"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

అన్వేషణ ఎపిసోడ్ 3

అన్వేషణ ఎపిసోడ్ 3

అలా తను ఆ పుస్తకం మొదటి పేజీ తీస్తుంటెనే తనకి అర్థమైంది అదొక డైరీ అని.

ఆ డైరీ లో ఇలా రాసి ఉంది…

“నా పేరు సత్య కుమార్, సత్య కిరణ్, సత్య కృష్ణ, సత్య కాంత్ అనే ముగ్గురు నా స్నేహితులు. ప్రాణ మిత్రులు కూడా… యాదృచ్చికమో ఏమో, అనాధలైన మా జీవితాలని ఆ బ్రహ్మ దేవుడు ఒకే పేజీలో రాసాడేమో అన్నట్టు మేమందరం ఒకే చోట (ఆ అనాధశ్రమంలోనే) పడ్డాం. మా పేర్లు కూడా ఇంచుమించు ఒకేలా ఉండేవి.

ఏ తోడు లేని మాకు ఒకరికొకరని తోడునందించింది ఆ అనాధశ్రమమే. ఊహ తెలిసిన దగ్గర నుండి, అందరం అక్కడే పెరిగాము. మా స్నేహ బంధం చూసి అన్నదమ్ముల బంధం కూడా దిగదుడుపే అన్నట్టనిపించేది అక్కడున్నవాళ్ళకి. తల్లిదండ్రులు, బంధువులు లేకపోయినా చదువుల్లోనే కాదు ఆటపాటల్లోనూ, సంస్కారోల్లోనూ మేము అందరికన్నా ముందు ఉండేవాళ్ళం. ఇక మా మధ్య మాత్రం ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీతత్వమే ఉండేది. ఆ పోటీతత్వం మా చెలిమి బంధం చూసి మెచ్చుకునే వారు కొందరైతే, ఓర్వలేక అసూయ పడేవాళ్ళు కొందరు. మేము మాత్రం అవేమీ పట్టించుకునే వాళ్ళం కాదు.

అందరం ఒకీడు వాళ్ళమే అయినా నెలల తేడాలో సత్య కిరణ్ మా ముగ్గురి కన్నా చిన్నవాడు. నేనేమో అందరికన్నా పెద్దవాడిని. చిన్నవాడైనా సత్య కిరణ్ చాలా చదువులో చురుకైన వాడు. చదువులో మా కన్న తనే ముందుండేవాడు. దాదాపు పన్నెండేళ్ళు కలిసే ఉన్నా, మా మధ్య ఏ చిన్న తగాదాకి తావు ఇచ్చే వాళ్ళం కాదు. కానీ, ఆ ఇంటర్మీడియేట్ పూర్తయ్యాకా ఎవరికి వాళ్ళు తమ తమ లక్ష్య సాధనకై ఏర్పరుచుకున్న ఉన్నత విద్యలతో దూరమవక తప్పలేదు.

సత్య కిరణ్ చదువులో చురుకైన వాడు కావడంతో, ఇంటర్లో మంచి ఉత్తీర్ణతతో మంచి మార్కులు సాధించడంతో పాటు ఇంజనీరిగ్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించడంతో ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావడం, తన చిరకాల స్వప్నం అయినటువంటి ఇంజనీరింగ్ సర్వీసెస్ కి దానినే ఓ పునాది గా భావించి మమ్మల్ని విడిచి వెళ్ళక తప్పలేదు వాడికి.

చదువులో ఎంత తెలివైన వాడైనా.. చాలా అమాయకుడు పాపం. వాడికి మేము, వాడి చదువు తప్ప ఇంకో లోకం తెలీదు. మా ముగ్గిరిలా పెద్దగా మాటకారి కూడా కాదు వాడు, కొంచెం మొహమాటి. పైగా పరాయి వాళ్ళతో మాట్లాడడానికి చాలా భయపడేవాడు, సిగ్గుపడేవాడు. అలాంటి వాడు బయటకి వెళ్ళి ఎలా బ్రతుకుతాడోననే మా దిగులు. వాడు మమ్మల్ని విడిచి వెళ్తుంటే చాలా బాధగా అనిపించింది. మా దగ్గరే అట్టిపెట్టుకుందామనుకున్నా వాడికున్న లక్ష్యాన్ని గౌరవించక తప్పలేదు. కనీసం ఈ రకంగానైనా వాడికి బయట పరిస్థితులు అర్థం అయ్యి, బ్రతకడం అలవాటవుతుందనే ఆలోచన మాకేర్పడింది.

మరొక పక్క సత్య కృష్ణ కూడా, ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ రావడంతో సివిల్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాడు. ఇక మిగిలిన వాళ్ళలో నేను, సత్య కాంత్ దగ్గర్లోనే ఒక డిగ్రీ కళాశాలలో చేరిపోయాము.

***********

దూరంగా ఉంటున్నా, వాళ్ళు సెలవలకు అప్పుడప్పుడు మా దగ్గరకి వచ్చేవాళ్ళు. నేను, సత్య కాంత్, సత్య కృష్ణ తరుచూ కలుస్తుండేవాల్లం. సత్య కిరణ్ మాత్రం చాలా అరుదుగా వస్తుండేవాడు. మరి ఇంజనీరింగ్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవ్వడమంటే మామూలు విషయమా? పైగా వాడి కాలేజ్ కూడా మేము వాడిని తరుచుగా కలిసెంత దగ్గర కూడా కాదు. తన లక్ష్యానికి ఆటంకాలు ఏర్పడతాయని సదుద్దేస్యంతో, మేము కూడా వాడిని కలవాలని పెద్దగా ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు.

చివరికి, మాకు (నాకు, సత్య కాంత్) డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. చదువు పూర్తయిన వెంటనే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో నేనొక అకౌంటెంట్ గా స్థిరపడ్డాను. సత్య కాంత్ కి మాత్రం ఇండియన్ ఆర్మీ లో చేరి దేశానికి సేవ చేయాలని కాంక్ష ఉండేది. ఏదోక ఉద్యోగం చూసుకోకుండా దాని కోసమే వాడు నిరంతరంగా పరితపించేవాడు, అంతకుమించి శ్రమించేవాడు.

మరొక ప్రక్క సత్య కృష్ణ, సత్య కిరణ్ ఇద్దరూ కూడా ఇంజనీరింగ్ చివరి సంవత్సరానికి వచ్చేశారు. క్లాసులు ఏం జరగడం లేదని సత్య కిరణ్ తరచూ మా దగ్గరకి వస్తుండేవాడు. ఏమి మాట్లాడకుండా అదోలా ఉండేవాడు. ఒకట్రెండు రోజులు మా దగ్గర ఉండి తర్వాత వెళ్ళిపోయేవాడు. ఏ చిన్న విషయాన్నైనా మా దగ్గర దాచకుండా చెప్పే వాడు, కానీ ఆ మధ్య ఎందుకో మా దగ్గర ఏదో దాస్తున్నట్టనిపించింది మాకు.

ఏమైందిరా అని అడిగితే

“ఏం లేదు..” అని పక్కకి వెళ్ళిపోయి, ఏదో పోగుట్టుకున్నవాడిలా ఏకాంతంగా కూర్చునేవాడు.

చివరికి ఏదోలా వాళ్ళిద్దరూ కూడా ఆ ఇంజనీరింగ్ కోర్సు కంప్లీట్ చేశారు. ఇద్దరికీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. సత్య కృష్ణ కి తన వృత్తి విద్యకు సంబంధించిన నిర్మాణ సంస్థలోనే మంచి జాబ్… సత్య కిరణ్ కి కూడా ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. తను ఆ జాబ్ లో జాయిన్ అవ్వబోతున్నట్టు చెప్తే, మేము ఆశ్చర్యానికి లోనయ్యాము. తన లక్ష్యం ఇంజనీరింగ్ సర్వీసెస్ కదా! అది వదిలేసి, మరిప్పుడు ఇందులో స్థిరపడతాను అంటాడెంటని.

తనకి మాత్రం ఇక చదివే ఓపిక లేదని, ఇందులోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నట్టు కరాఖండిగా చెప్పాడు.. డబ్బు గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడేమోనని, ఎలాగో నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి దాని గురించి “ఏమీ ఆలోచించకు నేను చూసుకుంటానని” ఎంత నచ్చచెప్పిన వినలేదు వాడు.

మరొక ప్రక్క చదువు పూర్తయిన సంవత్సరం తర్వాత, సత్య కాంత్ కి తను అనుకున్న కల నెరవేరింది. ఇండియన్ ఆర్మిలో మంచి ఉద్యోగం వచ్చింది. చివరికి అందరం మంచి మంచి ఉద్యోగాలలోనే స్థిరపడ్డాం. ఇదిలా ఉండగా, సత్య కాంత్ కి పెళ్లి కూడా అయిపోయింది. తను కూడా ఎవరూ లేని అమ్మాయేనని, ఆ అమ్మాయిది కూడా తన లాంటి ఒంటరి జీవితమేనని తనని ఆదర్శ వివాహం చేసుకున్నాడు.

ఇంకో పక్క సత్య కృష్ణకి కూడా ఒక మంచి అమ్మాయితో పెళ్లి కుదరబోతుంది. ఇక మిగిలింది నేను, సత్య కిరణ్ మాత్రమే. చీకట్లో మొదలయిన మా అందరి జీవితాలు వెలుగులు నిండి కొంచెం సాఫీగానే సాగుతున్నాయి.

**********

కొన్ని రోజుల తర్వాత సత్య కిరణ్ దగ్గర నుండి ఒక కాల్ వచ్చింది.

“అరేయ్ కొంచెం డబ్బులు ఏమైనా ఉంటే పంపించరా.. నీకు మళ్ళీ జీతం పడగానే ఇచ్చేస్తాను…” అని ఒకింత మొహమాటంగానే అడిగాడు.

ఒక పక్క జాబ్ చేస్తూనే వీడికి ఇంత సడెన్ గా డబ్బులవసరం ఏమొచ్చింది అబ్బా… అని నా మనసులో అనుకున్నాను. కానీ, అవన్నీ వాడిని అడగాలనిపించలేదు.

ఎంత రక్తం సంబంధం కాకపోయినా, చిన్నప్పటి నుండి నా కష్టసుఖాల్లో పాలుపంచుకున్న దేవుడిచ్చిన ఓ గొప్ప స్నేహ బంధం కదా మా మధ్యనున్నది, పైగా వాడు ఎప్పుడూ చెయ్యి చాచే మనిషి కాదు, ఏం అవసరం వచ్చి ఉంటుందోనని వాడికి ఎంత అవసరమో అంతా పంపించాను.

తర్వాత ఒక వారం రోజులకు సత్య కృష్ణ తో మాట్లాడుతుండగా మాటల మధ్యలో సత్య కిరణ్ తనవద్ద కూడా డబ్బులు తీసుకున్నట్టు చెప్పాడు, నెలలో ఇస్తాను అని చెప్పి రెండు మూడు నెలలు కావస్తోందని, కానీ వాడి దగ్గర నుండి రెస్పాండ్ అయితే లేదని చెప్పాడు. వెంటనే సత్య కాంత్ కి కాల్ చేశాను, వాడు కూడా అదే చెప్పాడు.

అసలు చాలా జాగ్రత్తగా ఉండేవాడు… ఎందుకు ఇంతలా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు.. వాడికి అంత అవసరం ఏమొచ్చింది. ఏదైనా వ్యాపారంలో పెట్టీ నష్టపోయాడా.. ఛ..! ఛ..!! మాకేది చెప్పకుండా వాడేం అలాంటివి చెయ్యడు కదా! అని అనుకుంటూ ఏం జరిగి ఉంటుందా అని మదిలో ఒకటే ఆలోచనలు.

ఏదైతే అదయ్యిందని ఒకసారి సత్య కిరణ్ కి కాల్ చేశాను. కానీ, ఎన్ని సార్లు కాల్ చేసిన తన దగ్గర నుండి రెస్పాండ్ లేదు. ఏమైంది వీడికసలు, ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక, సత్య కృష్ణ కి, సత్య కాంత్ కి కాల్ చేసి జరిగింది చెప్పాను. వాళ్ళు కూడా “మేము మాట్లాడతాము లే” అని నన్ను సముదాయించారు. కానీ, చివరికి వాళ్ళకి కూడా సత్య కిరణ్ దగ్గర నుండి రెస్పాన్స్ లభించలేదు. తన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పారు వాళ్ళు.

సత్య కిరణ్ కి ఏదో అయ్యిందనే భయం మాలో మొదలయ్యింది. వాడేదో సమస్యలో ఇరుకున్నట్టు మేము భావించాం. మాకు చెప్పకూడని అంత పెద్ద సమస్య వచ్చి పడిందా వాడికి అనుకున్నాం. ఆ సమస్య ఏంటోననీ వెతికే వేటలో పడ్డాము నేను, సత్య కృష్ణ. తను ఉంటున్న ఆఫీస్ కి వెళ్ళాము తన కోసం.

కానీ అక్కడ తను ఓ రెండ్రోజులుగా ఆఫీస్ కి రావడం లేదని తన సహోధ్యుగులు చెప్పారు. మాలో భయం పెరిగింది. హాస్టల్ కి వెళ్ళాము. అక్కడ కూడా రెండ్రోజుల నుండి కనిపించడం లేదని తోటి రూమ్మేట్స్ చెప్పారు. ఆ భయం మరింత పెరిగింది. ఆ రూంలో ఏదైనా చిన్న అధారమైనా దొరుకుతుందేమోనని.. ఆ గదంతా సెర్చ్ చేసాము. ఎంత సేపు వెతికినా ఏమీ కనిపించని మాకు చివరికి ఒక డైరీ అయితే దొరికింది. అది తనకు తానుగా తన గురించి రాసుకున్న దానిలా ఉంది.

తను ఏమయ్యాడో, ఇన్ని రోజులుగా తను ఎదుర్కొంటున్న పరిస్థితులకి ఆ డైరీ ఏమైనా సమాధానం చెప్తుందేమోననిపించింది. ఆ డైరీలో ఏమున్నా, దానిని అక్కడ అందరి ముందు చదవడం వల్ల, వాడిని వాల్లందరి ముందు చులకన చేసినట్టవుతుందని భావించి, ఆ డైరీ ని మా వెంట పెట్టుకొని మా కూడా తీసుకొచ్చేసాము.

అసలు సత్య కిరణ్ కి ఏమైంది?

తను కనిపించకుండా ఎక్కడికి వెళ్ళాడు?

అంత తెలివైన విద్యార్థి తన లక్ష్యాన్ని వదులుకోవడమేమిటి?

తను ఎదుర్కుంటున్న ఈ గడ్డు పరిస్థితులకి కారణమేమిటి?

అసలు ఆ డైరీ లో ఏముంది?

నా ఈ అన్వేషణ అనే కథలో ఈ అనుకొని అన్వేషణలేమిటి?

ఇవన్నీ ఆతృతగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తర్వాత భాగం అన్వేషణ-4 లో చూద్దాం ఏం జరుగబోతుందో…?

– భరద్వాజ్

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *