అన్వేషణ ఎపిసోడ్ 2

అన్వేషణ ఎపిసోడ్ 2

అన్వేషణ ఎపిసోడ్ 2

ఒకపక్క మొదటి జరిగిన హత్య కేసు కోర్టులో విచారణలో వుండగానే, వరుసగా జరుగుతున్న ఈ హత్యలు నివారించడం పోలీసు వారి వల్ల కాకపోవడం, ప్రజా వ్యతిరేకత కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ హత్య కేసులన్నీ చేధించడానికి కోర్టు, చివరికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని నియమించింది.

ఆరుగురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ బృందానికి సారథ్యం వహిస్తున్నాయన పేరు ఏసిపి రంజిత్ కుమార్. కేసుని టేక్అప్ తీసుకున్న అతి కొద్ది సమయంలోనే ఏసిపి రంజిత్ కుమార్ సారథ్యంలో గల ఆ సీఐడీ టీమ్ ముమ్మరైన దర్యాప్తు చేపట్టింది. కేసులను మరింత లోతుగా విశ్లేషిస్తూ ఆ హంతకుడిని పట్టుకోవడానికి ప్రణాలికలు రచించడంలో నిమగ్నమైంది ఆ బృందం.

మరొక ప్రక్క ఆ మూడు హత్య కేసులలో దొరికిన ఒకే ఒక్క క్లూ (సత్య అని రాసున్న కాగితం)ని కూడా ఆ సీఐడీ వాళ్ళు నమ్మలేక పోయారు.

కారణం, హంతకుడు ఆ క్లూ పేరుతో కేసుని తప్పుదోవ పట్టిస్తున్నాడేమోనని వాళ్ళు భావించారు. హత్య చేయబడ్డ ఆ ముగ్గురు ఇళ్లకు వెళ్లి సోదాలు నిర్వహిస్తున్నారు. వాళ్ల ముగ్గురికి ఒకరికొకరి మధ్య సంబంధాలు కానీ, బంధుత్వాలు కానీ ఏమైనా వున్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేశారు.

కేసులకు సంబంధించి దొరికిన ఏ చిన్న ఆధారాన్ని కూడా వాళ్ళు విడిచిపెట్టడం లేదు. మృతురాల్ల తల వెంట్రుకల దగ్గర నుండి కాలిగోల్ల వరకు ప్రతిదీ పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేసారు. ఇల్లు, వాకిలి, ఆఫీస్, చుట్టు పక్కలనున్న ప్రదేశాలు అంతా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. చివరికి డెడ్బాడిలని రీపోస్ట్మార్టం చేసినా కేసులో పురోగతి లభించలేదు.

ఇంత దారుణంగా వాళ్ళను హతమార్చడం చూస్తుంటే, ఈ హత్య ఒక్కడే చేసినట్టు ఏసిపి రంజిత్ బృందానికి అనిపించడం లేదు. దీనివెనుక మరికొంత మంది హస్తం కూడా ఉన్నట్టు వాళ్ళు భావించారు.

**********

ఈ తరుణంలోనే ఏసిపి రంజిత్ ఓ రోజు తన డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు తన భార్య, పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లడంతో ఒంటరిగా తానొక్కడే ఉన్నాడాయింట్లో, ఇంట్లో పనివాళ్ళు కూడా రాత్రి కావడంతో పని ముగించుకుని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు.

ఆ హత్య కేసుల గురించి పదే పదే ఆలోచిస్తూ కలవరపడడంతో ఆ రాత్రి నిద్ర పట్టడం లేదు ఏసిపి రంజిత్ కి. ఆ డిస్టర్బ్ మైండ్ నుండి బయట పడడానికి, కొంచెం ప్రశాంతత కోసం తన గెస్ట్ హౌస్ కి బయలుదేరి వెళ్ళాడు.

ఆ ఊరికి చివర్లోనున్న అతని గెస్ట్ హౌజ్, ఓ పాడుపడిన బంగ్లాలా ఉంటుంది. మధ్యలోనున్న ఒక స్మశానాన్ని దాటుకుని వెళ్ళాలి ఆ గెస్ట్ హౌజ్ కి. చుట్టూ ఎటుచూసినా అంతా నిర్మానుష్యమే.

రంజిత్ ఫ్రెషయ్యి, విస్కీ తాగుతూ, సిగేరెట్ కాల్చుతూ, సోఫాలో సేదతీరుతూ టీవీలో న్యూస్ చూస్తున్నాడు. ఏ న్యూస్ ఛానల్ చూసిన అంతా ఈ మధ్య నగరంలో జరుగుతున్న ఆ మూడు హత్యల గురించే బ్రేకింగ్ న్యూస్ లు, హాట్ టాపిక్లు, చర్చలు, సమీక్షలు.

***********

అర్ధరాత్రి పన్నెండు గంటలు కావస్తోంది. ఇంతలో బయట హోరున వర్షం మొదలయ్యింది. సడెన్ గా కరెంట్ కూడా పోయింది. ఒక్కసారిగా చుట్టూ అంతా చిమ్మ చీకటి అలుముకుంది. గాలికి తలుపులు వాటి గుమ్మానికేసి కొట్టుకుంటూ అటు ఇటు ఊగుతూ

“టపా…” “టపా…” “టపా…” “టపా…”

మని భీకర శబ్దాలు చేస్తున్నాయి. దానికి తోడు… ఆకాశంలో చప్పుడు చేస్తున్న ఉరుములు, పక్కన స్మశానంలో నక్కల అరుపులు, ఇంటి పై కప్పు పైన తీతువు పిట్టల కవ్వింపులు. కానీ, అవన్నీ అతనిలో భయాన్ని అయితే కలిగించడం లేదు. ఎంతైనా సీఐడీ ఆఫీసర్ కదా..

అసలే చిరాకుతో ఉన్న ఆయన… తన చేతిలోనున్న సిగెరెట్ ఆర్పీ, పక్కనున్న టార్చ్ లైట్ ఆన్ చేసి, గాలికి కొట్టుకుంటున్న ఆ తలుపులు దగ్గరకి మూసి, అప్పటికే బాగా అలసిపోయి ఉండడంతో దుప్పట్టి ముసుగులో విశ్రమించడానికి సిద్ధపడ్డాడు.

కాసేపటికి వేసిన తలుపు మెల్లగా తెరుచుకోవడం మొదలయింది. బయట నుండి హోరుగాలుల శబ్ధం మళ్ళీ తన చెవులను తాకుతున్నాయి. కప్పుకున్న దుప్పటి కూడా ఎవరో లాగుతున్నట్టు ఆయన పైనుండి మెల్లగా జారుకుంటుంటుంది. ఆయన ఒక్కసారిగా ఉలిక్కి పడి పైకి లేచి చూసే సరికి, వెలుగుతున్న టార్చ్ లైట్ సడెన్ గా ఆఫయ్యి ఉంది. చుట్టూ మరలా అంధకారమే ఆవహించింది.

“ట్రూయ్ ..!”

“ట్రూయ్..!”

“ట్రూయ్..!”

అంటూ అప్పటికే తను వేసిన మెయిన్ డోర్ మళ్ళీ తెరుచుకుంటన్న శబ్ధం కూడా తన చెవులకి మెల్లగా చేరుతూనే ఉంది.

అరేయ్ ..! ఇప్పుడే కదా డోర్ క్లోజ్ చేశాను మళ్ళీ ఎలా తెరుచుకుంది. తాగిన మైకంలో సరిగా వేసుండనులే, అని తన మనసులో తానే అనుకుంటూ మళ్ళీ ఆ డోర్ దగ్గరికి వెళ్లి ఆ డోర్ క్లోజ్ చేయబోతుండగా..

హఠాత్తుగా..

“సామీ…………..! “

(వృద్ధాప్య ఛాయలతో నల్లని ఏముకుల గూడు లాంటి దేహరాడుధ్యం కలిగి, చింపిరి జుట్టు, మెళ్ళ కన్ను, ఎత్తు పళ్లు, కుంటికాలితో ఓ చేత కర్రబట్టి, మరొక వైపు భుజాన సంచి తగిలించి, మాసిన గుడ్డలు ధరించి చూడడానికి భయం రేకెత్తించేలానున్న ఓ వ్యక్తి గుమ్మం దగ్గర నిల్చుని)

లోపలికి రావొచ్చా..! “

అంటూ భీకరమైన స్వరంతో ఏసిపి రంజిత్ ని అడుగుతాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి హడలిన ఆయన!

హేయ్..! ఎవరు నువ్వు..?

ఈ టైం లో నీకిక్కడేం పని అంటూ అతనిని ఎదురు ప్రశ్నిస్తాడు.

“సెప్తా సామీ, నీ అవసరము తీర్శడానికి, నీకొన్ని జాగ్రత్తలు సెప్పడానికే వచ్చాలే! రాను.. రాను.. పోను.. పోను.. నీకే అర్థమౌతుందిలే”

అంటూ వెకిలిగా నవ్వుతాడు.

హేయ్ ఏంటి..! వేళ కాని వేళ వచ్చి, పిచ్చి పిచ్చిగా వాగుతున్నవ్… ? అసలు ఎవడ్రా నువు… ?

నేనెవరో తెలుసా… ఈ ఇల్లు ఎవరిదో తెలుసుకునే వచ్చావా..?

అంటూ అసలే చిరాకులో ఉన్న ఏసిపి రంజిత్ అతని మాటలకు మరింత చిరాకు పడుతూ తిడతాడు ఆ వృద్ధుడిని.

“ఎవరైతేనేమ్, ఎంత భోగమనుభవిస్తెనేమి సామీ, ఎవరైనా, ఎప్పటికైనా ఆ మట్టిలోనే కదా కలిసేది, ఆరడుగుల గోతిలోనే కదా సేరేది! అయినా నాకంతా తెలుసులే సామీ, నువ్వా ఆ మర్డర్ కేసుల ఇసయంలో బాగా కంగారడుతున్నట్టున్నావ్. “

ఏంటి..! (అంటూ ఆ మర్డర్ కేసుల గురించి ఈ ముసలాడికెలా తెలిసుంటుందా అని ఆశ్చర్యపోతూ అతని వంక చూసాడు రంజిత్.)

“ముందు నన్ను లోపలికి రానియ్యి సామీ, బయట ఇప్పటికే వానకి తడిసి తడిసి ముద్దయ్యాను. అసలే సలికి వణుకు ఎడుతుందని” ఆ వృద్ధుడు అనడంతో

“సరే రా..!” అంటూ లోపలికి తీసుకెళ్ళాడు రంజిత్ (ఆ ముసలాయన, కేసుల గురించి తనకి తెలిసినట్టు చెప్పడంతో ఒకింత ఎదైనా బలమైన ఆధారమేమైనా దొరుకుతుందని ఆశించి)

ఇప్పుడు చెప్పవయ్యా..! అసలు ఎవరు నువ్వు, చూస్తుంటే భిక్షగాడిలా ఉన్నావ్, ఆ హత్యల గురించి నీకేం తెలుసు. అంటూ అతనిని ప్రశ్నిస్తాడు రంజిత్.

“సెప్తానుండు సామీ, తొందరపాటు అన్నింటికీ సేటే, అంత మంచిది కాదు. కాసేపు సేదతీరనివ్వు, ఆ.. కొంచెం ఆకలిగా ఉంది. ఇంట్లో మిగిలున్న అన్నం ఏమైనా ఉంటే కాసింత ఎట్టి పున్నెం కట్టుకో సామీ. ఈ… నా అవతారం సూసి ఇందాక ఏమన్నావు బిచ్చగాడా, ఇలా కూడు కోసం అడుగుతున్నానని నీ అనుమానం ఇంకా బలపడే ఉండాలే! హ్హ..! హ్హా..! పొరపాటు పడకయ్యో..!

నేనేమీ బిచ్చగాడిని కాదోయ్యో!! ఒకప్పుడు బాగా బతికినోడినే… కొంతమంది సేసిన దుర్మార్గాలకు , ఇంకొంత మంది సేసిన తప్పిదాలకు, కాలం చేసిన పొరపాట్లకు, మందిని, ఉన్నది పోగొట్టుకుని ఇలా ఒంటరోడిగా మిగిలిపోయాను.”

అసలే కేసు విషయంలో అప్పటికే బాగా టెన్షన్ లోనున్న రంజిత్ కి అతని సూటి పోటీ వంకర మాటలు చిర్రెత్తుకొస్తున్నాయి. అయినా తన దగ్గర ఎలాగైనా ఆ కేసు కి సంబంధించిన విషయాలు రాబట్టాలని నిగ్రహంతో ఓపిక పడుతూ.. అతను చెప్పింది వింటూ, తన ఆకలి తీర్చాడు.

ఇదిగో పెద్దాయన ఏ ఊరు నీది, అసలు ఇక్కడికెలా వచ్చావు. ఈ చుట్టూ పక్కల నీ బంధువులెవరైనా ఉన్నారా..?

“నాకంటూ ఊరు, పేరు లేదు సామీ, బతికున్న ఆళ్ళెవరూ నా వోళ్లు కారు కానీ, సనిపోయాక అందరూ నా వోల్లే…”

ఏంటి …? అతని మాటలకు ఆశ్చర్యపోతూ నోరెళ్ళబెట్టి తన వైపు చూసాడు రంజిత్.

“హ్హ..! హ్హా..! “

అంటూ బిగ్గరగా నవ్వాడు ఆ ముసలాయన.

ఏంటయ్యా నేనొకటి అడిగితే నువ్వెంకేదో చెప్తూ అలా పిచ్చి వాడిలా నవ్వుతావు.. అంటూ చిరాకు పడతాడు రంజిత్.

“అదేం లేదు సామీ, మీ మెదడుకు పదును, మీరొక సీఐడీ ఆఫీసర్ అయ్యిండి కూడా దాన్ని విప్పలేకపోయారు. అంటూ పగలబడి మళ్ళీ నవ్వుతాడు” అతను.

ఏంటి..? అంటూ కోపం గా కళ్ళేర్రజేసి చూసాడు రంజిత్ అతని వంక.

“అదే సామీ! ఆ పక్కనే ఉన్న ససానం నా ఇల్లు, అక్కడుండే శవాలు నా బంధువులు పరోచ్చంగా నేనొక కాటి కాపరని సెప్తున్నానయ్యా..” అంటూ ముసి ముసిగా నవ్వుతాడు ఆ వృద్ధుడు.

దీంతో ” ప్చ్..! ” అంటూ ఊపిరిపీల్చుకున్న రంజిత్.. 

ఇక చాల్లే ఆపు నీ వెకిలి నవ్వు , వేషాలు అంటూ అతడిని గదుముతాడు ఏసిపి రంజిత్.

ఇక తినడం కూడా పూర్తయ్యింది ఆ వృద్ధుడికి.

ఇప్పుడు చెప్పు అసలు ఆ కేసు గురించి నీకెలా తెలుసు, కేసుకు సంబంధించి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? నువ్వసలేం చెప్పాలని ఇక్కడికి నన్ను వెతుక్కుంటూ వచ్చావు?

అంటూ తన ప్రశ్నలతో అతనిని నిలదీస్తాడు రంజిత్.

మౌనంగానే, వణుకుతున్న చేతులతో తన కూడా తెచ్చుకున్న సంచిలోనున్న ఒక పుస్తకం తీసి, దానిని రంజిత్ చేతికి ఇచ్చి

“ఇందులో అన్ని ఇషయాలు ఉన్నాయి సామీ, పూర్తిగా సదువుకో అంటూ… అంతా నీకే అర్థమవుతుందిలే!” అంటూ బయటకి వెళ్లబోతుంటే,

ఎక్కడికి అని నిలదీస్తాడు రంజిత్ ఆ వృద్ధుడిని

“కొంచెం కడుపు ఉబ్బరంగా ఉంది సామీ, నేను కొంచెం అలా బయటకి పోయోస్తా..” అంటూ అక్కడినుండి బయటకి వెళ్లబోతుంటే,

ఎందుకు ఇక్కడే మా వాష్ రూం లోకి పో అంటాడు రంజిత్.

దానికి ఆ వృద్ధుడు

“మట్టిలోనే ఉట్టాం, మట్టిలోనే జీవనం సాగిస్తున్నోల్లం మాకీ ఇలాసపు సౌకర్యాలు అలవాటు లేదు సామీ” అంటూ నిరాకరిస్తాడు.

పిచ్చివాడిలా వాగుతున్న ఆ వృద్ధుడు ఎక్కడికి పోతాడులే అనుకుంటూ అతడిని కానీ, అతను చెప్పిన మాటలు కానీ పట్టించుకోక వాటిని పెడచెవిన పెడతాడు ఏసిపి రంజిత్. ఆ కేసుల గురించిన విషయాలు పుస్తకంలో ఉన్నాయేమోనన్న ఆతృతతో రంజిత్ ఆ పుస్తకాన్ని తన చేతిలోకి తీసుకుని అందులోనే నిమగ్నమైపోతాడు. ఇక ఆ వృద్ధుడు అక్కడ నుండి మెల్లగా బయటకి జారుకుంటాడు.

అసలు ఎవరతను?

రంజిత్ కి ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నాడు?

అతనికి ఆ హత్యలకు సంబంధమేమిటి?

అతనిచ్చిన పుస్తకంలో అసలేముంది?

ఆ పుస్తకం అందించిన తర్వాత అతడేమయ్యాడు?

లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే తర్వాతి భాగాలు తప్పక చదవండి.

– భరద్వాజ్

ఆశల తిమిరాలు.. Previous post ఆశల తిమిరాలు..
నిలకడ లేని మనుషులు Next post నిలకడ లేని మనుషులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *