బక్కపలచటి కుర్రాడు -కథానిక

బక్కపలచటి కుర్రాడు -కథానిక

మియాపూర్ మెట్రో పార్కింగ్ లో ‘ఆర్మ్ డి’ పార్కింగ్ కొంచెం విసిరేసినట్టుంటుంది. తక్కువ మంది పార్కింగ్ చేస్తారు. అక్కడ ఆ కుర్రాడిని తరచూ చూస్తుంటాను. తనేమిటో తన పనేమిటో అన్నట్టుంటాడు. చేతిలో ఓ పుస్తకం తప్పనిసరిగా ఉంటుంది. బక్కపలచగా నల్లగా ఉంటాడు.

నేను పార్కింగ్ మోటార్ సైకిల్ పెడుతుంటే ఎవరో వ్యక్తి తన బండి తీస్తూ అతనితో వాదిస్తూ కనిపించాడు. నెమ్మదిగా ఉండే కుర్రాడిపై అతనెందుకు ఇంత మండిపడిపోతున్నాడు అనుకుంటూ దగ్గరకు వెళ్ళాను.

“నువ్వెవరివి నా ఫోన్ నంబర్ అడగటానికి” ఆ అపరిచిత వ్యక్తి అరుస్తున్నాడు.

“ఏమయింది సార్” కొంచెం కూల్ చేద్దామని అడిగాను.

“నా బండి నిన్న పార్క్ చేశాను. ఇవాళ తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఎంత కట్టాలో చెప్పు. కడత అన్న. మధ్యలో ఫోన్ నంబర్ చెప్పమంటున్నాడు. నా నంబరెందుకు చెప్పాలి సర్..మీరు చెప్పండి”

అర్థమయింది. తన్నుమానిస్తున్నాడని ఆ వ్యక్తికి కోపం వచ్చింది.

“సార్, నిన్ననే ఇక్కడో బండి పోయింది. మీ ఫోన్ నంబర్ కి పార్కింగ్ రిసీట్ వస్తుంది కాబట్టి నంబర్ అడిగి తెలుసుకోమని చెప్పారు సార్ మా సార్లు మాకు

ఒకరిది జవాబు
ఒకరిది రుబాబు.
ఇద్దరూ తెమిలేట్టులేరు.
నేనిక రంగంలోకి దిగక తప్పలేదు.

“వదిలేయండి బాస్. ఆ కుర్రాడి ఇబ్బందిని అర్థం చేసుకుని మీ ఇబ్బందిని కాసేపు పక్కనపెట్టి మీ నంబర్ చెప్పి వెళ్లిపోండి” ఏ కళనున్నాడో శాంతించాడు అతను. వెళుతూ ఒక చూపు చూశాడు ఆ కుర్రాడిని అతను. నిను వదిలిపెట్టననే అర్థం కనపడింది అందులో.

“ఎవరు అడగడం లేదు. నువు మాత్రమే ఎందుకు” అంటూ అతనివంక చూశాను.

కళ్ళు కన్నీటి కొలనులవుతుండగా ఆ కుర్రాడు మొదలెట్టాడు.

“సార్, నాది చిన్న ఉద్యోగం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఉద్యోగం పోతుంది. ఇంటర్మీడియట్ తో ఆగిపోయిన నా చదువు ముందుకుపోవాల్నంటే నా ఉద్యోగాన్ని నేను జాగ్రత్తగా చేయాలి. కస్టమర్లకు కోపమొచ్చినా ఫరవాలేదు, నేను అలా చెక్ చేసుకోకతప్పదు.

‘వీడికి చెప్పేదేంది’ అనుకునే ఆ సార్ లాంటి వాళ్ళూ ఉంటారు. ఇట్లా అడుగకనే ఓ బండి పోయింది మొన్న.. ఆ పార్కింగ్ పిలగాడి బాధ, బండి ఓనర్ బాధ ఎవరు తీరుస్తారు.. కష్టమైనా నా డ్యూటీ కరెక్ట్ చేసుకోవాలి కదా సర్.”

ఏమంటాను.. నా దగ్గర సమాధానం లేదు. కానీ అతని మాటల్లోని చిత్తశుద్ధి నన్ను కట్టిపడేసింది. చదువుకోవాలన్న అతని కోరికగ ముచ్చటగా అనిపిస్తే అందరం ఇంత నిక్కచ్చిగా డ్యూటీ చేయగలిగితే సంస్థలెంత బాగుపడతాయన్న ఆలోచన నాలో తళుక్కుమంది.

అతను మాత్రం ఎలాంటి ఎమోషన్ లేకుండా నా పార్కింగ్ ఫీ అమౌంట్ వసూలు చేయటంలో నిమగ్నమయిపోయాడు. బక్కపలచటి అతని శరీరం సంధించిన శరమై విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది.

– సి.యస్.రాంబాబు

Related Posts