అనుభూతుల వల

అనుభూతుల వల

దోచుకునే జనాలున్నట్టే
దాచుకునే దోస్తులుంటారు
శ్లేష్మమై జీవితం మింగేస్తుంటే
జీవన సౌరభం జారిపోతుంటుంది

బాల్యపు మిత్రుడెప్పుడో
చరమాంకంలో
చరిత్ర పాఠంలా పలకరిస్తాడు
వళ్లంతా చెవులు చేసుకుని
జ్ఞాపకాల స్వరమాధురికి తలొగ్గుతాం

తారతమ్యాలు లేని ఆకాలంలో
అందరూ తారలే
మధ్యలో వచ్చే హోదాల గోదాల్లో
సిగపట్లతో అలిసిపోయాక
సిగ్గే మిగులుతుంది

మునిమాపువేళంతే
మధుర జ్ఞాపకాలను చప్పరిస్తుంటుంది
గతం వర్తమానాల మధ్య లోలకమై
లోపలి దాహానికి చలివేంద్రమవుతుంది

ఇక భవిష్యత్తు బెంగనిపించదు
నడిచిన బాటలో చేసిన గాయాల చింతే ఉంటుంది
అనుభూతుల వలేసి మిత్రులను గాలించటమే మిగిలింది

– సి. యస్. రాంబాబు

Related Posts