అనుకోకుండా ఒక రోజు

అనుకోకుండా ఒక రోజు

చలికి తాళలేక ఊరంతా అరింటికే సద్దుమునిగింది. ఎడవుతుండగా వేడి వేడి అన్నం తినేసి, రగ్గులు కప్పుకుని మునగధీసుకున్నారు ఊర్లోని జనం. దాదాపు అందరు పొద్దున్నే లేచేవారు కాబట్టి అలసిపోయి నిద్దర్లోకి జారిపోయారు. నాకు కూడా బాగా చలిగా అనిపించడం తో రగ్గు తీసుకుని కప్పుకున్నా, బస్సు మెల్లిగా వెళ్తుంది. ఇక ఇదే ఆఖరు స్టేజ్ కావడంతో నేను ఒక్కడినే బస్సు లో ఉన్నాను.

అదే చివరి బస్సు కూడా మా ఊరికి. అనుకోకుండా ఎబివిపి బంద్ కు పిలుపునివ్వడంతో ఆ నాలుగు రోజులు హాస్టల్ లో ఉండలేక ఇంటి మీద బెంగ తో అలాగే హాస్టల్ ఆహారం తిని కడుపు ఎలాగో ఉండడం వల్ల అమ్మ చేతి వంట తినొచ్చు అనే ఉద్దేశ్యంతో సాయంత్రం ప్రయాణం అయ్యాను.

ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సర్ప్రైజ్ ఇవ్వాలని నా చిలిపి ఆలోచన. ఇంతలో బస్ ఆగింది. కండక్టర్, డ్రైవర్ ఇద్దరూ బస్ దిగారు. నేనూ నా బ్యాగ్ తీసుకుని బస్ దిగి మెల్లిగా నడుస్తున్నాను ఊర్లోకి…. మా ఇల్లు కాస్త దూరంగానే ఉంటుంది బస్ స్టాండ్ కి కాబట్టి బస్సు శబ్దలు వినిపించవు.

మెల్లిగా నిండా రగ్గు కప్పుకుని ఒక చేతిలో బ్యాగ్, మరో చేతిలో సూట్ కేస్ తో నడుస్తూ మా ఇంటి గల్లి లోకి వెళ్ళాను. అంత నిశబ్దంగా ఉంది. నా అడుగుల చప్పుడు నాకే వింతగా వినిపిస్తుంది. నగరం లో ఎప్పుడూ రణగొణ ధ్వనులతో విసిగిన నాకు అది బాగుంది అనిపించి, సూట్ కేస్ కింద పెట్టీ కాసేపు ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలని నిలబడి చుట్టూ చూస్తున్నా….

ఇంతలో హఠాత్తుగా నా మొహం పైన ఎవరో ముసుగు వేశారు. ఇంకొకరు నా రెండు చేతులూ వెనక్కి విరిచి పట్టుకున్నారు కదలకుండా… ఇంకొకరు నా మూతి మూశారు. ఆ వెంటనే దొంగ దొంగ అంటూ గట్టిగా అరుపులు కేకలతో ఊరంతా మేల్కొంది.

గట్టిగా అరుపులు విని అందరూ ఇళ్లలోంచి అలాగే పరుగెత్తి వచ్చారు. నాకు ఏమి కనిపించడం లేదు. మాట్లాడాలంటే మూతి మూశారు. చేతులూ గట్టిగా కట్టేసారు. దాంతో నేను గింజుకోవాలని చూస్తుంటే వాళ్ళు ఇంకా గట్టిగా పట్టుకుంటూ పోలీస్ లకి ఫోన్ చేయండి అంటున్నారు.

ఓర్నాయనోయ్ పోలీసులా ఒరేయి నేను దొంగను కాదురా అని గట్టిగా చెప్పాలనుకున్నా చెప్పలేక పోయాను. ఈ లోపు ఎవరో అరేయ్ నీ పట్టుకు వాడు చచ్చేలా ఉన్నాడు. చెట్టుకు కట్టేయండి పోలీసులు వచ్చేదాకా అనడం తో బతికించవు రా అనుకున్నా ఎవడో కానీ మంచి సలహానే ఇచ్చాడని సంతోషించాను.

వెంటనే నన్ను పట్టుకున్న వాళ్ళు నా ముసుగు తీయకుండానే నన్ను లాక్కు వెళ్లి చెట్టుకు కట్టేసారు. ఇంతలో ఎవరో ఒకావిడ ఆ ముసుగు తీయండి నేనూ దొంగను ఎప్పుడూ చూడలేదు చూస్తాను అని అంది. అవునవును తీయండి వీడు ఏ ఉరొడో తెలుసుకుందాం అన్నారు ఇంకెవరో…. చూద్దాం చూద్దాం అంటూ అందరూ అనడం తో వాళ్ళు నా మొహాన ఉన్న ముసుగు తీసి వేశారు.

ఒక్కసారిగా ముసుగు తీయడం తో అప్పటి వరకు గాలి అడక సతమతమైన నేను గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలాను. అందర్నీ ఒక్కసారి చుట్టూ చూసాను. వాళ్ల లో ఎవరో నా మొహం పైన టార్చి వేశారు. దాంతో వెలుగు చూడలేక కళ్ళు మూసుకున్నా…

ఒరోరి ఎదవల్లారా ఎంత పని చేశారా… వీడు దొంగ కాదు రా, మన చంద్రన్న చిన్న కొడుకు రవి గాడు రా మనోడే… హాస్టల్ లో ఉంటున్నాడు పట్నం లో అంటూ మా వీధిలో ఉండే గణేష్ గట్టిగా అరిచాడు. వాడు కిరాణా షాపు నడిపిస్తాడు ఊర్లో. అవునా మనొడా ఓరోరి ఎంత పనయ్యింది అంటూ అంతకు ముందు కట్టేసిన వాళ్ళు దగ్గరికి వచ్చి కట్లు విప్పారు.

ఈలోపు, అలా కప్పితే చెప్పాలి కదయ్యా అంది దొంగను చూడాలి అన్న కాంతమ్మత్తతో, నన్నెక్కడ చెప్పనిచ్చారు అత్తా, నోరు మూసి, చేతులూ కట్టేసారు అన్నాను దుఖంతో గొంతు పూడుకు పోగా….

ఒరొరి ఏమి అనుకోబాకయ్యా నాలుగు రోజుల నుండి ఊర్లో దొంగలు పడుతూ గోర్లు, బర్లు, మేకలు ఎత్తుకు పోతున్నారు. గందుకే జట్లు జట్లు గా కావలి ఉంటున్నాము అంటూ ఊరి సర్పంచ్ రఘు అన్నాడు. ఈ లోపు విషయం తెలిసి మా నాన్న, అన్న రానే వచ్చారు.

నన్ను చూడగానే అన్న వచ్చి హత్తుకుంటూ ఏంది రా చెప్పా పెట్టకుండా అస్తివి. చెప్తే బస్ కాడికి మేమే ఒచ్చేటోల్లంగందా, ఇదంతా అయ్యేది కాదు కదా అన్నాడు భుజం నిమురుతూ…. నాకేం తెలుసు ఇలా అవుతుంది అని, మీకు నేను సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటే మీరే నాకు ఇచ్చారు పెద్ద సర్ప్రైజ్ అన్నాను.

ఇంతలో మిగిలిన అందరూ దగ్గరికి వచ్చి నా చేతులు పట్టుకుంటూ ఉకో అయ్యా తెల్వక చేసిన తప్పుకు ఏమి అనుకోబాకు. నీకు ఈడ పరిస్థితి తెల్వదు. మాకు నువ్వని తెల్వక పొరపాటు అయ్యింది. మమల్ని మన్నించు అన్నారు ఒకేసారి.

దాంతో అయ్యయ్యో మీరంతా పెద్దలు మాటలన్నీ ఎందుకే కాక నాకు అర్థం అయ్యింది. గోర్లు, మ్యాకలే కదా మీకు జీవనాధారం. మీరు జాగ్రత్తలో ఉండడం మంచిదే. ఇగ నుండి అన్న కు ఫోన్ చేసే వస్త అన్నాను. వారి అభిమానం తో కళ్ళు చెమర్చాయి నాకు. ఇగో రమేషు రేపు ఊరందరం దావత్ చేసుకుందాం ఇగో అసలు దొంగ దొరికిండు అంటూ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ వచ్చాడు. అవునా ఎట్లా అన్నాడు అన్న.

మీ రవి అచ్చిన బస్ లనే వెనక సలకలు పట్టుకుని దిగిండు. మేము అప్పటికే గాడ ఉన్నం జీబుల. వాడు మమల్ని చూసి పరుగులు వెట్టి సావ గొట్టిండు. ఇగ ఎట్లనో పట్టినం. ఇక మీ మ్యాకలు, గొర్లు ఏడికి పోవు.

గందుకే దావత్ అన్నా అన్నాడు శ్రీనివాస్. సరే అన్నా మంచిది ఇంతకు వీడు ఏ ఉరొడు అనగానే ఇక్కడోడు కాదు తెలుగు రాదు. హిందీ వొడు ఇగ నేను పోతా, సారు చూస్తాడు అంటూ వాణ్ణి తీసుకుని వెళ్ళాడు శ్రీనివాస్.

అరేయ్ రవి నువ్వోచ్చిన వేళా విశేషం ఇన్ని రోజులూ పానం దిన్న దొంగ దొరికిండు. నీ కాలు మంచిది రా అంటూ గణేష్ తో పాటు అందరూ చప్పట్లు కొట్టారు. నాకు సంతోషంగా అనిపించింది. ఈ విషయం ఏళ్ల తరబడి కథలుగా చెప్పుకుంటారు అనే సంతోషం తో అన్న, నాన్న తో కలిసి అందరి దగ్గర సెలవు తీసుకుని ఇంటి వైపు అడుగులు వేసాను.

– భవ్య చారు 

Related Posts