అన్వేషణ ఎపిసోడ్ 4

అన్వేషణ ఎపిసోడ్ 4

అలా నేను, సత్య కృష్ణ ఆ డైరీని ఇంటికి తీసుకొచ్చి, మొదటి పేజీ నుండి దానిని చదవడం ప్రారంభించాము. 

“ఎప్పుడూ నా స్నేహితుల దగ్గర ఏ విషయం దాచకుండా ప్రతీ విషయాన్ని వాళ్ళతో పంచుకునే నేను, తన గురించి విషయం దాచి చాలా పెద్ద తప్పు చేశాననిపిస్తుంది. కొన్ని కోట్ల కలలతో, లక్షల ఆశలతో IES అవ్వాలనే లక్ష్యంతో ఇంజనీరింగ్ లో చేరిన నాకు, ఎప్పటిలాగే నా చదువు, ఏకాగ్రతతో తప్ప మరే ధ్యాస లేకుండా సాగిపోతుంది. అప్పటికే రెండున్నరేళ్ల గడిచాయి. ఇంకొక సంవత్సరం ఇలాగే కష్టపడితే, రాబోయే అల్ ఇండియా గేట్ పరీక్షలో మంచి మార్కులు సాధించి, నా లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఉవ్విళ్లూరుతున్న రోజులవి.

అలా సాఫీగా సాగిపోతున్న నా జీవితంలోకి తను వచ్చింది. ఆ రోజు తెలియలేదు నాకు, తన స్వార్థానికి నా జీవితం నాశనమైపోతుందని.

తన పేరు సంధ్య. ఇంజనీరింగ్లో ఇద్దరం క్లాస్మేట్స్. అప్పటికే కాలేజ్ టాపరయిన నాతో, డౌట్స్ క్లారిఫికేషన్ అనే వంకతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించింది. ఎప్పుడూ… ఏ అమ్మాయి వంకైనా కన్నెత్తి కూడా చూడని నేను, తను నాతో చనువుగా మెలుగుతుండడంతో, నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది. అదే విషయం ఆమెకు పలుమార్లు చెప్పినా కూడా తను తేలికగా తీసుకునేది, పైగా ఇలాంటి పెద్ద పెద్ద కాలేజ్ లలో ఇవన్నీ సర్వసాధారణమని నాకు నచ్చచెప్పి, నన్ను కూడా అలాగే సరదాగా ఫీలవ్వమని చెప్పేది.

కానీ, నాకు మాత్రం అసలు ఆమెతో మాట్లాడడం కానీ, సన్నిహితంగా మెలగడం కానీ ఇష్టం లేక ఆమెను దూరం పెట్టేవాడిని. అలా రోజులు, నెలలు గడుస్తున్నాయి. అనుకోకుండా ఒకరోజు నేనంటే తనకి ఇష్టమని. నన్ను తను ప్రేమిస్తున్నట్టు చెప్పింది. అవన్నీ నాకు నచ్చవని, నేనొక అనాధనని, మీకు నాకు సరిపడదని, ఇలాంటివి కాలేజ్ లో తెలిస్తే పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడతాయని, వీటివల్ల నాకున్న లక్ష్యాలు, ఏకాగ్రత దెబ్బతింటాయని, ఎంత వారిస్తున్నా వినలేదు తను.

తనకెంత నచ్చచెప్పినా తను మాత్రం నన్ను వదలడం లేదు. కాలేజీలో అంత మందున్నా తను నా వెంటే పడేది. లెక్చరర్స్ కి కంప్లైంట్ చేద్దాం అంటే, తానొక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి, సైలెంటని, మెరిట్ స్టూడెంటని కాలేజ్ లో మంచి పేరు తనకి. మనమా అనాధలం, పట్టుదలతో ఇక్కడవరకూ నెట్టుకొచ్చాను. ఎదైనా తేడా జరిగితే ఇద్దరికీ చేటే, బయటకు పంపించేస్తారని భయం. దాంతో IES అవ్వాలన్న నా లక్ష్యం కూడా దూరమవుతుంది, ఆ అమ్మాయి కెరీర్ కూడా స్పాయిల్ అవుతుందని నాలో ఆందోళన ఏర్పడింది.

పోనీ, నా స్నేహితులకి విషయం చెప్దామంటే, ఇలాంటి చిన్న చిన్న విషయాలలోనికి వాళ్ళని లాగడమెందుకని ఊరుకున్నాను. ఇలా కొన్ని రోజులు సాగింది. కానీ, తనలో మాత్రం మార్పు రావడం లేదు. అయినా నేను తనని దూరం పెడుతూనే వస్తున్నాను. చివరికి ఒకరోజు తనతో ఇలాగే నేను అవాయిడ్ చేస్తూ సరిగా మాట్లాడకపోతే, తను చనిపోతానని నన్ను బెదిరించింది.

దాంతో, ఇష్టం లేకపోయినా కొంచెం సన్నిహితంగానే మెలగడం అలవాటైంది తనతో… పార్కులకు, షాపింగ్ లకి, కాఫీ షాప్ లకు ఎక్కడకు పడితే అక్కడికి తనకి తోడుగా పిలిస్తే వెళ్ళక తప్పేది కాదు. అలా అని నా చదువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయనప్పటికీ, దాని పర్యవసానంగా ఆ సంవత్సరం జరిగిన గేట్ పరీక్షలో కనీసం క్వాలిఫై కాలేకపోయాను.

తను నాలో ఏ లక్ష్యాలైతే నచ్చి, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందో, చివరికి అవే లక్ష్యాలుకు తనే అడ్డుతగుతుందని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి నాది. అప్పటికే నాకొక సాఫ్ట్వేర్ కంపెనీ లో మంచి జాబ్ వచ్చింది. అసలే నిరాశలో ఉన్న నాకు అది కొంచెం ఊరటనిచ్చే అంశం. ఇప్పటివరకు కాలేజీలో వచ్చే (ఫండ్స్ రూపంలో) డబ్బుతో కాలం నెట్టుకొచ్చిన నేను మళ్ళీ ఒక సంవత్సరం IES ప్రిపరేషన్ కి కాళిగా కూర్చుంటే, డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి అనే ప్రశ్న నాలో కలిగింది.

ఇక వచ్చిన ఆ జాబ్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నా తరుణంలో.. ఒక రోజు తను నన్ను కలిసి, ఇంట్లో వాళ్లు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, తనకి మాత్రం అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, ఇంకా పై చదువులు (IES) చదవాలనుందని, ఎదైనా సహాయం చేయాలని నన్ను ప్రాధేయపడుతూ, నా దగ్గర తన వేదనని వెళ్ళబుచ్చుకుంది.

ఆ అమ్మాయిపై ఎందుకో మొట్టమొదటి సారి జాలి కలిగింది. నాకొచ్చిన ఆ జాబ్ చేస్తే, ఇక ఒకరి దగ్గర చెయ్యి చాచల్సిన పని ఉండదూ, పైగా ఆ అమ్మాయి చదువుకి కూడా ఎంతో కొంత సహాయమవుతుందని భావించాను. అందుకే నా లక్ష్యాన్ని పక్కన పెట్టి, తన లక్ష్యాన్ని సాధించడంలో నా కృషిని అందచేయాలనుకున్నాను. నా ద్వారా నేను ఆ అమ్మాయికి చేయగల్గిన సహాయం ఆ అమ్మాయిని చదివించడమేననిపించింది.

ఇదంతా నా ఫ్రెండ్స్ కి వివరించినా వాళ్లకు అర్థం కాదు. అందుకే, వాళ్ల దగ్గర ఆ విషయాన్ని దాచిపెట్టి, నా లక్ష్యాన్ని విడిచి ఆ ప్రైవేట్ జాబ్ లో స్థిరపడదామని నిర్ణయించుకున్నాను. అలా నాకొచ్చే జీతంతో కొంచెం తన చదువులకు ఖర్చు చేయాల్సొచ్చినా, మిగిలింది మాత్రం పొదుపు చేసుకునేవాడిని. ఇంత చేస్తున్నప్పటికీ ఆ అమ్మాయి అంటే నాకు ప్రేమకాని, వ్యామోహం కానీ కలగలేదు. ఇదంతా కేవలం తనపై జాలితో మాత్రమే చేస్తున్నాను.

ఒకానొక రోజున ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి, చాలా డల్ గా కూర్చుంది. ఎప్పుడూ చలాకీగా కబుర్లు చెప్పే తను “ఇలా ఎందుకుందని, అసలు ఏమైందని” అడిగినా… తను మాత్రం నాకు బదులు ఇవ్వకుండా నిశబ్ధంగానే కూర్చుంది. ఎంత సేపటికీ అలానే ఉండడంతో చిర్రెత్తిన నేను, గదమాయింపుతో గట్టిగా నిలదీశాను.

దాంతో అసలు విషయం చెప్పింది. తన కుటుంబం గడవడం కోసం వాళ్ల నాన్న గారు కొంతమంది దగ్గర అప్పులు చేశారని. ఇప్పుడు అవి తీర్చమని అప్పులోల్లు గగ్గోలు పెడుతున్నారని, అవి బరించలేక తననొక డబ్బున్న, తన కంటే దాదాపు పదిహేనేళ్లు వయసు పెద్ధైన రెండో పెళ్ళివాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారని, దీంతో తన ఆశయం చనిపోతుందంటూ ఆవేదన గా మాట్లాడుతూ బోరున విలపించింది.

అదంతా నమ్మిన నాకు తనపై మరింత జాలి పెరిగింది. అప్పటికే ఆడవాళ్లపై ఈ సమాజం చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకినైన నేను, నాకదంతా నచ్చలేదు. తనని ఒదార్చడంతో పాటు, నేను పొదుపు చేసుకుంటున్న సొమ్ముతో, పైగా ఇంకొంత నా స్నేహితుల దగ్గర అప్పుచేసి తనకిచ్చాను. తను వద్దంటూనే నిర్మొహమాటంగా తీసుకుంది చివరికి.

***********

కాల క్రమేణా తనపై జాలి కాస్తా చెలిమిగా చిగురించింది. ఒకసారి నాకు జ్వరం వస్తే, దగ్గరుండి అంతా తానై చూసుకుంది. నా ఫ్రెండ్స్ ని పిలుస్తానంటే “ఎందుకు నేనున్నాగా” అంటూ తన ఆప్యాయత అనురాగలతో నాకొక కొత్త తోడును పరిచయం చేసింది. ఎందుకో… ఎప్పుడూ లేనిది, ఆ రోజు తర్వాతే తన గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ స్నేహం కాస్తా తనపై ప్రేమగా పెనవేసుకుందని ఆ ప్రయాణంలోనే నాకర్ధమయ్యింది.

ఎలాగో తను కూడా నన్ను ఇష్టపడుతుంది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఒకరినొకరు బాగానే అర్ధం చేసుకున్నాం. ఇంకా చెప్పాలంటే నేను కొంచెం తనని ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. ఇక ఇంతకన్నా ఎక్కువ ఆలస్యం చేయకుండా తనకి నా ప్రేమ గురించి చెప్పాలనుకున్నాను. అప్పటివరకూ నేను ఆలోచించిన లక్ష్యాలు, స్నేహితులు అవేమీ నాకు ఆ సమయంలో గుర్తుకురాలేదు. అంతలా మరిపించింది నన్ను ఆమె తోడు.

చివరికి, ఒక రోజు తన పైనున్న ఇష్టాన్ని తెలియచేయాలనుకున్నాను. అనుకున్నదే తడవుగా ఆ రోజు రాత్రి తనంటున్న హాస్టల్ కి వెళ్ళాను, తనకి విషయం చెప్పి సర్ప్రైజ్ ఇద్దామని. అలా అక్కడికి వెళ్లిన నాకు, తన ఫ్రెండ్ రమ్య కనిపించింది.

“హలో..! సత్య కిరణ్ ఎలా ఉన్నావ్.. ఎన్నాళ్ళయింది నిన్ను చూసి.. అయినా ఈ టైం లో నువ్ ఇక్కడేం చేస్తున్నావ్..”

అంటూ నన్ను పలకరించింది.

ఒకే క్లాస్మేట్స్ అయినా.. నాకు తనని గుర్తుపట్టడానికి కొంచెం టైం పట్టింది. తర్వాత తేరుకుని, ఇలా సంధ్యని కలవడానికి వచ్చినట్టు తనకి చెప్పాను.

అవునా.. తనిప్పుడే బయటకి వెళ్ళిందే! ఒకసారి కాల్ చేయలేకపోయావా? (తను చెప్పింది అర్థం కాక, వద్దన్నట్టుగా తలాడించాను నేను)

సర్లేనంటూ.. కాలేజ్ విషయాలు మాట్లాడుతూ నాతో కాలక్షేపం చేసింది కాసేపు…

అదేంటి తను ఈ టైంలో అసలు బయటకి వెళ్ళదే! ఒకవేళ బయటకి వస్తె నన్నే కలుస్తుంది. పైగా ఈ టైంలో నన్ను కూడా ఎప్పుడూ కలవలేదు. ఏమైయుంటుంది..? 

అనుకుంటూ లోలోపల లేనిపోని సందేహాలతో సతమతమవుతూ, ఒకపక్క రమ్య చెప్తుందేది పట్టక, సంధ్య కోసం వెయిట్ చేస్తూ ఆ హాస్టల్ బయటే ఉండిపోయాను. అప్పటికే టైం రాత్రి పదకొండు గంటలు కావొస్తోంది. తను మాత్రం ఇంకా రావడం లేదు.

రమ్య మాత్రం..

“సరే చాలా టైం అవుతుంది కిరణ్, ఇంకెప్పుడైనా కలుద్దామని చెప్పింది.”

సరేనని నేను తలాడించాను,

తను హాస్టల్ లోనికి వెళ్తుంటే, నేను మాత్రం చేతికున్న వాచ్లో టైం చూసుకుంటూ, అక్కడే ఉండిపోయాను సంధ్య కోసం ఎదురుచూస్తూ… అది గమనించి వెనకకి తిరిగిన రమ్య,

“ఏంటి నువ్ వెళ్లవా మరి? అంటూ ప్రశ్నించింది.

అది…! అది…!! సంధ్య అని నేను సనుగుతూ తడబడుతుంటే,

“తను ఇప్పుడప్పుడే రాదు కిరణ్, తన బాయ్ ఫ్రెండ్.. అదే, రఘుతో కలిసి బయటకి వెళ్ళింది. ఏమైనా చెప్పాలంటే చెప్పు తనకి చెప్తాను. ”

అని అనగానే, తన మాటలకు ఒక్కసారిగా షాకైనా నాకు, గుండె పగిలినంత పనైంది. తను చెప్పిన ఆ వాక్యం నా గుండెల్ని కోసేసింది. అసలు నేను విన్నంది నిజమో కాదోనని, నిర్ఘాంతపోయిన నేను.

ఏంటి? ఎవరి గురించి చెప్తున్నావ్ ? అని మళ్ళీ అడిగాను.

అదే మన క్లాస్మేట్ రఘు ఉన్నాడుగా తనతో కలిసి సంధ్య బయటికి వెళ్ళింది. 

అనిపించడం కాదు, ఈ సారి నా గుండె నిజంగానే పగిలింది.

(రఘు ఎవరో కాదు, మాతో పాటు చదువుకున్న మా క్లాస్మేటే, తను ఒక గొప్పింటి బిడ్డ, పైగా అల్లరి చిల్లరి గా తిరిగేవాడు అందుకే నాకంత పరిచయం లేదు తనతో).

అసలు రఘుతో ఎలా పరిచయం తనకి అని ఓ వెర్రివాడిలా అడిగాను తనని.

“అదేంటి సత్య కిరణ్, నీకు తెలియనట్టు అడుగుతున్నావ్..? వాళ్ళిద్దరూ కాలేజ్ డేస్ నుండే లవర్స్ కదా! పైగా సంధ్య నీతో చాలా క్లోజ్ గా ఉండేది, నీకు తన లవ్ మేటర్ గురించి చెప్పలేదా…? అయినా, ఎప్పుడూ అలా పుస్తకాలతోనే గడిపేవాడివి, బయట ప్రపంచం గురించి నీకేం తెలుస్తుందిలే…. వాళ్లిద్దరి లవ్ స్టొరీ గురించి కాలేజ్ మొత్తం తెలుసు, రఘు అల్లరి చిల్లర గా తిరుగుతాడని కాలేజ్ అంతా అసహ్యించుకుంటున్నా, తను మాత్రం త్రీ ఇయర్స్ నుండి చాలా సిన్సియర్ గా లవ్ చేస్తుంది. ఇప్పుడు కూడా తరుచూ బయట కలుస్తూనే ఉంటారు.

రఘు జాబ్ లేక ఖాళీగా తిరుగుతున్నా, తనకేం లోటులేకపోయినా సంధ్య మాత్రం తనని కంటికి రెప్పలా చూసుకుంటుంది. రఘు వాడే స్టైలిష్ స్పెక్ట్స్ దగ్గర నుండి బైక్ వరకూ అన్నీ సంద్యనే కొనిచ్చింది.”

తను ఓ మధ్య తరగతమ్మాయి, పైగా తను IES కి ప్రిపేర్ అవుతుంది కదా! ఇన్ని డబ్బులు తనకెలా వస్తున్నాయని అడిగాను నేను అమాయకంగా..

దానికి బదులుగా రమ్య,

ఏంటి..? అసలేవరు చెప్పారు నీకు, తను IES కి ప్రిపేర్ అవుతుందని, తను జాబ్ చేస్తుంది కదా ..! అలా సంపాదించిన డబ్బులన్నీ తనకే ఖర్చు చేస్తుంది. “ఎందుకే, నీ తాహతుకి మించి వాళ్ళకి వీళ్ళకి ఖర్చు పెడతావ్” అని మేము హెచ్చరిస్తే, 

“నా సంపాదన నా ఇష్టం అయినా నా పర్సనల్స్ లో మీ జోక్యం ఏంటే? ” అంటూ మా మీద కోప్పడుతుంది. మాకెందుకు లే అని మేము సైలెంట్ గా ఉండిపోతాం. 

అదంతా విన్న నా మనసు ముక్కలైంది. ఇక తను చెప్పేదేది నా చెవులకి ఎక్కడం లేదు.

“సరే! లేటవుతుంది. ఇక నేను బయలుదేరతా” (తడబడుతున్న గొంతుకతో) అంటూ అక్కడి నుండి వచ్చేసాను. జరిగిన ఈ కొద్దీ క్షణాలు నిజం కాకపోతే బాగుండని అనుకుంటూ నా మనసు ఆవేదన చెందుతుంది. ఇక నా కళ్ళు చెమర్చి తడిసి ముద్దయ్యాయి. అలా అక్కడి నుండి మెయిన్ స్ట్రీట్ మీదకి వస్తుండగా, ఒకబ్బాయి తన బైక్ పై ఒకమ్మాయిని ఆ స్ట్రీట్ కి చివర డ్రాప్ చేస్తుండడం గమనించాను. వాళ్ళెవరో కాదు సంధ్య, రఘు.

అసలే నిస్పృహతోనున్న నేను వాళ్ళని అలానే చూస్తుండిపోయాను సమీపం నుండి. వాళ్ళు నన్ను గమనించినట్టు లేరు. ఆ స్ట్రీట్ రాత్రి పూట నిర్మానుష్యంగా ఉండడంతో ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుంటూ, ఆపై కిస్ చేసుకుంటూ… చెప్పడానికి నాకు మాటలు కూడా రావడం లేదు, అలా నడిరోడ్డుపై సిగ్గులేకుండా రొమాన్స్ లో మునిగితేలుతున్నారు.

అదంతా చూస్తున్న నాకు వాళ్లపై కోపం కట్టెలు తెంచుకుంటోంది. ముఖ్యంగా నన్ను మోసగించిన సంధ్య మీద. “అసలు తను ఇలాంటిదా….” వాళ్ళని అక్కడిక్కడే నరికి పోగులు పెట్టినా పాపం లేదన్నంత ద్వేషం కలిగింది.

కానీ, తప్పెవరిది? అంత గుడ్డిగా నమ్మి మోసపోయిన నాది. ఆ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుందామనిపించింది. కానీ, ఈ విషయాలేవీ బాహ్య ప్రపంచానికి, నా ప్రాణ స్నేహితులకి తెలియకపోతే, ఇలాంటి వారివల్ల జాగ్రత్త పడక నాలా ఇంకెంత మంది మోసపోతారో, పైగా ఏ కారణం లేకుండా చచ్చిపోయానని నా చావుకు అర్థం కూడా ఉండదు, ఓ పిరికివాడిలా చనిపోయానని ఈ సమాజం అనేక అపార్థాలు వెతికి, నాకాపాదిస్తారు. అందుకే ఇదంతా చెప్పాలని, కొన్ని గడియలు ఓపిక పట్టి నా వేదనని వివరించదలచాను.

అనాథ అనే ఫీలింగ్ నుండి ఇన్నాళ్ళకి బయట పడిన నేను, తన వలలో పడి జరిగింది ఎవరికి చెప్పుకోలేక చివరికి మళ్ళీ అనాధనయ్యాను. నా మిత్రులు నన్నొక సొంత తమ్ముడిలా భావించినా, నేను వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేశాను. అసలేకారణం చెప్పకుండా వాళ్ల దగ్గర చాలా డబ్బులు తీసుకున్నాను. ఇప్పుడు నా స్నేహితులకి జరిగింది చెప్పినా, వాళ్ళు నేను చేసిన ఈ అవివేకపు పనికి నన్ను అసహ్యించుకుంటారేమో?

ఒకవేళ మన్నించి వదిలేసినా.. ఒక అమ్మాయి చేతిలో మోసపోయిన నేను, సిగ్గుతో, అసలు వాళ్ళకి నా మొహం ఇక ఎలా చూపించను? అందుకే ఏదేమైనా, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. అరేయ్ సత్య కుమార్, సత్య కృష్ణ, సత్య కాంత్ మీ దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించకుండా మిమ్మల్ని మోసగించి వెళ్ళిపోతున్నానని, నా గురించి తప్పుగా అనుకోకండి…

ఒక అమ్మాయి చేతిలో మోసపోయి నా మనసెప్పుడో చచ్చిపోయింది. ఇక మిగిలివుంది ఈ దేహం మాత్రమే. అందుకే, మీకు నా మొహం చూపించలేక ఇలా శాశ్వతంగా మీకు దూరం అవుతున్నా… చివరిసారిగా… మిమ్మల్నందరినీ కలవాలని, ఇదంతా మీకు చెప్పాలనున్నా, మీకు ఎదురుపడి చెప్పలేని పరిస్థితి నాది. నేను చేస్తున్న ఈ పనికి నన్ను మీరు క్షమిస్తారు కదూ….”

అంటూ సాగిన ఆ డైరీ సారాంశం ఇది.

ఇదంతా చదివిన మాకు దుఖం ఆగలేదు. వాడిని వెతికే పనిలో పడి, ఇంటి నుండి బయలుదేరి వెళ్తుంటే, అప్పుడే సరిగ్గా “సికింద్రాబాద్ రైల్వే పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం లభ్యం” అంటూ టీవీలో బ్రేకింగ్ న్యూస్. ఆ న్యూస్ ఛానల్ లో చూపిస్తున్న అక్కడి దొరికిన మృతుడి పాస్ పోర్ట్ సైజ్ ఫోటో సత్య కిరణ్ దే… దాంతో నేను సోమ్మసిల్లాను.

కొద్దిసేపటి తర్వాత తేరుకున్న నేను, తను లేడన్న వార్త చాలా కాలం జీర్ణించకోలేకపోయాము. అలా… సత్య కిరణ్ క్షణికావేశంలో మా నుండి దూరమయ్యాడు.

*********

ప్రాణ స్నేహితుడిని పోగొట్టుకున్న ఆ మిగిలిన ముగ్గురు స్నేహితులు ఏం చేశారు?

సత్య కిరణ్ జీవితాన్ని నాశనం చేసిన ఆ అమ్మాయి ఏమైంది?

తమ ప్రాణ స్నేహితుడి జీవితాన్ని నాశనం చేసిందని మొదటి భాగంలో చెప్పినట్టు సంధ్యని మిగిలిన ముగ్గురిలోనే ఎవరో ఒకరు హత్య చేసుంటారా?

లేక, రంజిత్ చదువుతున్న ఈ డైరీ సత్య కుమార్ రాసినట్టుంది కాబట్టి అతనే హత్య చేసుంటాడా?

అసలు ఆ డైరీ లో రంజిత్ కి ఇంకేం ఆధారాలు లభించాయి?

లాంటి విషయాలు కలిగిన మిగిలిన కథ యొక్క తర్వాతి భాగం అన్వేషణ-5 లో తెలుసుకోండి…

– భరద్వాజ్ 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *