అరుదైన స్మృతులు

అరుదైన స్మృతులు

 
రమణమహర్షి గురించి వినటం.. ఒకటీ రెండూ పుస్తకాలు చదివినా  ఆయనొక ఎంజిమాటిక్ పర్సనాలిటి (enigmatic personality) లా అగుపించారు. కానీ ఆయన పట్ల ఆకర్షణ తగ్గలేదు.
అట్లాంటి సమయంలో ‘భగవాన్ స్మృతులు’ పేరిట చలం తన అనుభవాలతోపాటు భగవాన్ దగ్గరున్న అనేకమంది అనుభవాలను, సాక్షాత్కారాలను తనదైన శైలిలో తనదైన వచనంతో ఎప్పుడో అందించిన పుస్తకం చదివే అవకాశం కలిగింది.
ఇంతకీ రమణులు ఎవరు? దైవస్వరూపమా? సాధారణ వ్యక్తిగా ఉన్న అసాధారణ వ్యక్తా? ఇవన్నీ వెంటనే మనకు వ్యక్తం కావు.
కానీ ఆయన దగ్గరున్న వారు, ఆయనను దర్శించుకున్నారు తమ అనుభవాలను స్మరించుకున్నప్పుడు,
గుర్తుచేసుకున్నప్పుడు ఆయనలోని ముక్కుసూటితనం, చమత్కారం చురకలు,ఆధ్యాత్మికత మనకు గోచరిస్తాయి.
కొన్ని సందర్భాలలో ఆయన తన భక్తులు, సన్నిహితులకు అలవోకగా చెప్పిన సత్యాలు మనలను ఆశ్చర్యపరుస్తాయి. 
ఆత్మ సాక్షాత్కరం అంటే ఏమిటంటే ఆయన ఎంత సులభంగా చెబుతారో.. 
“ఇప్పుడు ప్రపంచంలో నీవు ఉన్నావు అప్పుడు ప్రపంచం నీలో ఉంటుంది”
ఇంతకుమించిన వివరణ ఏముంటుంది. రమణాశ్రమంలో స్పర్థలు, కోపతాపాలతో అశాంతిగా ఉన్నా రమణులను చూస్తూ గంటలు గంటలు కూర్చునేవారుట చలం.
ఆయన ఎదురుగా కూచోటం ఏదో వెన్నెల లోకంలో కూచోటమే అంటారు. రమణులకు అపారమైన భూతదయ. ముందు మూగజీవాలకు పెట్టనిదే ఆయనేదీ తీసుకునేవారు కాదుట.
అనేక సందర్భాల్లో ఆయన మాటలు మనకు మార్గదర్శకాలంటారు చలం.
“భగవాన్ ఏ ఆచారాలు పాటించేవారు కాదు. తన దగ్గర చేరిన ఆచారవంతుల్ని ఆ ఆచార బంధనాలనుంచి తప్పించాలని చాలా ప్రయత్నించారు” అంటారు.
అసలు చలం ను పట్టుబట్టి రమణాశ్రమం వైపు మళ్ళించినవారు చింతా దీక్షితులు. వారి అనుభవంతో మొదలై సౌరీస్ (చలంగారమ్మాయి) భావతీవ్రతతో ముగుస్తుంది.
శాంతమ్మ, సంపూర్ణమ్మ, లోకమ్మ, సుందరం, సుందరేశయ్యర్, ఓరుగంటి వెంకట కృష్ణయ్య ఎంతోమంది అనుయాయులు, అనుచరుల మనోభావాల మాలిక ఈ పుస్తకం.
అందరిమల్లే అతి సామాన్యుడిగా ఉంటూనే వారి సమస్యలను పరిష్కరించిన భగవాన్ వారినందరినీ సంస్కరిస్తారు. వారికి చేదోడువాదోడుగా నిలుస్తారు.
వీరితో సంబంధం లేకుండా నిరుపేదలు ఆశ్రమంలో అడుగు పెట్టలేని వారిమీదే భగవాన్ కరుణ కురవటం మనం చూస్తాం. “దర్శనం కన్న దర్శనం కోసం ఆవేదన ముఖ్యం” అంటారు రమణులు.
అలాంటి ఆర్తి ఉన్నవారిని ఆయనే వెళ్ళి కలుసుకొన్న సంఘటనలు మనకు వివరిస్తారు చలం. అరుణాచల గిరి శిఖరం, విరూపాక్ష గుహ, అరుణాచలేశ్వరుని రూపం మనలను కమ్మేస్తాయి..
ఆధ్యాత్మికత, దైవం పుష్కలంగా వ్యాపారం అయిపోయిన కాలంలో ఉన్నాం. వీటికి బీజాలు ఆ కాలంలో పడినా రమణులులా సంస్కరించే గురువులు ఇప్పుడు అరుదు. అందుకే భగవాన్ స్మృతులు చదువుతుంటే మనసుకెంతో ప్రశాంతత అనిపించింది..
 
– సి.యస్.రాంబాబు
Previous post First Glance
Next post నవ్వొస్తేనే నవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *