అంతరంగ మథనం
నేను తప్పు చేశానా, నేను నిజంగా తప్పు చేశానా చేసే ఉంటాను. లేకుంటే అందరూ ఎందుకు నాదే తప్పు అంటారు. అవును ఖచ్చితంగా నాదే తప్పు అయి ఉండాలి. లేదంటే ఇంత మంది పెద్దవాళ్ళు అంటుంటే వాళ్ళు ఏమైనా పిచ్చి లేచి అనరు కదా, అవును నేను పుట్టి తప్పు చేశానా , పెరిగి తప్పు చేశాను.
అవును ఆడపిల్లగా పుట్టడం నా తప్పా, పెరడగం నా తప్పా, అన్నలను చదివించినట్టు నన్ను కూడా చదివించ మనడం నా తప్పా , అవన్నీ కనీస బాధ్యతలు కదా నా తల్లిదండ్రులకు, కానీ అవన్నీ నా కనీస అవసరాలు కదా, చదువుకునే రోజుల్లో కూడా అంతే అన్నలు వాడిన పుస్తకాలు ఇచ్చేవారు.వాటితోనే సర్దుకుంది. కానీ కాలేజీకి వెళ్ళాక వాడెవడో వెంట పడుతున్నారు అంటే నువ్వేం చేసావో అన్నారు.
నేనేం చేశాను. అతన్ని ఒక్కసారి కూడా సరిగ్గా చూడలేదు వాడే దగ్గరికి వచ్చి నీ పేరేంటి ఎక్కడుంటాడు అంటూ విసిగిస్తుంటే అన్నలకి ,తండ్రి కి చెప్పడం కూడా తప్పేనా , అమ్మ కూడా వారి తో పాటే నువ్వేం చేసావో అంటుందే.అమ్మ కూడా అడదే కదా , అమ్మ అనడం ఎందుకు తర్వాత అతను వెంట పడడం మానలేదు కానీ అతని మంచితనం స్నేహితుల ద్వారా తెలుసుకుంది తాను. ఒకరోజు ప్రేమించనన్నాడు. కానీ తను నాకిలాంటివి నచ్చవు అంది కానీ అతను మాత్రం తన వెంట తిరగడం మాత్రం ఆపలేదు.చివరికి నువ్వు లేకపోతే చచ్చిపోతా అంటూ బెదిరించాడు. నిజంగానే చెయ్యి కూడా కోసుకుని ఆసుపత్రి లో చేరాడని తెలిసి అందరితో పాటు తాను వెళ్ళింది. స్నేహితులు కూడా ఒప్పుకోవచ్చు కదా ఇంత మంచి వాడిని నీ తల్లిదండ్రులు కూడా తెలేరు అన్నారు తాను నిజమే అనుకుంది.
అతన్ని ప్రేమించడం మొదలు పెట్టింది. అతను కూడా చాలా ప్రేమ చూపించాడు. ఇద్దరూ కలిసి చాలా తిరిగారు. చదువు అయ్యాక పెళ్లి చేసుకుంటా అనండం తో తనని లోబర్చుకున్నాడు.అతన్ని నమ్మింది తనను తాను అర్పించుకుంది. ఆ తర్వాత ఇద్దరూ వెళ్లి తల్లిదండ్రి కి ప్రేమ విషయం చెప్తే ఒప్పుకోలేదు. దాంతో అతనే తనను బయటకు రమ్మని అన్నాడు. కానీ తను రానని తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అంటే కాదు నా మీద ప్రేమ లేదా అంటూ ముందరి కాళ్ళకు బంధం వేశాడు. తన ప్రేమ కోసం మొదటి సారి ఇంట్లో నుండి అడుగు బయట పెట్టింది. ఇద్దరూ గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. కాపురం పెట్టారు. కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. ఇదిగో ఇప్పుడు అతని తల్లిదండ్రులు వచ్చి నా కొడుకుని వల్లో వేసుకున్నావు.తప్పు నీదే అంటున్నా , అతను కూడా వారికి వంత పాడుతున్నాడు.
ఇప్పుడు తానేం చేయాలి. తను చేసింది తప్పా , ఒప్పా. ఏమో ఏమి అర్దం కావడం లేదు.ప్రేమించిన వాడు కూడా తనదే తప్పని అంటే తానేం చేయాలి. ఇంత మంది తప్పు నాదే అంటే నిజంగా తప్పు చేశానా అనిపిస్తుంది. అయినా నేను అతన్ని ప్రేమించానా , అతనే వెంట పడ్డాడు. వేధించాడు, చెయ్యి కొసుకున్నాడు. తను జాలి పడి ఒప్పుకుంది. తన స్నేహితులు కూడా మంచివాడు ఒప్పుకో అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు కూడా తనదే తప్పు అంటున్నారు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది వాళ్ళు వాళ్ళ మాట వినలేదని తప్పు నాదే అన్నారు. ఇంత పెద్ద తప్పు నేనెలా చేశాను , అసలు నాకు ఆలోచన లేదా, ఉన్నా కూడా చేయనివ్వ లేదా, నాకేం కావాలో నాకు తెలియదా, అవును నిజమే తెలియదు నాకేం కావాలో నాకు తెలియదు.
చిన్నప్పటి నుండి నాకు ఆలోచించే అవసరం లేకుండా నా తల్లిదండ్రులే ఏ బట్టలు వేసుకోవాలి ఏ స్కూల్ లో చేరాలి ఏ కాలేజీలో చేరాలి అంటూ అన్ని వారే నిర్ణయించారు. నా పెళ్లి ప్రేమ కూడా నా ఆలోచన లేకుండానే జరిగింది. ఇప్పుడు మాత్రం తప్పు నాదే అంటున్నారు. నన్ను ఆలోచించ కుండ చేసిన వారిది తప్పు , నీకేం తెలియదన్న వారిది తప్పు , ఇప్పుడు ఒక వేళ నేను వెనక్కి వెళ్ళినా నాకు తోడుగా ఎవరో ఒకరు ఉండాలి. అసలు ఒంటరిగా ఉండలేనా అమ్మో ఉండలేను ఉంటే లోకులు మాటలతో చంపేస్తారు.కాకుల్లా పొడస్తారు. వద్దు వద్దు వెళ్ళాను, పోరాడే శక్తి నాకు లేదు.నిజానికి నాకేం తెలియదు. నేనేమీ చేయలేను. కానీ ఒకటి మాత్రం చేయగలను అవును అదే చేస్తాను. అడుగులు ఊరి చెరువు వైపు పరుగులు తీశాయి.
****
తెల్లారి ఊర్లో చెరువులో శవమై తేలిన కూతుర్ని చూసి చేసిన తప్పుకు శిక్ష అనుభవించి ప్రాణం తీసుకుంది అని తల్లిదండ్రులు రోదించారు. తాము చెప్పినట్టు వింటే ఈ స్థితి రాకపోయేది అంటూ అందరికీ తెలిసేలా చేశారు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న వాడొచ్చి నాతప్పేం లేదు. నా ఆరోగ్యం బాగా లేదనే, తన వల్లే నాకిలా జరిగింది అంటూ ఇలా జరిగితే చావడం కూడా తన తప్పే అంటూ తప్పుకున్నాడు.
ప్రతి ఆడపిల్లా జీవితం ఇలాగే ఉంటుంది. ఇలాగే కొనసాగితే ఆడపిల్లలు ఆలోచించే స్వాతంత్య్రం కోల్పోతారు. కొందరు చేసే పనుల వల్ల ఇలా జరుగుతుంది.జరుగుతూనే ఉంటుంది.
-భవ్యచారు