అంతం

అంతం

తెలంగాణ పోరు గడ్డ సాక్షిగా
తెలంగాణ ముక్తి కోసం
అసువులు బాసిన అమరుల గవాయిగా ….
అణచబడిన రక్తం వేడెక్కి…..
ప్రజావేశం కట్టలు తెంచుకుని..
దొరతనంపై తిరగ బడి..
బాంచెన్ దొర నుంచి
దొర ఏందిరో వాని పీకుడేందిరో
అని గళమెత్తిన రోజు

ప్రజల్లో చైతన్యం కలిగి..
ఒకే మాటపై నిలబడి..
నిజాంను ఎదిరించి…
రజాకార్ల అకృత్యాల నుండి…..
నిజాం కబంధ హస్తాల నుండి స్వేచ్ఛ పొంది
సంద్రపు అలలు ఎగసి పడిన రోజు

నిజాం వ్యూహాలు పన్నాగాలను చెల్లా చెదురు చేసి….
నిజాం నిరంకుశత్వానికి రాక్షసత్వానికి …..
మంగళం పాడిన రోజు

అణుగు బాటు తిరుగుబాటై
సాధించిన విజయం
ఆకసాన ఉషా కిరణమై ఎగిరింది

తరతరాల దురాగతాలను తరిమి కొట్టగ
చేసిన సాయుధ పోరాటంలో
ఎందరో వీరుల త్యాగఫలం ఈ దినం

మట్టి కోసం భుక్తి కోసం
విముక్తి కోసం
అసువులు బాసిన అమరులకు జోహార్లు

(నేడు తెలంగాణా విమోచన దినోత్సవ సందర్భంగా)

– రహీంపాషా

Related Posts