అమ్మాయి కోసం పార్ట్ 1
శ్రావణ్ ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన యువకుడు, తన కుటుంబంలో తల్లిదండ్రులు, అక్క, అన్నలతో ఉంటూ ఉన్నాడు. తండ్రి ఎదో చిన్న కంపెనీలో గుమాస్తాగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అక్క , అన్నలు ఇద్దరూ చదువుకుoటున్నారు. శ్రావణ్ పదో తరగతి చదివే సమయంలో, తనకి ఫోటోలు తీయడం అంటే ఇష్టం పెరిగింది. దాంతో పదవ తరగతి తర్వాత, ఇష్టంతో తండ్రిని ఒప్పించి, మరి దగ్గరలో ఉన్న ఫోటో స్టూడియోలో, పనికి కుదురుకున్నాడు. తండ్రి కూడా కాస్త చేతికి అంద వస్తాడు అని అందులో చేర్పించాడు. ఖాళీగా ఉండే సమయంలో ఇది నేర్చుకుంటే అయినా, వాడు జీవితంలో స్థిర పడతాడు అని అనుకుంది తల్లి . అలా పనిలో చేరిన శ్రావణ్ తనకు నచ్చింది చేస్తూ, పనిలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు…..
ఆ షాప్ యజమాని ఒక ముస్లిం, అతనికి శ్రావణ్ బాగా తెలుసు కాబట్టి, అతన్ని తన కొడుకులతో పాటూ చూసుకోసాగడు. మంచిగా, పని చేస్తూ కొన్ని రోజుల్లోనే మంచి వాడిగా పేరు తెచ్చుకున్నాడు శ్రావణ్ ఆ యజమాని దగ్గర, అతని పనితనాన్ని చూసిన యజమాని కూడా తానూ వెళ్లే పెళ్లిళ్లకి, ఫంక్షన్ లకి కూడా తీసుకుని వెళ్లడం మొదలు పెట్టాడు.. అలా శ్రావణ్ ఫొటోలు బాగా తీయడం నేర్చుకున్న తర్వాత, అతని మీద నమ్మకంతో అతడిని ఒక్కడినే పెళ్లి ఫోటోలకు, మిగతా వాటికి కూడా పంపించడం మొదలు పెట్టాడు. అలా శ్రావణ్ ఒక్కడినే చిన్నవాటికి కూడా పంపిస్తూ ఉంటాడు…
అలా శ్రావణ్ ఫొటోలు తీయడానికి వెళ్తూ ఉంటాడు. అలా ఒక యాడాది తిరుగుతూ, ఫోటోలు బాగా తీస్తాడు అనే మంచి పేరు తెచ్చుకున్నాడు శ్రావణ్ అందరి దగ్గరా, నిజానికి శ్రావణ్ చాలా మంచివాడు, తల్లిదండ్రులు అంటే భక్తి, అన్నా ,అక్క అంటే గౌరవం, పెద్దవారి పట్ల మర్యాదగా నడుచుకుంటూ ఉంటాడు. అలాగే చాలా సున్నితమైన మనసు కలవాడు, చిన్న చిన్న విషయాలకు చాలా బాధపడి పోతుంటాడు, ఒక చీమని కూడా చంపే ధైర్యం చేయలేడు, అలాగే చీకటి, దయ్యాలు అంటే కూడా చాలా భయం శ్రావణ్ కి. వాడి భయం తెలిసిన అన్న, అక్కలు, అగోరా, అటు చూడు అని అనగానే దుప్పటి నిండా కప్పుకుని పడుకునే వాడు, అది చూసి అన్న, అక్కలు నవ్వుతూ, వాడిని ఆట పట్టిస్తూ ఉండే వారు. అలా సంతోషంగా, ఇష్టమైన పని చేస్తూ, మంచి పనిమంతుడుగా పేరు తెచ్చుకున్న శ్రావణ్ జీవితంలోకి సునామిలా వచ్చిందోక సీతాకోకచిలుక. అది అతడి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చాయో, చివరికి శ్రావణ్ జీవితం ఎలా మారిపోయింది అన్నది ముందు ముందు తెలుసుకోండి…….
అది మాంచి ఎండాకాలం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో శ్రావణ్ కి పని బాగా ఉంది. అతను చుట్టుపక్కల ఊర్లలో తిరుగుతూ, ఫోటోలు, వీడియోలు తీస్తూ, చాలా బిజీగా ఉన్నాడు. అలాంటి ఒక రోజు స్టూడియోలో ఎవరూ లేరు. ఒక్కడే కూర్చుని సిస్టంలో తాను తీసిన వీడియోలో బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ యాడ్ చేస్తూన్నాడు. అలాంటి సమయంలో ఎవరూ లేరా అని వినిపించింది ఒక గొంతు, ఎవరూ అంటూ బయటకు వచ్చాడు శ్రావణ్ , ఎవరో ఒక అమ్మాయి బయట నిలబడి ఉంది. ఏంటి? ఎవరూ కావాలి అని అడిగాడు శ్రావణ్, అది, అది నాకు ఫోటో కావాలి, పాస్పోర్ట్ సైజ్ లో , పరీక్ష కోసం అని అంది గబగబా, సరే సరే కంగారు పడకండి, అని అంటూ వెళ్లి నిల్చోమని చెప్పాడు. ఆమె బెదురుగానేవెళ్లి, నిల్చుంది..
అమ్మాయి సరిగ్గా నిలబడలేదు, దాంతో శ్రావణ్ వెళ్లి ఆమెని సరిగ్గా నిలబడమని భుజాలు పట్టుకుని, తలెత్తి పెట్టాడు, దానికె ఆ అమ్మాయి అష్ట వంకరలు తిరిగింది. శ్రావణ్ కి కూడా ఆమెని ముట్టుకోగానే, విద్యుత్ ప్రవహించినట్టు అయ్యింది.. అయినా తమయించుకుని, ఎలాగో ఒకలా ఆమెని ఫోటో తీసాడు. పది నిమిషాలు కూర్చోమని చెప్పి, ఆమెకి ఆమె ఫోటోలు ఇచ్చాడు. దాంతో పాటు ఒక ఫోటో ఎక్కువ తీసి, దాచుకున్నాడు తన జేబులో.. ఆ పది నిమిషాలలో ఆ అమ్మాయి పేరు, ఊరు అడిగి తెలుసుకున్నాడు శ్రావణ్. ఆ అమ్మాయిది అదే ఊరు, కానీ కొంచం దూరం ఎక్కువగా ఉంటుంది. అమ్మాయి పేరు భార్గవి, ఈ సంవత్సరమే ఇంటర్ లో జాయిన్ అయ్యింది. అన్ని విషయాలు చెప్పక ఆమె ఫోటోలు, ఇచ్చి, డబ్బులు తీసుకున్నాడు, ఆమె వెళ్ళిపోయింది…
శ్రావణ్ కి ఆమె వెళ్లిపోయిన తర్వాత ఒక ఉప్పెన వచ్చి వెళ్లినట్టు అనిపించింది, ఆమె లేకుండా ఒక్క నిమిషం ఉండలేను అనిపించి, పని ఆపేసి, ఆమె చెప్పిన ప్రకారం ఆమె ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు, ఆగలేక,..
అతను ఆమెని వెతుకుతూ వెళ్ళేసరికి, వాళ్ళ ఇల్లు దూరం ఉంటుంది కాబట్టి, సగం దూరం వెళ్ళగానే ఆమె అతడికి కనిపించింది, కానీ ఎవరో ఉన్నారు పక్కన, అది కూడా ఎవరో అబ్బాయి. అతన్ని గమనించిన ఆ అమ్మాయి పక్కన ఉన్న అతనికి ఏం చెప్పిందో కానీ అతను వెళ్ళిపోయాడు, శ్రావణ్ ని చూస్తూ, అతడు వెళ్ళగానే భార్గవి దగ్గరకు వెళ్లిన శ్రావణ్ , తోడుగా ఎవరూ లేరేమో అని వచ్చాను అని ఆమెకి చెప్పాడు, అడగకున్నా, ఇప్పుడు నేను అడిగానా అని అంది భార్గవి. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి తో పరిచయం శ్రావణ్ ని ఎంత వరకు వెళ్లిందో ముందు ,ముందు తెలుసుకుందాం….