ఆంటీ

ఆంటీ

 

తల్లి దండ్రుల తర్వాతి స్థానం చదువు నేర్పు గురువులదే. కానీ చదువు ఒక్కటే కాదు, పనికొచ్చేది ఏదైనా నేర్పే వారు కూడా గురువులే అవుతారు. అలాంటి ఒక గురువు నాకు ఉంది. చదువులో, ఆట పాటల్లో, విజయ లక్ష్మి టీచర్ గారు నన్ను ఎలా ముందుకు నడిపించారో అలాగే నాకు పుస్తకాలని చదవడంలో ఆసక్తి కలిగేలా చేశారు ఆంటీ.

ఆంటీ మా ఇంటి యజమాని కూతురు. తను అప్పటికే డిగ్రీ చేస్తుంది డిస్టెన్స్ లో, మేము వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉండేవాళ్ళం, నేను ఆరోతరగతిలో ఉండగా ఆంటీ పుస్తకాలు చదువుతూ ఉండేది. అది చూసి నేను ఆంటీ నువ్వెందుకు ఈ బుక్స్ చదువుతున్నావు ? అని అడుగుతూ ఉండేదాన్ని. అప్పుడు ఆంటీ ఇందులో రకరకాల కథలు, విషయాలు ఉంటాయి మనకు తెలియనివి తెలుసుకోవచ్చు, కాలక్షేపం అవుతుంది మంచి విషయాలు కూడా తెలుస్తాయి అంటూ చెప్పేది.

వాళ్ళ ఇంట్లో ఒక పుస్తక భాండాగారం అంటారు కదా అలాంటివి మూడు బీరువాలు ఉండేవి. అన్నిట్లో పుస్తకాలే, అయితే ఆంటీ నాన్నగారు ఆయుర్వేద వైద్యులు కావడంతో అన్ని రకాల పుస్తకాలు ఉండేవి. అవన్నీ చూస్తూ ఇవన్నీ చదివావా అని అడిగితే అవును అని చెప్పింది. నేను అమ్మో అనుకున్నా, ఆంటీ ఇంట్లో ఉన్న పుస్తకాలే కాకుండా మా ఊర్లో ఉన్న గ్రంథాలయంలో ఉన్న పుస్తకాల్ని మొత్తం చదివేసింది.

నేను కూడా చదివాను. అది వేరే విషయం . కానీ ఆంటీ ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ బుక్స్ కూడా చదివింది. మరి వాళ్ళ నాన్న గారు తనకు హిందీ ,ఉర్దూ నేర్పించారు, ఆ పరీక్షల్లో తను మొదటి స్థానంలో వచ్చిందట, అలాగే ఆంటీ రోజూ సాయంత్రం భరత నాట్యం ప్రాక్టీస్ చేసేది. అది చూస్తుంటే నాకు నేర్చుకోవాలి అని అనిపించింది. అనిపించింది ఆచరణలో పెట్టే రోజు తొందరలోనే వచ్చింది. స్కూల్ లో నాకు బహుమతులు వచ్చాక అందరూ నన్ను ప్రోత్సహించడం మొదలు పెట్టారు.

స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ కోసం ఏదైనా స్పెషల్ డ్యాన్స్ చేయించమని హెడ్మాస్టర్ గారు విజయలక్ష్మి టీచర్ తో చెప్పారట. ఆ విషయం నన్ను పిలిచి చెప్పారు టీచర్ గారు. వారం రోజుల సమయం మాత్రమే ఉంది.

ఏదైనా జానపద గీతంపై చేద్దామా టీచర్ అన్నాను. కానీ కాదన్నారు టీచర్. అయితే నాకు ఆంటీ గుర్తుకు వచ్చి తన గురించి చెప్పాను టీచర్ కి, భరత నాట్యం అంటే కష్టం వారం రోజుల్లో నీకు వస్తుందా అన్నారు. నేను ప్రయత్నం చేస్తాను అన్నాను.

టీచర్ గారు ఎందుకైనా మంచిదని రెండూ నేర్చుకో అంటూ పాట ఇచ్చారు రాసి, ట్యూన్ కూడా తనదే… అయితే, పాట పాడుతూ డాన్స్ చేయడం కష్టం, రికార్డ్ లేదు కదా అనుకున్నా… అయినా కూడా నేర్చుకున్నా , పెద్ద తరగతి వాళ్ళు వేరే డాన్స్ చేస్తున్నారు. మనం వాళ్లకు పోటీగా ఏదైనా కొత్తగా చేయాలి అనుకున్నాం అంతా..

నేను ఈ విషయాన్ని ఆంటీకి చెప్పాను. నాకు నాట్యం నేర్పించమని అడిగాను. కానీ ఆంటీ పూర్తిగా కాకుండా కొంచం అంటే ఏదన్నా పాట అయితే నేర్పిస్తాను అన్నారు. సరే అన్నాను, నువ్వు మనసు పెట్టి నేర్చుకో అంటూ తన దగ్గర ఉన్న టేప్ లో రకరకాల పాటలు వినిపించారు . నాకు అవేవీ నచ్చలేదు.

 

ఆంటీ

అప్పుడే టీవీలో సాగర సంగమం సినిమా వస్తుంటే, చూసి అందులో ఒక పాటని చూపించి అది నేర్చు కుంటావా అని అడిగారు. నేను సరే అన్నాను. కానీ నేర్చుకోవడం అంత సులభం కాలేదు.

కాళ్ళు ,చేతులు ,కళ్ళు ,ఒకేసారి తిప్పుతూ పాటకి అనుగుణంగా చేయడం అంటే మాటలు కాదు. కానీ రోజు ప్రొద్దున్న, సాయంత్రాలు డాన్స్, డాన్స్, డాన్స్ ప్రాక్టీసు చేశాను. నాన్న గారు చూసి ఏంటి ఇంత పిచ్చి అన్నారు .అయినా కూడా చేయమని అంటూ ఎంకరేజ్ చేసారు.

వారం రోజులు విరామం లేకుండా నేర్చుకున్నా, ఇక తెల్లారి ప్రోగ్రాం అనగా స్కూల్ లో టీచర్ ముందు చేశాను. విజయ లక్ష్మి టీచర్, నా డాన్స్ ,నా ఆసక్తి , తపన చూసి ఆశ్చర్య పోయారు. ఇంత తక్కువ సమయంలో నేర్చుకోవడం అంత సులభం కాదని చాలా మెచ్చుకున్నారు.

దాంతో నా ఆనందానికి అవధులు లేవు. ఎవరూ మెచ్చుకొకపోయినా టీచర్ మెచ్చుకుంటే చాలు ఏనుగు ఎక్కినంత సంబరం అనిపించింది. ప్రోగ్రాం రోజు అమ్మ చీరను, భరత నాట్యం చీర లాగా కట్టారు. కాగితం పూలు పెట్టి జడ కుట్టారు.అమ్మ జాకెట్ కు కుట్లు వేసి నాకు సరిపోయేలా కుట్టారు. 

అచ్చం సినిమాలో ఆవిడ ఎలా చేసిందో అలాగే రెడీ అయ్యాను. కానీ స్టేజి పైకి వెళ్ళాలి అంటే భయం అనిపించింది. టీచర్ ధైర్యం చెప్పి శాలువా కప్పి తీసుకుని వెళ్ళారు. నన్ను చూసి అంతా ఆశ్చర్యంతో పాటు ఏం చేస్తుందో అనే కుతూహలంతో చూసారు. పాట మొదలు అయ్యింది.

నాకు ఏదో శక్తి వచ్చినట్టు అనిపించింది. నేను అడుగులు కదుపుతూ పాటకు అణుగునంగా డాన్స్ చేయడం మొదలుపెట్టి అందులో లీనం అయ్యాను. అలా పాట అయ్యేవరకు చేశాను, ఆంటీ ఒకటి చెప్పేది. ఏదైనా మనసుతో చేయాలి అని అలాగే చేశాను. నా డాన్స్ అవ్వడం ఆలస్యం చప్పట్లే చప్పట్లు నేను అందరికీ నమస్కరించి లోపలికి వెళ్ళాను.

తర్వాత హెడ్మాస్టర్ గారు మాట్లాడుతూ, ఇంత వరకు ఈ స్కూల్ లో ఎవరూ చేయని విధంగా డాన్స్ చేసినందుకు నన్ను చాలా మెచ్చుకున్నారు. మైక్ లో నా గురించి పొగిడారు. నాకు ఆ సంవత్సరం ఉత్తమ విద్యార్థిగా, ఉత్తమ నాట్యకారిణిగా, షీల్డ్ ఇచ్చారు. ప్రత్యేక బహుమతి ఏంటో తెలుసా..

వెయ్యి నూట పదహారు రూపాయలు మా ఊరి సర్పంచ్ గారు ఇచ్చారు. అయిదు వందల పదహారు రూపాయలు హెడ్మాస్టర్ గారు కవర్లో పెట్టి ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత స్కూల్ లో ఏ ఫంక్షన్ జరిగినా నేనే చేసేదాన్ని. పదవ తరగతి అయ్యాక కూడా ఊర్లో ఏం.ఎల్.ఏ గారు వచ్చారు అని నాచేత డాన్స్ ప్రోగ్రాం పెట్టించారు ఊరి వాళ్ళు.

ఇదంతా కేవలం ఆంటీ నేర్పడం వల్లే జరిగింది. ఆంటీ నాకు చదవడం, పెద్ద వారి పట్ల మర్యాదగా మెలగడం, చిన్న వాటికి థాంక్స్ చెప్పడం, నాట్యం అన్ని నేర్పింది. ఒక విధంగా నన్ను రచయిత్రిని చేసింది కూడా ఆంటీ నే అనుకుంటాను.

ఎందుకంటే తను కూడా చిన్న చిన్న కవితలు రాయడం, నన్ను అడగడం నాతో చర్చించడం వంటివి చాలా చేసేది. మేము స్నేహితుల్లా ఉండే వాళ్ళం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆంటీ గురించి చెప్పేవి, మళ్లీ ఎప్పుడైనా చెప్తాను. గురువు అంటే చదువు ఒక్కటే కాదు అన్నిట్లో ముందుండాలి అని నేర్పిన వారు విజయలక్ష్మి టీచర్ అయితే, నాలో ఇంకో కోణాన్ని నాకు పరిచయం చేసిన ఆంటీ అంటే నాకు గురువేగా… అందుకే ఈ సందర్భంగా ఆంటీకి నా శత కోటి వందనాలు తెలియచేస్తూ. థాంక్యూ శ్రీదేవి ఆంటీ…

 

– భవ్య చారు

Related Posts

1 Comment

Comments are closed.