బాగుందా?

బాగుందా ???

కరీంనగర్ జిల్లాలో ఒక పేరు పొందిన సుప్రసిద్ధ మహిమాన్విత క్షేత్రానికి కొంచం దగ్గరలో మా నానమ్మ వాళ్ళ ఊరు ఉండేది.

అక్కడ ఒక పల్లెలో మా తాతగారు టీచర్ గా పనిచేస్తూ ఉండేవారు మా నాన్నగారికి మెదక్ జిల్లాలో ఉద్యోగం వల్ల కొన్ని కారణాల వల్ల నన్ను మా నానమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న బడిలో అయిదవ తరగతిలో జాయిన్ చేశారు (నేను అయిదవ తరగతి మూడు సార్లు చదివాను) అదెలాగో మళ్లీ చెప్తాను.

నేను తరగతిలో జాయిన్ అయ్యేసరికి మా తాతగారు అక్కడ హెడ్మాస్టర్ ఇంకొక ఇద్దరు టీచర్స్ ఉండేవాళ్లు ఒకతను అదే ఉరు అయితే ఇంకొక అతను పక్కనున్న ఊరునుండివచ్చేవాళ్ళు.

నాకు అంతా కొత్తేం కాదు ఎప్పటికీ చాలా సార్లు తాత తో చాలా సార్లు వెళ్ళాను సో అందరూతెలిసినవాళ్లేకాబట్టితొందరగానేకలిసిపోయారు.
అలా చదువుతూ ఉండగా నాకు జిగ్రి దోస్తు అయ్యింది యశోద ఆమె పేరు సరిగ్గా గుర్తు లేదు కానీ యశోద అని పిలుచుకుందాం..

సరే ఇక మాకు దోస్తానా కుదిరిన తర్వాత మస్తు మాటలు ఆటలు అన్ని అడుకునేటోలం మూడు నెలలు గడిచాయి మూడు నెలల పరీక్షలు కావడం తో ఒంటిపూటబడిమధ్యాహ్నంవరకుఅన్నమాట.

ప్రొద్దున్నే ఇంత తిని అమ్మ పొద్దున్నే వండేది నేను తాత తినేసి వెళ్ళేవాళ్ళం ఒక కూర లేదా చట్నీ అయితే మళ్లీ మధ్యాహ్నం వస్తే ఇంకొక కూర తో మళ్ళీ తినేవాళ్ళం.

సరే పొద్దున్నే తిని పరీక్ష కోసం వెళ్ళాం పుస్తకాల సంచి తీసుకుని పోకుండా ఉత్తగానే పోయినా మా తాత నే కదా ఇగ అందుకే పెన్ను పట్టుకుని పోతే సాలు ఇంకేం అవసరం లేదు పరీక్ష బాగానే పెట్టారు.

చాలా చిన్న ప్రశ్నలు కానీ అప్పుడు మేము చిన్నవాళ్ళం కాబట్టి మాకు అవి పెద్దవే అయినా కొన్నిటికి సమాధానం చెప్పాను కొన్ని మర్చిపోయాం.

ఇప్పడు ఉన్నట్టు అప్పుడు అయ్యో ప్రశ్నలు మిస్ అయ్యాం ఎలా అనే బాధ లేదు అలాగే ఫెయిల్ అయితే ఎలా అని కూడా బాధ లేదు వచ్చింది చెప్పడం, వల్లే వేయడం రాస్తూ చదవడం.

టీచర్స్ చెప్పేటప్పుడు జాగ్రతగా వినడం.పదాలు ఎలా పలుకుతున్నారు అనేది చూసుకోవడంలాంటివిచేసేవాళ్ళం.

ఇక పరీక్ష అయ్యాక అందరూ వెళ్ళిపోయారు మధ్యాహ్నం బస్ కు లెక్కల సారు వెళ్ళిపోయారు, మా తాత ఇంటికి వెళ్లారు ఇక ఉన్న. ఇంకొక అతను విద్య వాలంటీర్ కాబట్టి అతను వెళ్ళిపోయాడు ఇక మేమే ఉన్నాం పిల్లలం కాసేపు ఆడుకున్న తర్వాత మా యశోద ఇంటికి వెళ్తాను అన్నది.

ఎందుకు అని అడిగితే తినలేదు పొద్దుగాల అంటే సరే పో అని నేను చింత చెట్ల కింద పడిన ఒమనగాయల కోసం వెళ్ళాను ఇక అది ఇంటికి పోయింది కాసేపు నేను ఒమనగా యలు ఏరుకుని మల్ల బడిలోకి వచ్చి కూసున్నా.

ఇంతలోపల మా దోస్తు వచ్చింది సంచి తీసుకుని దావే అని నన్ను పిలిచింది నేను దగ్గరికివెళ్ళాను. అది సంచి లోంచి ఒక డబ్బాను తీసింది పసుపు పచ్చ గా మెరుస్తూ కనబడింది ఎందే అది అన్నాను కుతూహలంగా..

ఏమోనే మా దుకాణం ల మా అవ్వ అముద్ది దీంట్లో నుండి ఏమో ఏసుకుంటారు అడెంది సుద్దాం అంటే మా అవ్వ దుకాణం లకు రనియ్యాధు అందుకే ఇప్పుడు మా అవ్వ మా అయ్యాక సద్ది ఇయ్యనికి పోయింది.

గందుకే ఇది పట్టుకొచ్చిన అంది అవునా ఎముందే ఇండ్ల అని అడిగితే ఇదా ఏమోనే నాకు తెల్వకనే తెచ్చిన సుద్దామని అని ఎవలన్న అస్తారే సారు అస్తడేమో మనం చెట్ల సాటుకు పోదాం పా అని చెట్ల సాటుకు పోయినం.

సంచి లోంచి ఆ డబ్బు తీసేసరికి పసుపు కలర్ లో అంతా ఏదో ఇంగ్లీష్ లో రాసి ఉంది కానీ మాకు సదవ రాలే ఇగ దాన్ని మూత తియ్య అంది యశోద గొర్ల తోని మూత తీసిన నేను రేకు మూత తియ్యగానే సిల్వర్ పేపర్ ఉంది.

దాన్ని కూడా మెల్లిగా విప్పినం ఒక్కసారిగా ఘాటు వాసన వచ్చి ఉక్కిరి బిక్కిరి అయ్యాం మేము దాంట్లో నల్లగా గింజలు గింజలు గా ఏదో కనిపించింది దాన్ని చూడగానే ఏందే ఇది అంటే ఏమోనే అందరూ ఏసుకుంటరు మా అవ్వ సుత ఎసుకుంటది అనగానే మనం కూడా బుక్కుదామా అన్నాను.

మరి తెచ్చిన అందుకే కదా అనగానే ఇద్దరం చేతుల్లోకి కొంచం పోసుకుని నోట్లో వేసుకున్నాం అంతే ఒక్కసారిగా కమ్మని వాసన తో పాటు నాలిక కొంచం మండింది అంత అది వేసుకుని మళ్లీ డబ్బా మూత పెట్టి, సంచి లో పెట్టుకున్నాం.

అంతే మా తల గిర్రున తిరిగింది ఒక్కసారిగా దాంతో ఇద్దరం ఒకర్ని పట్టుకోవాలని ఇంకొకరం ఒక వైపు ఉంటే ఇంకొక వైపు వెళ్తున్నాం.

అట్లా గిర్రున తిరుగుతూ ఒకరి చేతులను ఇంకోకరం పట్టుకుని ఏందే తిరుగుతుంది ఉంచల అని అడిగిన అవునే ఉమ్ చు కాని బోరింగ్ దగ్గరికి పోదామే అంది.

దాంతో ఇద్దరం చేతులు పట్టుకుని బోరింగ్ దగ్గరికి పోయినం.అది బోరింగ్ కొడుతుంటే నేను నోరంతా కడుకున్న నేను బోరింగ్ కొడితే అది నోరు కడుక్కుంది. అయినా మా నెత్తి తిరుగుతనే ఉంది.

అయినా మొత్తం కడుక్కున్నం శుభ్రంగా తర్వాత బడి అరుగుల మీద కూర్చున్నాం అంతా తిరుగుతనే ఉంది ఏందే ఇది గిట్ల ఉంది నెత్తి తిరగింది ఇంకా ఎట్లా ఎసుకుoటరే దిన్ని నాకైతే తిన్నది కూడా కక్కిన  అన్నాను.

ఏమోనే నాకేం తెల్సు నీకేం చెప్పలే ఇగ నేను ఇంటికి ఎట్లా పోవాలె అంది ఏడుస్తూ అగొ ఎందుకు గట్ల ఏమయితది.

ఎప్పట్లేక్క పోవే అన్నాను అరె నీకు సమాజ్ అయితలేదే మా అవ్వ సుడకుండా నేను ఇది దెచ్చిన కదా మల్ల మా అవ్వకు తెలుస్తే నా వీపు సుర్లిస్తది అంది ఏడుస్తూ.

మరేం చేతమే ఇదేడ పెట్టలే దిన్ని నా సంచిల మా అవ్వ సూస్తే ఇగ నా పని ఓడిశిందే అంది.అప్పుడే ఉప్పు అమ్మే వాళ్ళ ఎడ్ల బండిలు మా బడి దగ్గరకు వస్తుంటే సుషిన నేను ఒక పని చేద్దామే అన్నాను.

ఏందే అంది అది అగొ ఉప్పమ్మేటోళ్ళు అస్తున్నారు కదా వాళ్ళు బండి ఇడిశినంక  ఎడ్లకు గడ్డి ఎస్తారు కదా ఆ గడ్డిల దాచి పెడదాము. మల్ల రేపు అచ్చి తీసుకుందాం అన్నాను నేను ఉపాయం చెప్తూ..

అరె మల్ల అల్లు తీసుకుంటే ఎట్లనే అంది అబ్బా తీసుకోరు ఇప్పుడే అచ్చిర్రు కదా రేపు ఈ టైం దాక ఇగ వాళ్ళు బండి కట్టరు  మనం అప్పటికి అచ్చి తీసుకుందాం అన్నాను దాన్ని ఓదారుస్తూ.

సరేతి అని వాళ్ళు బండి ఎప్పుడు ఇప్పుతారా  అని ఎదురుచూస్తూ కుసున్నాం ఇగ కొంచం అయినంక వాళ్ళు బండి ఇప్పారు ఎడ్లను కట్టేశారు.

చింత చెట్ల కింద దాంతో మేము ఆ డబ్బా తీసుక పోయి ఎవలు సుడకుండా గడ్డిల ఆ డబ్బాను పెట్టినం. ఇగ ఇంటికి ఎల్లిపోయినం.

ఆడ పెట్టింది మొదలు దాన్ని సూసుడే నా పని అయ్యింది ఎవలన్నా అటూ పోతున్నారా  ఎమన్నా సూస్తున్నారా అని నేను సూస్తునే ఉన్నా, కానీ ఎవలు అటూ దిక్కు పోలేదు.

ఇగ ఆ డబ్బా ను రాత్రి మాత్రం చూడకుండా నిద్రపోయాను, ఇక మళ్ళి తెల్లారిన తర్వాత మళ్ళి బడి కి వెళ్ళేవరకు అదే పని ఇక బడికి వెళ్ళాక మళ్ళా ఇద్దరం కలిసివెళ్ళాం గడ్డిమోపు దగ్గరికి వెళ్లి ఆ డబ్బాను తీసుకుని సంచిలో వేసుకున్నాం.

Human Doubt Icons - Download Free Vector Icons | Noun Project

కానీ..ఇలా ఎన్ని రోజులు చేయాలి అర్ధం కాలేదు. ఒక్క మూడు రోజులు డబ్బాను ఆ గడ్డిమోపులో దాచడం మళ్ళి తెల్లారి వెళ్ళడం తీసుకుని సంచిలో వేసుకోవడం ఇలా జరుగుతూనే ఉంది ఇక మా ఇద్దరికీ విసుగు వచ్చింది.

నేను యశోదతో ఏందే ఇది ఇంతగనం భయపడుకుంటా దాన్ని అడ పెట్టుడు ఏందే మరి దాన్ని ఏం చేద్దాం అంటే ఎవలకు ఇచ్చినా నికేక్కడిది అనీ మా అవ్వకు చెప్తారు.

ఎట్లా అంది దానికి నేను ఏం లేదే ఒకటే పని చేద్దాం అంటే అది నన్ను చూసింది ఏంది అన్నట్టుగా అబ్బా మనమే దాన్ని సాపు చేద్దాం అన్నా,

ఆ సాల్తి ఒక్క సారికే ఎలేల్కల పడ్డావు ఇగ మల్ల రోజు ఎసుకుంటావా అంది ఎక్కిరిస్తున్నట్టు  అబ్బ ఒక్క సారి అట్లా అయ్యింది నాకు అలవాటు ఎమన్నానా రోజు కొద్ది కొద్దిగా ఎసుకుందాం అన్నాను, అది కూడా ఇదేదో బాగుందనట్టుగా సరే అనుకున్నాం మరి ఎసుకుంటే ఎవరికీ తెల్వకుడదు కదా మరి ఎట్లా అనుకుంటూ..

దానికో ఉపాయం కూడా ఆలోచించిన నేను మా బడి పక్కనే పొలాలకు వెళ్ళే దారి ఎవరిదో పొలం కూడా ఆ పక్కనే ఉంది.

కాబట్టి ఇద్దరం సంచీలు బడిల పెట్టకుండా భుజాలకు ఏసుకుని యశోద పొలం కాడికి పోతున్నాం అని మా తాతకు చెప్పి అక్కడికి వెళ్లి కూర్చున్నాం .

ఇక ఇద్దరం మొహాలు చూసుకుని సంచి లో నుండి డబ్బా తీసుకుని, మూత తీసి చేరింత  చెయ్యిల వేసుకుని నోట్లో వేసుకోబోతుంటే..

అట్లా కాదే అని యశోద పెదవి కింద వేయించింది తనతో మొదట మళ్ళి మంట గా అనిపించింది. మళ్ళి తల తిరిగింది కానీ కొద్దిసేపు దాన్ని తట్టుకుని ఊరుకున్నాం..

కాబట్టి కొద్దిసేపు అయ్యాక యశోద నా వైపు తిరుగుతూ నన్ను చూసి నన్ను అడిగింది “ బాగుందా “ అని ..

నేను బాగుంది అని చెప్పాను దాంతో ఇక రోజు అక్కడికి వెళ్ళడం దాన్ని వేసుకోవడం కాసేపు కూర్చోవడం తిరిగి ఇంటికి రావడం ఇలా ఆ డబ్బా అయిపోయేవరకు కొనసాగింది.

ఆ డబ్బా మాకు రెండు నెలలు వచ్చింది చివరికి అయిపోయే రోజు మేము ఎంతగా ఎడ్చామో మాకే తెలుసు.. దాని తర్వాత మేము ఎప్పుడూ మళ్ళి దాని జోలికి పోలేదు..

 

Related Posts

3 Comments

Comments are closed.