అమ్మ – నాన్న

అమ్మ - నాన్న

అమ్మ – నాన్న

అడగందే అమ్మైనా పెట్టదు అంటారు కానీ అది తప్పు అండి, ఇంకా చాలు అమ్మా, వద్దు, వద్దు అని మొత్తుకున్నా కూడా కొసరి కొసరి పెట్టేదే అమ్మ, ఏమైనా అంటే నీకేం తెలీదు బడుద్ధాయ్ తిను అంటుంది. ఈ భూ ప్రపంచంలో అసలైన ప్రేమ అంటే తల్లిదే అని చెప్పచ్చు. ఎందుకంటే బిడ్డ కడుపులో పడ్డ క్షణం నుంచే ఎలా ఉంటుందో, అమ్మయా, అబ్బాయా, అని తెలుసుకోకుండానే ప్రేమిస్తుంది.

పుట్టాకా లాలిస్తుంది, బిడ్డను ప్రసవించిన మొదటి రోజు నుంచి రేయి పగలు అని తేడా లేకుండా తన ప్రపంచాన్ని వదులుకొని బిడ్డే ప్రపంచం అన్నట్టు బతుకుతుంది. కళ్ళలో పెట్టుకొని చూసుకుంటుంది. గుండెల్లో దాచుకొని మురిసిపోతుంది. బిడ్డకు ఎదైనా కష్టం వస్తే తల్లడిల్లిపోతుంది. ఎలా ఉండాలో చెబుతుంది. ఎలా ఉండకూడదో నేర్పుతుంది.

ఇక నాన్న బిడ్డ కడుపులో పడింది అని తెలియగానే అత్యంత సంతోషపడే వ్యక్తి. అమ్మ తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే అది నాన్నే… నాన్న తన ప్రేమను అమ్మలా ఎప్పటికీ చూపించలేడు, ఆ ప్రేమ బాధ్యతల రూపంలో ప్రతీరోజూ నాన్న మన కోసం చేసే ప్రతీ పనిలో కనిపిస్తూనే ఉంటుంది కాకపోతే దాన్ని చూడగలిగే చూపు, మనస్సు బిడ్డకి ఉండాలి అంతే.

నా బిడ్డ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అని తన ఆరోగ్యం సైతం లెక్క చెయ్యకుండా కష్టపడతాడు. కాకపోతే ఆ కష్టం ఎవ్వరికీ తెలియకుండా ఉండాలి అనుకుంటాడు. పిల్లల పట్ల బోలెడంత ప్రేమ ఉన్నా కూడా నాన్న కాస్త కఠినంగానే ఉంటాడు. ఎందుకంటే పిల్లలు ఎక్కడ తప్పు దోవ పడతారో అని భయం. అప్పటి దాకా తన ప్రపంచం ఎదైనా పిల్లలు పుట్టాక తన సర్వస్వం పిల్లలు ఇంకా భార్యగా మారిపోతుంది. కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి పిల్లల భవిష్యత్తుకి ఉపయోగ పడాలి అనే ఆలోచిస్తూ ఉంటాడు.

తల్లితండ్రులు, పిల్లలు పుట్టనంత వరకు మాత్రమే తమ గురించి ఆలోచిస్తారు. పిల్లలు పుట్టాక తమ పూర్తి ఆలోచనలు అంతా పిల్లల పైన ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లు అనే సామ్రాజ్యానికి అమ్మ రాజు అయితే నాన్నే సేనాధిపతి. ఇల్లు అనే రాజ్యాన్ని నిత్యం కాపాడుతూ భార్య అనే రాజుకి నేనున్నాను నువ్వు ఏదైనా చెయ్యి నేను చూసుకుంటాను అనే నమ్మకం ఇస్తూ, ప్రజలు అనే పిల్లల కోసం వారి బాగోగుల కోసం అవసరాలు అనే శత్రువులతో నిత్యం పోరాడే వీరుడు నాన్న.

తమ కుటుంబ బాగోగులకై నిత్యం కృషి చేస్తూ, ఎప్పటికప్పుడు వారికి ప్రేమను పంచుతూ ప్రాణంగా చూసుకునేదే తల్లి. తల్లి తండ్రుల ప్రేమ ఆప్యాయతలు అందరికీ దక్కే అదృష్టాలు కావు. కేవలం కొందరికి మాత్రమే దక్కుతాయి. అలా ఆ అదృష్టం పొందిన ప్రతి ఒక్కరికీ నా చిన్న విన్నపం వారి గొప్పతనం ఎంటో తల్లి, తండ్రి లేని వారిని అడగండి చెబుతారు, ఉన్నంత వరకు వారిని బాధపెట్టకుండి, వారు లేనప్పుడు బాధపడకండి, వారు ఉన్నంత కాలం వారిని బాగా చూస్కోండి. కనిపించని దేవుడు కనిపిస్తే మన తల్లి తండ్రుల లాగానే ఉంటారు.

– అశోక్

సంక్రాంతి సంబరాలు Previous post సంక్రాంతి సంబరాలు
బాధ్యత Next post బాధ్యత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *