అనుమానం పెనుభూతం

అనుమానం పెనుభూతం

అనుమానం పెనుభూతం

అమ్మ ఇల్లు బాగుందా అన్నాడు పెద్దోడు, బాగుందిరా. మనం ఇంతకు ముందున్న ఇల్లు కన్న చాలా బాగుంది. ఇది మనందరికీ సరిపోతుంది అంది అమ్మ సంతోషంగా… నీకు నచ్చింది నాకు అదే చాలు. మూడు నెలల నుండి వెతుకుతుంటే ఇప్పటికీ నేను అనుకున్న రీతిలో ఇల్లు దొరికింది.

అమ్మ నీకు చెప్పలేదు కానీ నేను మూడు నెలల నుంచి చాలా ఇల్లు చూశాను ఒక్కో దగ్గర ఒక్కోలా ఉన్నాయి. బాత్రూం ఉండదు నీళ్లు ఉంటే బాత్రూంలో ఉండవు బాత్రూంలో మంచిగా ఉంటే నీళ్లు ఉండవు మనం ఐదుగురం అనేసరికి కొందరు ఇవ్వము అంటూ మొహం మీదే చెప్పేశారు అలాగే గదులు కూడా చిన్నచిన్నగా ఉండేవి నేను ఈ మూడు నెలలు ఎంతగా తిరిగానో నాకే తెలుసు అంటూ వాపోయాడు పెద్దోడు.

పర్లేదులే ఇన్ని రోజులు నువ్వు తిరిగినందుకు మనకు మంచి ఇల్లే దొరికింది నీ కష్టం ఊరికే పోలేదులే అంటూ అమ్మ సర్ది చెప్పేసరికి సరే మనం ఇంకా ఇల్లు సర్దుకుందాం అంటూ ఒక వారంలో ఇల్లంతా సర్దేసుకున్నారు అందరూ కలిసి. కొత్త ఇల్లు కాబట్టి దగ్గర్లో ఏమేమి ఉన్నాయి ఎలాంటి షాప్స్ ఉన్నాయి మనకు ఎక్కడ ఏం దొరుకుతుంది అనేది తెలుసుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఆ వారం రోజులు ఇల్లు సర్దుకోవడం తుడుచుకోవడంతో అందరూ అలసిపోయి నిద్రపోయారు. అంతే తప్ప మిగతా విషయాలు ఏమీ పట్టించుకోలేదు.

అయితే అంతా సర్దుకున్న తర్వాత ఆ మరుసటి రోజు నుండి మొదలైంది అసలు సమస్య. ఇంతకుముందు ఉన్నది అపార్ట్మెంట్ అవడం వల్ల చుట్టుపక్కల ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు ఉండడంతో ఎప్పుడు చూసినా సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఇంట్లో కింద ఓనర్ వాళ్ళు ఉన్న పక్క వాళ్ళు ఉన్న ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అవడంతో అమ్మగారికి ఏమి పాలుపోకపోయేది.

కనీసం పలకరించడానికి కూడా ఎవరూ లేకపోవడంతో తనకి కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా పిల్లలకు దగ్గరగా ఉంది కాబట్టి సర్దుకోవాలి అని అనుకుంది. పొద్దున్నే వంట చేసి బాక్సులు కట్టించి పంపితే ఇంకా తాను ఒకటి అయిపోవడం వల్ల ఏమీ పాలు పోయేది కాదు. దాంతో ఇంట్లో ఉన్న మిషిన్ తో ఏమో చిన్న చిన్న బట్టలు, డోర్ మ్యాట్లు కుట్టుకుంటూ గడిపేది.

ఒకరోజు అర్ధరాత్రి బాత్ రూమ్ కి లేచిన అమ్మగారికి తెల్లగా ఏదో కనిపించింది. దాంతో వెంటనే భయపడి తన కొడుకుని నిద్ర లేపింది. ఏంటమ్మా ఏమైంది అంటూ లేచాడు కొడుకు. ఏమోరా నాకు తెల్లగా ఏదో కనిపించింది అని అనగానే చిన్నోడు ఏమైంది అంటూ ఇల్లంతా లైట్లు వేసి హడావిడి చేశాడు ఎందుకంటే చిన్నోడికి కాస్త భయం ఎక్కువ వాడు భయపడడం చూసి ఏం లేదు ఏం లేదు ఏదో లైట్ వేయమని చెప్పింది అంటూ కవర్ చేశాడు పెద్దోడు.

అమ్మ కూడా అవును చిన్నోడు భయపడతాడు అనుకుంటూ తాను కూడా ఇక ఏమీ మాట్లాడకుండా బాత్రూం కి వెళ్లి వచ్చి పడుకుంది. కానీ ఆమె మనసులో ఉన్న అనుమానం మాత్రం పోలేదు.

అది ఏమై ఉంటుంది అది తన భ్రమనా? లేదా నిజమేనా ఇది కొత్త ఇల్లు ఇందులో ఏమైనా ఉందా తాము పూజ ఏమి చేయించకుండానే ఇందులోకి హడావిడిగా దిగారు ఇందులో ఏదైనా శక్తి గాని ఏదైనా దయ్యంగానీ ఉందంటారా అని అనుకుంటూ ఆలోచనలతో రాత్రి సరిగగా నిద్రపోలేదు ఇక తెల్లవారి నుంచి ఏ గదిలోకి వెళ్లి చూసినా ఆ అనుమానం పెనుభూతమై తన మనసును తొలిచేస్తూ ఉంది.

ఈ విషయం మర్నాడు పెద్దోడితో మాట్లాడాలని అనుకుంది కానీ పెద్దోడు పని ఉండడంవల్ల తొందరగా వెళ్ళిపోయాడు. తను ఇంట్లో ఒక్కతే ఉండడంతో తనకేమి చేయాలో పాలుపోలేదు తను కూడా లోలోపల భయపడుతూ ఉంది.

ఎంతైనా అనుమానం అనేది మనిషికి మొదలు కాకూడదు మొదలైతే అది తీరేవరకు ఆ భయం అలాగే కొనసాగుతుంది. ఇక పెద్దోడు వచ్చేసరికి చాలా ఆలస్యం అవ్వడంతో ఆరోజు కూడా ఏమీ మాట్లాడకుండానే తిని పడుకున్నారు కానీ మళ్ళీ ఓ రాత్రి అమ్మగారు బాత్రూంకి లేచి వెళ్లేసరికి మళ్ళీ అలాగే తెల్లగా కనిపించింది.

వెంటనే మెల్లిగా పెద్దోడిని నిద్రలేపి చిన్నోడికి వినిపించకుండా అరే నాని ఏమో తెల్లగా కనిపిస్తుంది రా నాకు భయం వేస్తోంది అంటూ అనడంతో పెద్దోడు వచ్చి ఏంటమ్మా ఎక్కడ కనిపించింది అంటూ ఇల్లంతా తిరిగి చూశారు ఇద్దరు కానీ ఎక్కడ ఏమీ లేదు.

అప్పుడు పెద్దోడు అమ్మ ఇదంతా నీ భ్రమ నిద్ర పట్టకపోతే నేను నీ దగ్గర వచ్చి నీ పక్కన పడుకుంటాలే అంతేకానీ నువ్వేదో ఆలోచిస్తూ పడుకోకు అన్నీ అడ్డమైన ఆలోచనలు చేస్తావు అందుకే నీకు ఏదో అనిపిస్తుంది ప్రశాంతంగా నిద్రపో అంటూ సర్ది చెప్పి తల్లిని సముదాయించాడు.

అమ్మ పడుకుందన్నమాట కానీ నిద్ర పట్టడం లేదు ఏమై ఉంటుంది అది తన భ్రమ అంటున్నాడు కానీ తన భ్రమైతే ఒకరోజు కనిపిస్తుంది రెండో రోజు ఈ రోజు ఎందుకు కనిపిస్తుంది అనుకుంటూ ఇంకా వేరే వేరే ఆలోచనలు చేయడం మొదలుపెట్టింది దానివల్ల తెల్లారేసరికి నిద్ర లేదు కళ్ళన్నీ ఎర్రగా అయ్యాయి సరిగ్గా పని చేయలేకపోయింది.

ఎవరిని అడగాలో తెలియలేదు ఎవరిని అడిగినా కూడా బాగుండదు ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉంటున్నారు చుట్టుపక్కల చిన్న చిన్న పిల్లల్ని పెంచుకుంటున్న వాళ్ళు కూడా ఉంటున్నారు వాళ్లకి లేని వాళ్ళకి కలగని అనుభూతి తనకు మాత్రమే ఎందుకు కలుగుతుంది? చిన్నపిల్లలు ఉన్నవాళ్లు పైన ఒక పెంట్ హౌస్ లాంటి దాంట్లో ఉంటారు వాళ్ళ చిన్న చిన్న పిల్లలతో ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నారట.

ఏదైనా ఉంటే పిల్లలకు తొందరగా కనిపిస్తుంది కదా మరి వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు వాళ్లకి కనిపించలేదా వెళ్లి వాళ్ళని అడగాలని అనుకుంది కానీ అడిగితే ఏమనుకుంటారో అనే సంశయంతో ఊరుకోండి పోయింది.

దేవుడు ఉన్నప్పుడు దయ్యాలు కూడా ఉంటాయని నమ్మే అమ్మకు ఆలోచనలతో అసలు ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్దాం అన్నా కూడా వెళ్లలేని పరిస్థితి మొన్ననే వచ్చారు ఇప్పుడే ఖాళీ అంటే చాలా కష్టం. మళ్లీ ఆఫీసులు అందరికీ దగ్గరగానే ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో తోచాక దీన్ని ఎలాగైనా పరిష్కరించాలని అనుకుంది.

అటు ఆఫీస్ కి వెళ్ళిన పెద్దోడు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు అమ్మ గత రెండు రోజులుగా సరిగ్గా నిద్రపోవడం లేదు ఏదో కనిపిస్తుంది అని అంటుంది నిజంగా తాను ఏమీ తెలుసుకోకుండా ఇంట్లోకి దిగాడ అన్నీ బాగున్నాయని అనుకున్నాడు కానీ వెనక ముందు ఏమీ ఆలోచించలేదు అయినా ఈ పట్నంలో అంత మంచి ఇల్లు దొరకడమే గగనం మూడు నెలలు తిరిగితే తనకి ఇప్పుడు ఆ ఇల్లు దొరకడం తను ఎంత కష్టపడ్డాడు అనేది తనకి తెలుసు.

ఇప్పుడు అమ్మ ఆ ఇంట్లో ఏదో ఉంది అంటుంది అనుమానంతో ఉండడం కన్నా ఖాళీ చేస్తే మంచిదేమో మరో ఇల్లు వెతకాలి అని అనుకుంటూ తన ఫోన్ తీసి ఇల్లు చూసే బ్రోకర్ కి మెసేజ్ పెట్టాడు. మెసేజ్ అయితే పెట్టాడు కానీ ఆ ఇల్లును వదులుకోవడానికి పెద్దోనికి మనసు రాలేదు ఎందుకంటే అందరికీ కంఫర్ట్ గా ఉంది పెద్ద ఇల్లు అందరం ఇరుకు గదుల్లో లేకుండా ఫ్రీగా ఉండొచ్చు ఆఫీసులు కూడా అందరికీ దగ్గరగానే ఉన్నాయి.

ఒకవేళ ఉద్యోగాలు వెతుక్కోవాలనుకున్నా ఎక్కువ శాలరీ ఇచ్చే ఏరియా కాబట్టి ఆ ఏరియాలను వదిలి వెళ్తే మళ్లీ ఇంకెక్కడ ఇలాంటి ఇల్లు దొరకదు అని లోపల ఉన్న అమ్మ భయపడుతోంది అనే ఒక్క కారణంతో మెసేజ్ అయితే పెట్టాడు అయితే పెద్దోడు అదేంటో ఈ రాత్రి కనిపెట్టాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు.

రాత్రి అయింది అందరూ భోజనాలు చేశారు అమ్మ గిన్నెలన్నీ కడిగేసి వచ్చి పడుకుంది కానీ పెద్దోడికి నిద్ర పట్టడం లేదు అదేంటో తెలుసుకోవాలని తన మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు ఎప్పుడెప్పుడు అమ్మ బాత్రూంకి లేస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. అలాగే అందరూ నిద్ర పోయిన తర్వాత ఒకసారి లేచి ఇల్లంతా కలియ తిరిగాడు. తనకేమీ అనిపించలేదు.

తనకు ఏమీ కనిపించలేనిది అమ్మకు మాత్రమే ఎందుకు అనిపిస్తుంది అమ్మకి కనిపించేలా ఇంకా ఏదైనా ఉందా? అయినా ఈ కాంక్రీట్ జంగల్ లో ఇలాంటివి కూడా ఉంటాయా స్మశానంలో ఇల్లు కట్టుకొని చిన్న చిన్న పిల్లలతో ఉంటున్న వారిని తాను చూశాడు స్మశానంలో ఉన్న వారిని ఏమీ చేయలేని దయ్యాలు ఇక్కడ ఈ నగరం నడిబొడ్డులో ఉన్న ఇంట్లో ఉంటాయంటే తనకి నమ్మశక్యం అవడం లేదు కానీ అమ్మ చెప్తోంది కాబట్టి అదేంటో కనిపెట్టాలని ఇల్లంతా తిరుగుతూ ఉన్నాడు ఇంతలో అమ్మ మళ్లీ బాత్రూం కంటూ నిద్రలేచింది.

పెద్దోడు సిద్ధంగా ఉన్నాడు అమ్మ మళ్ళీ దేనిని చూస్తుందో అనుకుంటూ నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడు ఇంతలో అమ్మ మెల్లిగా లేచి చుట్టూ చూసింది మళ్ళీ తెల్లగా ఏమో కనిపించింది అమ్మ తనవైపు రావడం చూసి ఏంటమ్మా అంటూ చెటుక్కున లేచి కూర్చున్నాడు పెద్దోడు అదిగోరా మళ్ళీ తెల్లగా ఉంది అని అనగానే ఈసారి లైట్ వేయకుండా మెల్లిగా ఎక్కడమ్మా ఎక్కడ అనగానే అదిగో అక్కడ అంటూ గోడ వైపు చూపించింది.

పెద్దోడు అలాగే గోడ వైపుకు వెళ్లి అక్కడ చూసేసరికి తన చేతులకు ఏదో తగిలింది ఒక్కసారిగా శరీరం. నిజంగానే తాను దెయ్యాన్ని పట్టుకున్నాడా గోడలో దయ్యం ఉందా మనల్ని ఇదేమైనా చేస్తుందా అని అనుకుంటూ చిన్నోడిని పిలిచాడు. రెండో పిలుపుకే మేల్కొన్న చిన్నోడు అన్న గోడ వైపుగా ఉండడం చూసి ఏంటి ఏమైంది అంటూ అడిగాడు ఏమి అవ్వలేదు రా నువ్వు లైట్ వేయి అంటూ పెద్దోడు అనేసరికి చిన్నోడు వెళ్లి లైట్ వేశాడు. పెద్దోడు తన చేతుల వైపు చూసుకున్నాడు. అమ్మ కూడా పెద్దోడు పట్టుకున్న దాన్ని చూసింది చిన్నోడు కూడా చూశాడు.

ఆ వెంటనే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని గట్టిగా నవ్వుకున్నారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు అంతలోనే ఆపండి అర్ధరాత్రి నవ్వితే మనల్ని పిచ్చోలనుకునే ప్రమాదం ఉంది అంటూ పెద్దోడు గోడలు గోడకు ఉన్న తెల్ల తువ్వాల తీసి చేతిలో పట్టుకుంటూ ఇదిగో అమ్మ నీ తెల్ల దయ్యం అంటూ అమ్మ చేతిలో పెట్టాడు.

ఇన్ని రోజులు తమకు నిద్ర లేకుండా చేసి ఎన్నో ఆలోచనలతో తమ నిద్రంతా పాడుచేసింది ఇదా అనుకుంటూ నవ్వుకుంటూనే ముగ్గురూ నిద్రపోయారు. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే అమ్మ రాత్రికి గిన్నెలు కడిగాక తను వంటగదిలో పెట్టుకునే తెల్లని తువ్వాలతో చేతుల్ని తుడుచుకుంటూ వచ్చి అక్కడ గోడకు ఉన్న చిన్న మూలకు వేసేది. నిద్రపోయిన తర్వాత మళ్లీ బాత్రూంకి లేచినప్పుడు అదేదో తెల్లగా కనిపించేసరికి చీకట్లో అదేదో తెల్లగా కనిపించేసరికి అమ్మ భయపడి పెద్దోడిని చిన్నోడిని కూడా భయపెట్టింది.

ఒక్కొక్కసారి మన చిన్న చిన్న అనుమానాలే పెనుభూతాలై మనల్ని దహిస్తుంటాయి. ఈ విషయం వినడానికి చిన్నగానే ఉన్నా ఒక్కొక్కసారి ప్రాణం కూడా పోవచ్చు. కాబట్టి అనుమానాలు లేకుండా హాయిగా సంతోషంగా ఉండడం జీవించడమే మనుషులకు రావాలి అదే ఈ కథ ప్రధాన ఉద్దేశం.

– భవ్య చారు

నిను చేరని నా లేఖ.! Previous post నిను చేరని నా లేఖ.!
ముసుగు Next post ముసుగు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *