అంతులేని కథ 

అంతులేని కథ 

 

అదొక అందమైన సుందరమైన అధునాతన పద్ధతులు ఉన్న బిల్డింగ్, అందులో కి వెళ్తే అదొక లోకం లోకి వెళ్లినట్లు ఉంటుంది. చాలా మంది తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అందులోకి వెళ్తారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ జీవితం కొనసాగడానికి వెళ్తారు. 

ఇంకొందరు డబ్బు కోసం వెళ్తారు అతి కొద్ది మంది మాత్రం సేవ చేయడానికి వెళ్తారు. ప్రాణాలు కాపాడుకోవాలని వచ్చే వారికి అదొక దేవాలయం. అందులో అందరూ గుళ్ళోకి చెప్పులు లేకుండా ఎలా అయితే వెళ్తారో అలాగే ఆ ఆసుపత్రికి కూడా అందరూ అలాగే వస్తారు. డాక్టర్స్ ను కనిపించే దేవుడు అనుకుంటూ తమ ప్రాణాలు అతని చేతిలో ఉంచి, ఎలాగైనా కాపాడమని వేడుకుంటారు.. 

అలాంటి ఆసుపత్రిలోకి తెల్లని దుస్తులు వేసుకున్న ప్రియ వచ్చింది డ్యూటీ చేయడానికి. తను కొత్తగా చేరింది మనుషులకు సేవ చేయడం కోసమే తాను పుట్టినట్టుగా భావిస్తుంది ప్రియ. తాను డ్యూటీ లోకి వెళ్ళడానికి పి.పి కిట్ వేసుకోవాలని గది లోకి వెళ్ళింది. అక్కడ యాదగిరి ఏదో చేస్తూ కనిపించడంతో ఏంటి యాదగిరి ఏం చేస్తున్నావు అంటూ దగ్గరగా వెళ్ళింది ప్రియ.

అమ్మా, మీరు వెళ్ళిపొండి ఇక్కడికి రాకండి అన్నాడు బాటిల్ లో నీళ్ళు నింపుతూ, ఎందుకు రావద్దు? ఏం చేస్తున్నావు? అదేంటి సైలెన్ బాటిల్ లో నీళ్ళు ఎందుకు పోతున్నావు? అంది గాబరాగా ప్రియ. అమ్మా, ఇది డాక్టర్ చెప్పిన పని చేస్తున్నా మీరు ఇక్కడ ఉండకూడదు వెళ్ళండి. కొత్తగా చేరారు మీరు. మీకు ఇవన్నీ తెలియదు  మీరు చూసారు అని తెలిస్తే  మీ ప్రాణాలకే ప్రమాదం వెళ్ళండి అంటూ తొందర చేశాడు యాదగిరి. ప్రాణాలు, ప్రమాదం అనగానే భయపడిన ప్రియ గబగబా డ్రెస్ వేసుకుని పక్కకు వెళ్ళింది. కానీ, ఆమె మనసు ఊరుకోలేదు. దాంతో, చాటుగా నిలబడి ఫోన్ తీసి సైలెంట్ మోడ్ లో పెట్టీ యాదగిరి చేస్తున్నది అంతా సైలెంట్ గా వీడియో తీస్తుంది. 

యాదగిరి సెలైన్ బాటిల్ లో నీళ్ళు నింపి డబ్బాలో పెట్టేసి వాటిని తీసుకుని ముందుకు కదిలాడు. అతను వెళ్తూ ఉండగా వెనకాలే ఫాలో అయ్యింది ప్రియ. యాదగిరి జనరల్ వార్డులోకి వెళ్లి వాటిని ఆ వార్డు బాయ్ కి అప్పగించగానే అతను సిస్టర్ ని పిలిచి ఆ బాటిల్స్ ఇచ్చి అందరికీ పెట్టమని చెప్పాడు. మరో చోట ఎక్స్పైరి అయిన టాబ్లెట్స్ ఆ డబ్బా ల్లోంచి తీసి మరో డబ్బాలో డేట్ ఎక్కువ ఉన్న డబ్బాల్లో పెడుతున్నారు. వీడియో తన పని తాను చేసుకపోతుంది …

 ******

అన్నా నీ కాళ్ళు మొక్కుత మా నాయనకు ఊపిరి ఆడుత లేదే జర ఆక్సిజన్ సిలిండర్ పెట్టి పానం కాపాడే నీకు దండం పెడతా, అంటూ స్వామిని బ్రతిమాలుతున్నాడు ఒక ఇరవై మూడేళ్ల పల్లెటూరి యువకుడు.  ఎందంత బతిమాలుతున్నాడు అన్నాడు అప్పుడే వచ్చిన యాదగిరి. అరె వాని అయ్య కు కరోనాతో ఊపిరి అందటం లేదని అంటున్నాడు అన్నాడు స్వామి. అరె తమ్ముడు ఇటు రారా అంటూ ఆ యువకుడిని పక్కకు తీసుకుని వెళ్ళాడు యాదగిరి. ఎంతున్నయి మెల్లిగా అడిగాడు యాదగిరి.

అన్నా రెండు లక్షలు ఉన్నాయి అన్నాడు ఆ యువకుడు. అరే ఇంకెంది తమ్ముడు అంటూ గబగబా స్వామి దగ్గరికి వచ్చి రెండున్నాయి అంట అనగానే , స్వామి తోల్కరా పో అంటూ బీడీ పక్కన పారేసి. ముందుకు కదిలాడు , అన్నా ఏడున్నయే సిలిండర్ లు లేవు కదా అన్నాడు యాదగిరి, ఈ సచ్చే ముసలోనికి ఎందుకు రా సిలిండర్ వీడిని పక్కకు పెట్టి అనికి పెడదాం, మనకు పైసల్ అస్తయ్ అంటూ బెడ్ పైన ఉన్న ముసలి వ్యక్తి ముక్కు కు ఉన్న మాస్క్ తీసి వేశాడు స్వామి. అతను గిల గిలా కొట్టుకోవడం యాదగిరి చూడలేక కళ్ళు మూసుకున్నాడు.

దాంతో అతను కాసేపు కొట్టుకుని ప్రాణాలు విడిచాడు. రా, రా అంటూ అతన్ని ఆ బెడ్ పై నుండి తీసి అదే గదిలో ఒక మూలకు చేర్చి, బెడ్ నీటుగా సర్దారు ఇద్దరు, ఇంతలో ఆ యువకుడు తన తండ్రిని తీసుకుని వచ్చాడు. అతనికి సిలిండర్ మాస్క్ పెట్టేశారు ఇద్దరు. తండ్రిని, డబ్బును వాళ్ళ చేతిలో పెట్టేసిన ఆ యువకుడు అన్నా జాగ్రత్తనే ఎన్ని పైసల్ అయినా సరే, నాయిన జాగ్రత్త అనగానే అరె నువ్వు పోరా బై ఇడ ఉండొద్దు అనగానే అన్నా జాగ్రత్త మీ పైసలు యాడికి బోవు అన్నాడు అతను. అరె నువ్వు గంతగ చెప్పల్నా మేము సూసుకుంటం కదా అంటూ పైసలు లెక్క బెట్టుకుంటూ పక్కకు పోయాడు స్వామి, అతని వెనకాలే వెళ్ళాడు యాదగిరి ….

************

మరో చోట శాంపిల్స్ తీసుకున్న ల్యాబ్ అసిస్టెంట్ దగ్గరికి వచ్చిన ఒక డాక్టర్ ఈరోజు ఎంత మంది ఉన్నారు అని అడిగాడు. ఎంతో లేరు సార్ పది మంది ఉంటారు అంతే అన్నాడు అతను. అంతేనా, ఎవరికీ రాలేదా అయితే నువ్వొక పని చెయ్యి ఎంత మంది టెస్ట్ చేసుకున్నారు అనగానే ,రెండు వందల మంది సార్ అన్నాడు అతను. సరే నూట యాభై మందికి పాజిటివ్ అని రాసేయ్యి, మిగిలిన వారికి నెగటివ్ అని రాయి అన్నాడు డాక్టర్. లేదు సార్ లేని వారిని భయపెట్టడం ఎందుకు అన్నాడు అమాయకంగా ఆ అసిస్టెంట్ దానికి డాక్టర్, ఏమ్ నీకు డబ్బులు అవసరం లేదా, నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే రాయి లేదంటే ఆశ వదులుకో, నువ్వు నన్ను ప్రశ్నించ కూడదు , చెప్పింది చేసి ఇచ్చింది తీసుకుని వెళ్ళు. నీతి, న్యాయం అంటూ కూర్చుంటే ప్రాణాలు గాల్లో కలుస్తాయి, అని సీరియస్ గా చెప్పి నవ్వుతూ వెనుదిరిగాడు డాక్టర్ . ఆ అసిస్టెంట్ గట్టిగా నిట్టూర్చి రాని వారికి పాజిటివ్ అని రాయడంలో మునిగి పోయాడు. వీడియో తన పని తాను చేసుకుపోతుంది.

అంతులేని కథ
అంతులేని కథ

మరో చోట వ్యాక్సిన్ కోసం వరుసలో నిలబడిన వాళ్లను చూస్తున్న సిస్టర్ శ్రీలక్ష్మి, అయ్యో వీళ్ళందరూ వస్తున్నారు అక్కడేమో వ్యాక్సిన్ లు డేట్ అయిపోయాయి. డాక్టర్ కు చెప్పినా, అవే వెయ్యి అన్నాడు. ఇప్పుడేం చేయాలో అర్థం అయిత లేదు. అయినా నాకేమీ వచ్చిన వాళ్లకు ఏస్తా, ఏమన్నా అయితే వాళ్ళే చూసుకుంటారు అంటూ అంతకు ముందు డాక్టర్ ఇచ్చిన డబ్బు జాకెట్లోకి దోపుకుంది. అవునక్క  ఏదైనా అయితే పోయేది మన ఉద్యోగమే కదా, పైసలు ఇచ్చి మన నోరు మూయిoచాడు. ఇవి ఇస్తే పాపం జనాలు ఏమైతారో అన్నది సిస్టర్ శ్రీ కళ . ఏం చేస్తాం మరి వాళ్లకు ఎదురు చెప్తే అంతే , మన ప్రాణాలు పోతాయి కళ్ళు మూసుకుని చేసుకుంటూ పోవడమే తప్ప ఏమీ చేయలేము అన్నది శ్రీలక్ష్మి. ఇంతలో ఒక పెద్దావిడ ఆమె ముందున్న స్టూల్ పైన కుర్చుని ఏం బిడ్డా ఎండలో ఎంత సేపు నిలబడాలి అంది ఆయాస పడుతూ … అయ్యో అవ్వ సూడు ఎంత మంది ఉన్నారో నువ్వే సుషినావు కదా అన్నది శ్రీ కళ. శ్రీలక్ష్మి కళ్ళు మూసుకుని దేవుణ్ణి  ప్రార్థించి, వ్యాక్సిన్ తీసి సిరంజిలోకి ఎక్కించి ఆమెకు ఇచ్చింది కళ్ళు మూసుకుని. ఇగ నాకు కరోనా రాదు కదా బిడ్డా అన్నది సంతోషపడుతూ ఆ అవ్వ. రాదవ్వ నువ్వు మళ్ళీ మూడు నెలలకు రావాలి అంది నవ్వుతూ శ్రీలక్ష్మీ. అట్లనే బిడ్డా నీ కడుపు సల్గగుండ అంటూ ఆమె వెళ్ళిపోయింది. ఆసుపత్రి గేట్ కూడా దాటనే లేదు ఆ ముసలావిడ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. అందరూ ఎండ దెబ్బ అనుకున్నారు. కానీ, ఎవరికీ తీసుకున్న వ్యాక్సిన్ వికటించి చనిపోయిందని తెలియలేదు. వ్యాక్సిన్ డేట్ దాటిందని ఎవరు గుర్తించ లేకుండానే లైన్ ముందుకు కదిలింది. వీడియో తనపని తాను చేసుుపోతుంది. 

మరో చోట డాక్టర్స్ వాడేసిన పి.పి కిట్లు కుప్పగా ఉన్నాయి. వాటిని డ్రమ్ము లోని నీళ్ళలో తీసి అరెస్తున్నారు కొందరు. అవునే ఏల్లక్క, ఈ కిట్లు మల్లా ఆడోద్దు పారేయాలి అన్నరు  కదానే, మల్లా ఎందుకు ఉతుకుడు అన్నది అమాయకంగా మంజుల. ఒసి పోల్ల మల్ల మల్ల కొత్తయి ఎవలు కొంటారు? ఆల్లు మనుషులా ఏంది డాక్టర్ లు అల్లకు పైసలు ముఖ్యం. కానీ, ప్రాణాలు ముఖ్యం కాదు. ఎవలో ఒకలు ఎక్కన్నో ఒక కాడ ఉంటారు దేవుల్లాంటి డాక్టర్ లు. ఈల్లు సదువుకే డాక్టర్ లు ,మనుషులకు కాదు మానవత్వం ఉన్నోల్లు కాదు అని తేల్చేసింది ఏల్లవ్వ.

ఆమె నిర్ణయం విన్న ప్రియ అవాక్కయ్యింది. ఇవన్నీ రికార్డ్ చేసిన తన ఫోన్ ను ఏం చేయాలో తెలియలేదు. తానే వెళ్లి కంప్లైంట్ ఇస్తే తనను చంపడం ఖాయం కాబట్టి మౌనంగా అన్ని చూస్తూ హాస్టల్ కి వెళ్ళింది. కానీ ప్రొద్దుట నుండి అన్ని చూస్తున్న తనకు నిద్ర పట్టలేదు. ఎలాగైనా ఈ విషయాలు అందరికీ తెలియాలి, జనాల ప్రాణాలు కాపాడాలి, ఇటూ తన ప్రాణాలు కాపాడుకోవాలి ఎలా? ఎలా? అంటూ రాత్రంతా ఆలోచించి తన జర్నలిస్ట్ ఫ్రెండ్ అయిన అర్జున్ కి ఫోన్ చేసి సలహా అడిగింది. 

ప్రియా, నువ్వు నీ ప్రాణాలు కాపాడుకుంటూ వాళ్ళ అరాచకం బయట పెట్టాలి అంటే ఒకటే మార్గం ఉంది. ఫేస్ బుక్ లో ఒక ఫేక్ ఐడీ క్రియేట్ చేసి ఈ వీడియో అందులో అప్లోడ్ చేయి. అలాగే అప్లోడ్ చేశాక హాస్పిటల్ పేరు కూడా వచ్చేలా చెయ్యి. నీ గురించి ఎవరు తెలుసుకోలేరు నువ్వు మళ్లీ ఎప్పటిలా జాబ్ కి వెళ్ళు, అంటూ సలహా ఇచ్చాడు ప్రియా ఫ్రెండ్ అర్జున్. ప్రియకి ఆ సలహా నచ్చి వెంటనే, ఫేక్ ఐడీ క్రియేట్ చేసి వీడియో అప్లోడ్ చేసి హాయిగా నిద్ర పోయింది. 

ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది. తెల్లారే సరికి మొత్తం హడావుడి అయ్యింది . గవర్నమెంట్ ఆ హాస్పిటల్ ని సీజ్ చేసింది. ఆ ఆసుపత్రి ఏం.డి ప్రభుత్వాన్ని చాలా బ్రతిమాలాడు కానీ ప్రజలు అతన్ని శిక్షించాలని డిమాండ్ చేశారు . దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 

****

కరోనాతో చాలా మంది చనిపోవడంతో ప్రభుత్వం మళ్ళీ లాక్ డౌన్ పెట్టింది. దాంతో, జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రభుత్వం కొత్తగా డాక్టర్స్ ని రిక్రూట్ చేసింది. కొత్త ఆసుపత్రులకు పర్మిషన్ ఇచ్చింది. అరెస్ట్ అయిన డాక్టర్ అధికారులకు లంచం ఇచ్చి బయటకు వచ్చాడు. ఆసుపత్రి పేరు మార్చి మళ్లీ బిజినెస్ చేయడం మొదలు పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదొక అంతు , అంతం లేని కథ. అవినీతికి అలవాటు పడిన వాళ్ళు, జనాలు అమాయకంగా వాళ్లను నమ్మినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ప్రజలు మోస పోతూనే ఉంటారు.

డాక్టర్ అంటే కనిపించే దేవుడు, కనిపించని ఆ దేవుణ్ణి నమ్ముకునే ప్రజలు కనిపించే ఈ దేవుడికి దణ్ణం పెట్టి తమ ప్రాణాలు అతని చేతిలో పెట్టి హాయిగా నిద్ర పోతారు. కానీ డాక్టర్స్ మాత్రం డబ్బు ఆశకు , జనాల ప్రాణాలు తీస్తూ తమ ఆస్తులు పెంచుకుంటున్నారు. జనాలు బాగుంటే చాలని కోరేది పురోహితుడు అయితే , చనిపోయే వాళ్లకు ప్రాణదానం చేసేది డాక్టర్, ఆ వృత్తికి కళంకం తెచ్చేది కొందరు అయితే , వృత్తినే దైవంలా భావించి ప్రాణాలు పోసేది కొందరు మాత్రమే… 

ఈ అవినీతిని అంతం చేసే చట్టాలు, ప్రభుత్వాలు, నాయకులు రావాలి. మంచి సమాజం కావాలి, అవినీతిని, కల్తీని నిర్మూలించే నాయకులు మనకు కావాలి అవన్నీ కావాలి, రావాలి అంటే యువతలో మార్పు రావాలి. కులాల కోసం ఓట్లు వేయక అన్ని కులాలు ఒకటే అంతా ఒకటే అనే విధంగా మంచి వాళ్లను ఎన్నుకోవాలి. మంచి సమాజం స్థాపించాలి అంటే భారత దేశం మళ్లీ, మళ్లీ, మళ్లీ, మళ్లీ, ఇలా ఎన్నో మళ్లీలు వచ్చి పుడుతూనే ఉండాలి . . . 

ఎప్పుడైతే  ఒక అవినీతి లేని రాజ్యం ఉద్భవిస్తుందో, అప్పుడే ప్రజలు ఆనందంగా ఉంటారు..

– హరి ప్రియ

Related Posts