అపాత్ర దానం

అపాత్ర దానం

అమ్మా ఒక రెండు చీరలు ఉంటే ఇయ్యమ్మా అంటూ అరుపులు వినిపించాయి మాకు. ఏమిటో అనుకుంటూ కిందకు చూసాను నేను, మాకు పక్కనుండే అపార్ట్ మెంట్ ముందు ఒక ముసలవ్వ అరుస్తూ ఉంది. ఇంతలో, ఆ అపార్ట్ మెంటు లోంచి ఏమైందవ్వ అంటూ ఇంకొక ఆవిడ అడిగింది, దానికి ఆమె, అమ్మా నా కూతురు రెండు రోజుల క్రితం కానుపు అయ్యింది. కట్టియ్యడానికి బట్టలు లేవు ఒక రెండు చీరలు ఉంటే ఇవ్వమ్మా అంటూ చాలా దీనంగా అడిగింది. ఆమె అడగడం విని నాకు చాలా జాలి వేసింది.

ఈ లాక్ డౌన్ పుణ్యమా అని మనుషుల్లో జాలి, దయ, కరుణ, కొంచం ఏం ఖర్మ మొత్తం దొబ్బింది. ఎవరికి ఎవరు ముఖ్యమో తెలియకుండా పోయింది. మొత్తానికి కరోనా మనుషుల అసలు రూపాలను బయట పెట్టింది.

మనుషుల్లో ఎంత స్వార్థం పెరిగిందో కూడా చూపెట్టింది పాపం ఆమె ఎంత ఆత్మాభిమానం చంపుకుని కూతురు కోసం ఇలా అభిమానం చంపుకుని అరుస్తూ అడగడం చూస్తుంటే చాలా జాలిగా అనిపించింది. ఇంతలో పక్క అపార్ట్ మెంట్ లోని ఆవిడ పిలిచి ఒక నాలుగు చీరలు ఇదిగో అమ్మా అంటూ పై నుండి వేసింది.

Lady Indian Woman - Free photo on Pixabay

అది చూసిన ఆ అపార్ట్ మెంటులోని కొందరు కూడా ఆమెకు తలా కొన్ని చీరలు ఇచ్చారు. ఇంతలో ఇది చూసిన మా బాబు, అమ్మా పాపం మనం కూడా ఇద్దామే, ఆమె చూడు ఎంతగా అరుస్తుంది అంటూ నన్ను అడిగాడు ఆమె ఎంత దయనీయంగా అరుస్తుందో మీకు అర్దం అయ్యింది కదా చిన్న పిల్లాడిని కూడా ఆమె అరుపు కదిలించింది అంటే అంత హృదయ విదారకంగా అరిచింది ఆవిడ. నాకు కూడా పాపం అనిపించింది సరే, వెతుకుదాం అనుకుని లోపలికి వెళ్ళి చీరలు వెతికాను,కానీ, అన్ని పాలిస్టర్ చీరలే ఉన్నాయి కాటన్ వి కావాలి కదా అని అనుకుంటూ ఇంకా వేరే మూటల్లో చూశాను అదృష్టం బాగుండి కొన్ని పాత కాటన్ చీరలు దొరకడంతో సంతోషంగా అనిపించింది. వెంటనే వాటిని కవర్లో వేసి నేను, బాబు మాస్క్ లు పెట్టుకుని కిందకు వెళ్లి ఆమెను ఆగమంటు బాబుతో ఇప్పించాను…

నిజానికి అవి ఆమెకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది…అక్కడ ఉన్న కొందరు ఆడవాళ్ళు ఇంకా వేరే వస్తువులు, బట్టలు, పిల్లాడికి చిన్న చిన్న అంగిలు, కొందరు డబ్బు ఇచ్చారు. అవన్నీ తీసుకుని ఆవిడ చాలా సంతోషంగా సల్ల గుండు అమ్మా అంటూ దీవించింది అందర్నీ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది..

ఇంతలో మాకు ఎప్పుడూ ఆకుకూరలు తెచ్చే అబ్బాయి సైకిల్ పైన వస్తూ ఆమెను చూసాడు. మా దగ్గరికి వచ్చి ఆగుతూ గామే ఇదెందుకు ఉందమ్మా అంటూ అడిగాడు,అయ్యో పాపం రాజు ఆమె కూతురు డెలివరీ అయ్యిందట. కట్టుకోవడానికి బట్టలు లేవట అందుకే వచ్చింది. పాపం ఆత్మాభిమానం చంపుకుని మరీ అరుస్తూ అడిగేసరికి అందరం తలా కొన్ని చీరలు డబ్బులు, బియ్యం కూరగాయలు, ఇచ్చాము. అలాగే వండిన ఆహారం కూడా కొందరు ఇచ్చారు.అవన్నీ ఆవిడ తీసుకుని వెళ్తుంది పాపం. ఇలాంటి వారికి మనం సహాయం చేయాలి రాజు అప్పుడే మనం మనుషులం అని తెలుస్తుంది అన్నాను ఏదో సాధించినట్టు….

అపాత్ర దానం

దానికి రాజు అవు అవు చెయ్యాలి కాని అమ్మా ఇగో గీ ఫోటో ఒక్కసారి సుడుర్రి అన్నాడు ఫోన్ తీసి నాకు ఇస్తూ… ఏంటి రాజు నేను ఒకటి చెప్తుంటే నువ్వు ఫోటో చూడమంటావు. ఏంటో అనుకుంటూ ఫోన్ కు సనిటైజర్ కొట్టి తీసుకుని చూశాను అంతే షాక్ అయ్యాను..

India Lady Old - Free photo on Pixabay

ఎందుకంటే, ఇప్పుడు బట్టలు, చీరలు డబ్బు కూరగాయలు తీసుకున్న ముసలి ఆవిడ అక్కడ కూర్చోని చీరలు అమ్ముతూ ఉంది. అది చూసి ఎంటి రాజు ఆమె బట్టలు కూడా అమ్ముతుందా అంటూ అమాయకంగా అడిగాను నేను. అవునమ్మ బట్టలు అమ్ముతుంది.

అయితే మామూలు బట్టలు కాదు, మీ లాంటి వాళ్ళు ఇచ్చిన బట్టలు తీసుకుని వెళ్లి బాగా ఉతికి ఐరన్ చేసి, కొత్తవాటిలా ఏదో పౌడర్ కొట్టి వాటిని మళ్లీ సెకండ్ హ్యాండ్ లో అమ్మెస్తుంది. అంటే యాభైకి, వందకు అమ్ముతుండి అన్నాడు.

అవునా, అలా అమ్మేవాళ్ళు బట్టలు కొంటారు కదా అన్నాను నేను. అవునమ్మా కొనాలి అంటే డబ్బులు ఉండాలి కదా అందుకే ఇలా బుడి బుడి రాగాలు తీస్తూ అందర్నీ మోసం చేస్తూ అడుక్కుని అది డబ్బులు సంపాదించుకుంది.

ఆమెకు ఎలాంటి కూతుర్లు లేరు, చెప్పేవన్నీ అబద్ధాలే అన్నాడు రాజు. అయ్యో అవునా నేను అపాత్ర దానం చేశానా అని అనుకుంటూ పోనీలే, రాజు ఆమె దొంగతనం చేయడం లేదు కదా ఏదో పొట్ట కూటి కోసం చేస్తుంది,కూటి కోసం కోటి విద్యలు. పోనీలే మన వల్ల ఆమె కడుపు అయినా నిండుతుంది అంటూ రాజుకు, నా మనసుకు సర్ది చెప్పుకున్నాను….

హరిప్రియ

Related Posts