అర్థరాత్రి మద్దెల దరువు
కొత్తగా కొత్త ఇంటికి చేరాం. ఇల్లు చాలా బాగుంది బాగుండదు మరి అద్దె ఎక్కువే గా అందుకే బాగుంది. నాలుగు రోజులు సామాను సర్దుకోవడం ,అన్ని మంచిగా పెట్టుకోవడం తో అలసిపోయి పడుకునే వాళ్ళం. రోడ్డుకే ఇల్లు. చాలా బాగుంది సరదాగా టైం పాస్ కూడా అవుతుంది అని తీసుకున్నారు.
వారం రోజులపాటు సరదాగానే సాగింది. హాయిగా చాలా పెద్ద ఇల్లు కావడంతో ఎవరి రూములు వాళ్ళకి వచ్చాయి. విశాలమైన ఇల్లు ,ఎంత బాగుందో అని అనిపించింది. మా ఆనందానికి హద్దులు లేవు.
అలా ఇల్లంతా సర్దుకొని కాస్త స్థిమిత పడ్డాక, రాత్రి తినీ నిద్రపోయాం, మంచి నిద్రలో ఉన్నప్పుడు యాహూ అని అరుస్తూ బైక్ ల మీద పిల్లల అరుపులతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాం. దాంతో మా నిద్దర ఎక్కడికో ఎగిరిపోయింది.
సరేలే ఎవరో పిల్లలు అరుస్తూ వెళ్లారు అని అనుకునీ మళ్లీ నిద్రకు ప్రయత్నించాo. కరెక్ట్ గా నిద్రపోయే సమయానికి మ్యావ్ మ్యావ్ మ్యావ్ మ్యావ్ అంటూ పిల్లి అరుపులు ఆగకుండా వస్తూనే ఉన్నాయి.
కాసేపైనా అపుతాయేమో అని అనుకున్నాం. కానీ వాటికి గొంతు ఎండిపోలేదు ఏమో, అరుస్తూనే ఉన్నాయి. ఇంకా మా మొహానికి నిద్ర ఎక్కడిది.
సరేలే అనుకొని చెవుల్లో దూది పెట్టుకుని పడుకున్నాం. అయినా ఆ శబ్దాల అరుపులు నిద్రను దూరం చేశాయి. ఇక చేసేదేం లేక ఆ శబ్దాలకు అలవాటు పడ్డాం.
కొత్త ఇల్లు అయినా అర్ధరాత్రి బండ్ల చప్పుడులు, మోటార్ సైకిల్ ల మోతలు, లారీ చప్పుడులతో, తెల్లార్లు నిద్రలు కరువయ్యాయి. ఇక వాటిని ఆపే శక్తి మాకు లేక ఇల్లు ఖాళీ చేద్దామనుకున్నాం.
కానీ వచ్చి వారం కూడా కాలేదు. అప్పుడే నాలుగు నెలల అద్దె కూడా వాళ్ళ దగ్గరే ఉంది, ఇప్పుడే వెళ్లిపోతామంటే ఆ అడ్వాన్స్ ఇవ్వకపోవచ్చు. అనే భయంతో నోరు మూసుకొని తెల్లార్లు మేలుకొని ఆ అర్ధరాత్రి చప్పుడులు వింటూ నిద్రకు దూరమై, మధ్యాహ్నం పూట పడుకోవడం అలవాటు చేసుకున్నాం. ఏం చేస్తాం చెప్పండి సర్దుకుపోవాలి.
– భవ్య చారు