అత్యంత అరుదైన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం

అత్యంత అరుదైన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం – ఒకే శిలలో ఐదు రూపాలు!

పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము – అనంతపురం, ఆంధ్రప్రదేశ్..!

ఓంకారానికి అర్థాన్ని చెప్పి శివయ్యకు గురువుగా మారినా… సేనాధిపతుల్లో స్కందుడిని నేనంటూ కృష్ణపరమాత్ముడే కొనియాడినా… అవన్నీ సుబ్రహ్మణ్యస్వామి విశిష్టతలను చాటిచెప్పేవే.

అటువంటి స్కందుడు తల్లిదండ్రులతో సోదరుడితో కలిసి వెలసిన క్షేత్రం పంపనూరు బ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం.

‘ఏక శిల ఏక పడగ సప్త శిరస్సాసన శ్రీచక్రసహిత మయూర గణపతి శివ సుబ్రహ్మణ్యేశ్వర నమః’ అనే శ్లోకంతో ఆ క్షేత్రంలో పూజలు ప్రారంభమవుతాయి.

ఒకే శిలలో ఐదు రూపాలతో దర్శనమిచ్చే ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని పంపనూరు గ్రామంలో కొలువై ఉంది.

ధన ధాన్యాలనూ, జ్ఞానాన్నీ, ఆరోగ్యాన్నీ అందించే వరప్రదాతగా అక్కడ స్వామి ప్రసిద్ధిచెందాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మంజునాథ, పార్వతీదేవి విగ్రహాలూ దర్శనమిస్తాయి.

సుమారు అయిదు వందల సంవత్సరాల కిందట శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీవ్యాసరాయలు సర్ప స్వరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించి, దేవాలయాన్ని నిర్మించాడు.

పూర్వం యోగులూ, మహర్షులూ తపస్సును ఆచరించిన ఈ తపోవనంలో ఏడు (సప్త) కోనేర్లు ఉండేవట. ప్రస్తుతం వీటిలో ఆరు కోనేర్లు శిథిలం కాగా..

దేవాలయం తూర్పు దిక్కున ఒక కోనేరు మాత్రమే మిగిలి ఉంది. కాలక్రమంలో ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది.

తర్వాతి కాలంలో ఆలయ జీర్ణోద్ధరణ పనులకు అనంతపురానికి చెందిన ఉపాధ్యాయుడు మధుసూదన శాస్త్రి శ్రీకారం చుట్టారు.

విగ్రహం విశిష్టత, మహత్యాన్ని పలువురికి వివరించి, గ్రామస్థులూ ఇతరుల సహకారంతో విరాళాలు సేకరించి, ఆ సొమ్ముతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు.

విశిష్ట రూపం :

పంపనూరు క్షేత్రంలో ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏడు శిరస్సులతో దర్శనమిస్తాడు. ఇక్కడి మూలవిరాట్టును ఒకే శిలతో ఐదు రూపాలు స్ఫురించేలా మలిచారు.

విగ్రహం పీఠం నుంచి శిరసు వరకూ ఒక్కో రూపం ఒక్కో దేవతను సూచిస్తుంది. ఇందులో పీఠం భాగంలో శ్రీచక్రం పార్వతీదేవికీ, ఆపై భాగంలో చుట్టలు చుట్టేసినట్లుగా కనిపించే సర్పం నాగేంద్రుడికీ, సర్పరూపంలోని చివరి భాగం వక్రతుండుడి ఆకారంలో గణపతికీ ప్రతీకలుగా నిలుస్తున్నాయి.

మూలవిరాట్టు మధ్యభాగం శివలింగంగా దర్శనమిస్తుంది. సర్పం శిరస్సు భాగం ఏడు తలలతో పడగవిప్పిన నాగేంద్రుడిగా దర్శనమిస్తాడు.

ఈ రూపమే సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పూజలందుకుంటోంది. మూలవిరాట్టుకు ఇరువైపులా నెమలి పింఛాలతో కూడిన చక్రాలు ఉన్నాయి.

సుబ్రహ్మణ్యేశ్వరుడి మూలవిగ్రహం ఐదు శక్తి రూపాలతో వెలసి ఉండటం విశేషం.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *