అన్వేష్ – కథానిక

అన్వేష్ – కథానిక

నేనో ఫ్యాన్సీ షాపులో మొదలుపెట్టి దానికి అటాచ్డ్ గా కాఫీషాపు తెరిచి కొత్త ఆలోచనకు పునాదివేశాను. నా ప్రయోగంఫలించి మరికొంతమందికి ఆ ఆలోచన వచ్చింది.. నా భుజం నేను తట్టుకున్నాను.

నిజం చెప్పాలంటే నా భార్య ఐడియా అది. కానీ తను నా అంత చదువుకోలేదు కాబట్టి అది నాదిగా చెలామణి అయింది. కాదు చేశాను.

ఆలోచన వేరు, దాని అమలు వేరు అని సమాధాన పరుచుకున్నాను. నేను క్రెడిట్ ఇవ్వలేదని తనూ అడగదని తెలుసు.

అలా నా అంత బాగా వ్యాపారం మరొకరు చేయలేరని విర్రవీగుతున్న సమయంలో కొవిడ్ వచ్చి అందరిలాగే నన్నూ అతలాకుతలం చేసేసింది. లాక్ డౌన్ లో వర్కర్స్ వెళ్ళిపోయారు.

మొదట్లో భయం వల్ల బిజినెస్ గురించి ఎక్కువ ఆలోచించలేదు. నెమ్మదిగా దాచుకున్న డబ్బంతా కరిగిపోవటం మొదలయ్యాక ఏంచేయాలో అర్థం కాలేదు.

నా భార్యేమయినా చెప్పబోయినా విసుక్కునేవాడిని. పిల్లల గురించి బెంగా మొదలయింది. అంతా బావున్నప్పుడు వికసించిన ఆలోచనల కొలను ఇప్పుడు ఎండిపోయింది.

మగవాళ్ళలా ఆడవారు కంగారు పడరు కాబట్టి తనకి నా అంత భయం ఎప్పుడూ లేదు. నెమ్మదిగా లాక్డౌన్ సడలలింపులు మొదలయ్యాయి.

మళ్లీ బిజినెస్ పుంజుకుంటుందనుకున్నా కానీ అలా జరగలేదు. మనసంతా మొద్దుబారుతుంటే బయటకొచ్చి పిచ్చివాడిలా నడుస్తుంటే నా పక్కనొక ఆటో ఆగింది.

“అంకుల్ అందర్ ఆజావ్” పిలిచాడు ఆటో కుర్రాడు.
‘అక్కర్లేదు’ విసుగ్గా అన్నాను.
“అరె రండి సార్” ఈసారి ఆకుర్రాడి పిలుపుకు తట్టుకోలేక ఆటో ఎక్కాల్సి వచ్చింది.
“ఎందుకు నా వెంటపడ్డావు”
“అదేంది సార్, అందరినీ కోవిడ్ నాశనం చేసి పడేసింది. మీరూ అదే కేసనిపించింది.” ఆ కుర్రాడి అబ్జర్వేషన్ ఆశ్చర్యమనిపించింది.

“నువ్వేం చేస్తుంటావు” అసందర్భమైన ప్రశ్న వేశాను.

“ఈ ఆటో మా నాయనిది సర్. ఆయన కొవిడ్ తోటి పోయిండు. ఇల్లెట్ల నడవాలి? నేను తోలుడు మొదలెట్టిన. పదిగంటల నుంచి సాయంత్రం మూడువరకు మెడికల్ షాపులో జేస్తా….

మళ్ళీ రాత్రి తొమ్మిది వరకూ ఆటో నడిపిస్తా. పొద్దుగాల గంటసేపు పాలపేకెట్లు వేస్తా.. ఇంతే సర్ రోజంతా పురసత్తే లేదు.”

“నీకొచ్చేది సరిపోతుందా” పిచ్చి ప్రశ్నొకటి వేశాను. ఆ కుర్రాడు నవ్వాడు.
“అంకుల్ ఎంతొస్తే అంతే. దాంతోటి సరిపెట్టుకోవాలి.”
“నీకు భవిష్యత్తు భయం లేదా”
“నాకు రేపు కాదంకుల్. ఇవ్వాళ ముఖ్యం.” ఆ కుర్రాడి ధైర్యం ఆశ్చర్యపరిచింది. మళ్ళీ ఆ కుర్రాడే అన్నాడు.

“మీరు ఫ్యాన్సీషాపు, కాఫీ షాపు నడిపే వారుకదా అంకుల్. బాగా నడిచినప్పుడు బానే ఉన్నారు. మా బ్యాచ్ అంతా మీ కాఫీ షాప్ లో కూచునేవాళ్ళం.

మీరు మంచి హుషారుగా ఉండేవారు. ఇప్పుడేంటి అంకుల్ ఇలా అయిపోయారు. మీరు నాకు తెలుసు. అందుకే నా ఆటో ఆపి రమ్మన్నాను.

అంకుల్ మళ్ళీ మొదలెట్టండి.. కానీ పోష్ గా కాదు. చిన్న చాయ్ అడ్డా చేయండి. మీరెందుకు క్లిక్ కారో చూద్దాం..”

నాకు తలతిరిగిపోయింది. ఇలాంటి ప్రయత్నం చేయమని నా భార్య చెప్పబోతే నిరాకరించాను. ఇప్పుడు ఈ కుర్రాడు ఎంతో వివరంగా చెప్పాడు. ఎండిపోయిన ఆలోచనల కొలనుని కాస్త ధైర్యం నీటితో తడిపాడు..

ఉత్సాహం నెమ్మదిగా తొంగిచూడసాగింది..

“బాబు నీ పేరేమిటో తెలీదు. కానీ కాస్త ఊపిరిపోశావు.” నమస్కారం చెయ్యబోయాను.వారించాడా కుర్రాడు.

“మీరు చాయ్ అడ్డా షురూ చేయండి. మా దోస్తులందరినీ తీసుకొస్తా. బోణీ చాయ్ మాదే అంకుల్ దిగండి. మీ షాప్ కొచ్చేశాం.”

“బాబూ నీ పేరు..”

“పేరెందుకు అంకుల్.. అయినా చెబుతాను.. అన్వేష్” అన్వేష్..విన్నపేరే..

ఇప్పుడు గుర్తుకొచ్చింది.. ఎక్కువ సేపు కూర్చుని టైంపాస్ చేస్తుండేవాడు. ఒకరోజు అతని పేరు అడిగి అన్వేష్ అని తెలుసుకుని వెటకారంగా మాట్లాడాను.. నీ అన్వేషణ బయట చెయ్ బాబు.ఇక్కడ చేసి మా టైమ్, ప్లస్ స్పేస్ వేస్ట్ చేయకు అని..

అవేమీ గుర్తుపెట్టుకోకుండా నా జీవితాన్ని అన్వేషించి వెలుగు పరిచాడు.. సిగ్గుతో తలొంచుకుంటుంటే

“నా ఫస్ట్ చాయ్ కి ఐదొందలు ఉంచండంకుల్..” మళ్ళీ కలుస్తానంటూ ఆటో స్టార్ట్ చేశాడు.

దైవం ఎక్కడో ఉండడు. మనిషిగా వచ్చి పలకరించి వెళ్ళిపోతాడని మనసులో కృతజ్ఞతలు చెప్పుకున్నాను.. అన్వేష్ లాంటి వారు పలుకులు చేతలు బంగారమై ఇతరుల బతుకులకు తోడవుతాయని ఆ క్షణాన అర్థమయింది.

– సి.యస్.రాంబాబు

Previous post పలుకే బంగారమాయే…
Next post అగ్ని సాక్షిగా!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *