుంటారు మనం తల్లిని ఆశ్రమంలో చేర్పిస్తే సాధలేక పంపారు అని అంటారు .

అలా చేయడం నాకు ఇష్టం లేదు. నలుగురు మనల్ని అనడం నాకు నచ్చదు. తన అంతటా తానే వెళ్తే మనం వెతుకుతున్నట్టు చెప్పవచ్చు. ఇన్ని రోజులూ చేసి ఇప్పుడు ఆశ్రమంలో వదిలేస్తే బాగుండదు అన్నాడు నరేష్ .

చూశారా , చూశారా ఎలా అంటున్నాడో.. నేను కష్టపడాలి కానీ తను మాత్రమే సుఖ పడాలి, నేను ఇబ్బంది పడినా తనకు మాత్రం చెడ్డ పేరు రావద్దు అంది సంజన . అదేం లేదు సంజన అమ్మ తనంతట తానే వెళ్లిపోతే మనకు మంచి పేరే ఉంటుంది.

కన్న తల్లిని బయటకు వెళ్లగొట్టారు అనే పేరు రాదు అని అన్నయ్య ఉద్దేశ్యం అంటూ సర్ది చెప్పింది అరుణ. మీరేం చేస్తారో నాకు తెలియదు ఆవిడ ఉంటే మాత్రం నేను ఉండను తేల్చి చెప్పింది సంజన. సరే ఆలోచిద్దాం లే అంటూ చేతులు కడుక్కుని హాల్లొకి వచ్చిన నరేష్ కు తల్లి పడుకునే మంచం ఖాళీగా కనిపించింది.

అమ్మ ,అమ్మ ఎక్కడికీ వెళ్ళావు అంటూ బయటకు నడుస్తూ నరేష్ .సురేష్ అమ్మ లేదు చూడు ఎక్కడికి వెళ్లిందో అంటూ కేకేసి బయటకు నడిచాడు. లోపల ఉన్న ముగ్గురు బయటకు వచ్చి చూసారు. ఎక్కడా సుశీల జాడ కనిపించలేదు.

అంతట తూ ,తూ మంత్రంగా వెతికి వచ్చిన నలుగురు ,మళ్లీ ఇంట్లోకి వచ్చి చేరారు. మన మాటలన్నీ విని వెళ్ళింది ఏమో అంది అరుణ ., వెళ్తే వెళ్ళనిలే తానే వస్తుంది మళ్లీ అన్నాడు నరేష్. ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని ఆలోచించడం మొదలు పెట్టారు.

చివరికి సంజన వెళ్తే వెళ్ళింది మన భారం కాస్త తగ్గించింది లేండి. నాకొక బాధ తప్పింది . ,అందరికీ చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం లేండి అంది హుషారుగా.. సరే లే వదిన నీ కోరిక తీరింది కదా , ఇక మనం హ్యాపీ గా ఉండొచ్చు అంది అరుణ. తను తన బ్యాగ్ తీసుకుంటూ నేను వెళ్తాను మరి, రేప్పొద్దున వస్తాను మళ్ళీ, పిల్లలు ఏరి చాక్లెట్స్ తెచ్చాను ఇచ్చి వెళ్తాను అంటూ పిల్లల గది లోకి వెళ్ళింది . వెనకే నరేష్, సురేష్, సంజన వెళ్లారు.

పిల్లలు ఇద్దరు నవ్య, వినయ్ , నవ్య వినయ్ తో అరేయి అన్నయ్య రేపు మన అమ్మ కూడా ముసలిది అయ్యాక నీ పెళ్ళాం కూడా అమ్మలాగే చీమల అన్నం పెడితే ఏం చేస్తావు రా అంటుంది . దానికి వినయ్ నేను నాన్న , బాబాయి ,అత్తా లాగా చేయను, నా పెళ్ళాన్ని లాగి ఒకటి కొట్టి మరి అమ్మను బాగా చూసుకుంటా అవసరం అయితే నా పెళ్ళాన్ని వదిలేస్తా కానీ అమ్మను వదలను .

పాపం నానమ్మ కు చేయి లేదు కానీ నాన్నను ,అత్తా, బాబాయి లను మన అమ్మ నాన్న మనల్ని ప్రేమగా పెంచినట్టే పెంచింది కదా, మనకు మన అమ్మ ఎన్ని సేవలు చేస్తుందో వారికి అలాగే చేసి ఉంటుంది కదా, పిచ్చి నాన్న , అత్త, బాబాయి వాళ్ళు అమ్మ చెప్పిందే విన్నారు.

కానీ నాన్నమ్మ చెప్పింది అసలే వినలేదు. నేను పెద్దయ్యాక నాన్నమ్మ ఎక్కడ ఉన్నా వెళ్లి తీసుకుని వస్తాను. నాన్నమ్మ ను బాగా చూసుకుంటాను అన్నాడు వినయ్ . మరి నువ్వేం చేస్తావు అని నవ్యని అడిగాడు.

దానికి నవ్య ఛీ నువ్వు  అమ్మను చూసుకుంటా అంటావా నేను అయితే  నానమ్మకు అమ్మ ఎలా చీమల అన్నం రొజూ  పెడుతుందో నేను అలాగే అమ్మకు పెడతాను . నానమ్మ ఎంత బాధ పడిందో అమ్మ కూడా అలాగే బాధ పడాలి అంది కోపంగా నవ్య ..

వీళ్ళ మాటలు బయట నిలబడి వింటున్న నలుగురు మొహాలు చూసుకుంటే , సంజన తల దించుకుని నీళ్ళు నమలసాగింది. నరేష్, సురేష్ , అరుణ ఒక్కసారిగా అమ్మ అంటూ బయటకు పరుగెత్తారు తల్లిని వెతకడానికి….

****

సుశీల కళ్ళు కన్నీటితో నిండి పోగా గుండె భారమై , అంతులేని దుఃఖంతో , జీవితం మీద విరక్తి తో కనిపించని కళ్ళతో, ఒంటి చేయితో తడుముకుంటూ , ఇష్టంగా కని, కష్టం అనుకోకుండా పెంచిన పిల్లలు. మలి వయసులో, ఆదరించక, వృద్ద్యాప్యం లో కన్న బిడ్డలే కాపాడతారు అనుకుంటే వాళ్ళు తనకు అన్నం పెట్టడమే దండగా అన్నట్టుగా మాటలు మాట్లాడుతుంటే వింటూ, చూస్తూ తట్టుకోలేక, వారికి భారం అవలేక, ప్రేమనుచంపుకోలేక , బలవంతంగా బ్రతకలేక , చావును వెతుకుతూ బయలుదేరింది .

తన చావు కూడా వారికీ తెలియకుండా ఉండాలని, ఉన్నప్పుడు పిడికెడు అన్నం పెట్టడానికి కూడా ఇష్టపడని వారు ఇక చచ్చాక కర్మ అయినా సరిగ్గా చేస్తారో , లేదో కూడా తెలియక వారితో తల కొరివి పెట్టించుకోవడం ఇష్టం లేని ఆ తల్లి తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి ముందుకు వెళ్తుంది.

పశ్చాత్తాపం తో వెతుకుతున్న ఆ బిడ్డలకు అమ్మ మళ్లీ దొరకాలి అని ముసలితల్లి ని వారు బాగా చూసుకోవాలని , ఆ తల్లి, బిడ్డల ప్రేమను పూర్తిగా అనుభవించాలి అని కోరుకుందాం.. మళ్లీ వాళ్ళు కలుస్తారా ?  లేదా ?  ఆ ముసలి తల్లి  ఏ లారీకో , ట్రక్కుకో బలి కాకుండా వారికి దొరుకుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి …

అమ్మ ముసలిది అవ్వొచ్చు కానీ అమ్మ ప్రేమ ముసలిది కాదు … అమ్మ ప్రేమ అనంతం..

– భవ్య చారు

Related Posts

5 Comments

  1. 😌😌😌😭😭😭😭 చాలా చాలా బాగుంది మేడం…💐💐💐💐👌👌👌👌👌

  2. 🙏🙏
    నిజంగా మంచి కధ చదివాననే తృప్తి కలిగింది.

Comments are closed.