బంధం

ఆ.. ఆ.. యా .. ఆ ..ఆ ఆ  అనే అరుపులు వినగానే వస్తున్నా అంటూ గబగబా కంచం పట్టుకుని వచ్చింది సావిత్రమ్మ  నేను వింతగా చూసాను ఆ అరుపులు వచ్చిన వైపుగా అక్కడ ఒక గదిలో నుండి ఎవరో అరుస్తూన్నారు అని అనిపించింది నాకు.

కానీ, వెళ్ళాలి అంటే అంతా కొత్త కాబట్టి లోపలికి వెళ్ళే దైర్యం చేయలేక పోయాను, ఎందుకంటే వాళ్ళ అనుమతి లేకుండా అలా వెళ్ళడం మర్యాద కాదు, వాళ్ళు ఎంత దగ్గరి చుట్టాలు అయినా వెళ్ళక పోవడం ఉత్తమం అని మా పెద్ద వాళ్ళు మాకు నేర్పించారు.

కాబట్టి ఇంతలోనే అర్చనా అక్కడ పచ్చడి ఉంది తీసుకుని రా అంటూ పిలిచింది అత్తయ్య ఆ తెస్తున్నా అంటూ గిన్నె తీసుకుని లోపలికి వెళ్ళాను. అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్య పోయాను నేను.

అక్కడ ఒక ముప్పై ఏళ్ల  అమ్మాయి కూర్చుని ఉంది చూడడానికి అలా కనిపిస్తున్నా ఇంకా ఎక్కువే ఉంటుందేమో అనిపించింది నాకు ఎందుకంటే వెంట్రుకలు అన్ని తెల్లగా అయ్యాయి. (తెల్లగా అయితే ఎక్కువ వయస్సు ఉన్నట్టా అని అనకండి) తనకి అత్తగారు ముద్దలు కలిపి పెడుతూ ఉంది.

పచ్చడి వెయ్యి అంది నేను పై నుండి పచ్చడి వేసాను దానికి అత్తగారు నా ఆలోచనలను పసిగట్టినట్టుగా దీనికి పప్పులో పచ్చడి కలపాలి, కారంగా ఉండాలి అని అంటూ ముద్దుగా విసుక్కుంది.

నాకు అంతా అయోమయంగా అనిపించింది.  ఏంటి అత్తయ్య ఇలా ఉంది అని అడగాలని నోటి దాకా వచ్చింది కానీ అడగలేక పోయాను అందుకే అత్తయ్య తిరిగి నిజాన్ని నాకు చెప్పింది.

తను నా మూడో కూతురే… ఇద్దరు అమ్మాయిలు.  ఒక అబ్బాయి తర్వాత ఇది పుట్టింది పుట్టగానే వాళ్ల నాన్నగారికి ప్రమోషన్ కూడా వచ్చింది. ఇక అంతా లక్ష్మి పుట్టింది అని అన్నారు.

కానీ నాకు మాత్రం దీన్ని బాగా చదివించాలని ఉండేది దాంతో స్కూల్ లో వేసాను అప్పుడే ఇంగ్లిష్ మీడియం లో వేసాను, నేను అనుకున్నట్టే పాప బాగా చదివేది నాకు చాలా కోరిక నా కూతుర్ని కలెక్టర్ గా చూడాలి అని అందుకే నేనే దగ్గర ఉండి చాలా బాగా చదివించేదాన్ని…

రాత్రి పగలు అనేది లేకుండా బాగా అంటే బాగా ఎప్పుడూ మొదటి స్థానం లో వచ్చేది. అలా పది అయ్యాక ఇక కాలేజి లో జాయిన్ చేయాలి.

ఊర్లో చూస్తే కాలేజి లేదు మరి ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు మా మరిది బెంగుళూరు లో ఉన్నది గుర్తుకు వచ్చి  అక్కడ చదివించాలి అని అనుకున్నాం. అతన్ని అడిగితె అతను కూడా ఒప్పుకున్నాడు.

తన ఇంట్లో పెట్టుకోవడానికి మా ఆయనది గవర్నమెంటు  ఉద్యోగం కాబట్టి డబ్బుల విషయంలో తేడా రాకూడదు అని చాలా జాగ్రత్తగా అన్ని మాట్లాడి సవాలక్ష జాగ్రత్తలు చెప్పి పంపించాను.

ఎప్పుడూ నా కూతుర్ని వదిలి ఉండలేని నేను తనని కలెక్టర్ గా చూడాలనే ఒకే ఒక్క కోరికతో కష్టం అయినా ఏడుపుని దిగమింగి పంపించాను..

కొన్ని రోజులు తనని వదిలి ఉండలేక ప్రతీ వారం వెళ్ళి చూసేదాన్ని, వెళ్ళినప్పుడల్లా మా మరిది వాళ్ళకు ఉప్పు తప్ప మిగిలిన సామాను మొత్తం పట్టుకు వెళ్ళేదాన్ని.

ఎందుకంటే నా కూతురు ఉంటుంది కదా తను కూడా తింటుంది కదా అని అలా ఒక సంవత్సరం  గడిచింది….

సెలవుల్లో తీసుకు వద్దాం అని వెళ్ళేసరికి నా కూతురికి జ్వరం అని తెల్సింది. కంగారు పడి నేను ఏమైంది అని అడిగాను దానికి మా మరిది గారు ఏం లేదు వదినా చిన్న జ్వరమే మరీ నువ్వంతలా కంగారు పడకు.

ఇక తనని అక్కడ ఉంచలేక, అదేరోజు సాయంత్రం ఇంటికి తీసుకోచ్చాము. ఆ వచ్చిన జ్వరం ఎంతకి తగ్గడం లేదు. దాంతో మా ఫ్యామిలీ డాక్టర్ గారిని పిలిచి చూపించాము.

అతను కొన్ని మందులు ఇచ్చేసరికి, జ్వరం కాస్త తగ్గు ముఖం పట్టింది. జ్వరం కాస్త తగ్గు ముఖం పట్టడంతో, స్నానం చేయిద్దాం అని, తన వొంటిమీదున్న బట్టలు తీయబోయాను.

దాంతో ఒక్కసారిగా నా కూతురు ఏడుస్తూ, వద్దు, వద్దు అని అరిచింది గట్టిగా… అమ్ములు నేనేరా…. ఎందుకు అలా భయపడుతున్నావు. కాస్త ఒళ్ళు తుడుస్తాను అని అన్నాను.

నేను, నేను, నేను తుడుచుకుంటాలే అని తను శరీరం నిండా బ్లాంకెట్ కప్పుకుంది. సరే తనకి ఇష్టం వచ్చినప్పుడే చెయ్యని అని అనుకున్న నేను.

ఇక బలవంత పెట్టలేక పోయాను. జ్వరం తగ్గినా కూడా, స్నానానికి వెళ్ళినప్పుడు గది తలుపులు అన్ని పెట్టుకునేది.

ఎందుకు అలా చేసేదో నాకు అర్ధం కాలేదు  చిన్నప్పుడే కాదు అది కాలేజికి వెళ్ళేవరకు కూడా నేనే రోజు నలుగు పెట్టి స్నానం చేయించేదాన్ని.

కానీ ఇప్పుడు వచ్చి రెండు నెలలు అవుతున్నా స్నానం చేయిస్తా అంటే వద్దు వద్దు అంటూ భయపడడం మొదలు పెట్టింది.

కనీసం తల స్నానం చేయిస్తా అంటే కూడా వద్దు అంటూ తలుపులు వేసుకునేది. ఇక నాకు అనుమానం మొదలయ్యింది ఇది ఇలా ఎందుకు చేస్తుందని.

దాంతో ఒక రోజు అది స్నానానికి వెళ్ళక ముందే నేను గదిలో ఉండి పోయాను. అది స్నానానికి  వెళ్ళగానే తలుపు సందులోంచి చూసాను తల్లిని అయినా తప్పలేదు.

దాన్ని అలా చూడగానే నాకు ఏమైందొ తెలియదు నాకు చెమటలు పడుతున్నాయి, చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. ఇక అక్కడ నిలబడలేక ఎలాగో వెళ్ళి మంచం పై కూలబడ్డాను. ఆసలెం జరిగింది ఏం జరగబోతుందో అసలు దాని శరీరంపై ఉన్నవి ఏంటి నాకు ఇంకా నమశక్యం అవ్వడం లేదు.

ఇంతలో అది బాత్రుం లో నుండి వచ్చింది అక్కడ నన్ను చూసి లోపలికి వేళ్ళ బోయింది కానీ నా మొహం చూసి నాకు అంతా తెలిసింది అనుకుందో ఏమో కానీ అక్కడే నిలబడి పోయింది.

వెంటనే నేనెళ్ళి తను చుట్టుకున్న పాత బట్ట తీసేసాను. దాని శరీరంపై అన్ని కోసినట్టుగా మరకలు, తెల్లని దాని శరీరం మచ్చలతో, మరకలతో నిండి పొయింది మొహం ఒక్కటే కాస్త బాగుంది అంతే.

చందమామలా ఉండే నా బిడ్డ శరీరాన్ని చిద్రం చేసినట్టుగా అది కూడా జాగ్రత్తగా కోసినట్టు ఎంతో ఇష్టపడి చేసినట్టుగా ఒక్కో గుర్తు ఒక్కో అక్షరంగా ఉంది.

అక్కడ నాకు చదువు రాదు కాబట్టి నేనది చదవలేకపోయాను, ఇక నా కూతురు నన్ను పట్టుకుని ఒకటే ఏడుపు నేను కూడా ఏడుపు ఆపుకోలేక పోయాను. ఇద్దరం అలా ఏడుస్తూ ఎంత సేపు ఉన్నామో తెలియలేదు.

నాకు నా మరిది పై అనుమానం వచ్చింది బాగా చూసుకుంటారు అని పంపితే తన కూతురిలా చూసుకుంటాడు అని పంపిస్తే, కన్న తండ్రిలా కాపాడాల్సిన బాబాయి తనని ఇలా చేసాడు అని.

భగవాన్… ఈ సంగతి ఎవరికీ చెప్పాలి, ఎలా చెప్పాలి కామం తో కన్ను మిన్ను కానని ఆ ముర్ఖునికి నా కూతురే దొరికిందా అనవసరంగా వాడి చేతిలో పెట్టి వచ్చానా అని అనుకుంటూ కంటికి మింటికి ఏక దాటిగా ఏడ్చాను.

అయినా ఏంటో తెలుసుకుందాం అని నా కూతుర్ని అడిగాను అది వెక్కిళ్ళ మధ్య అసలు విషయం చెప్పడం తో నేను అవ్వాక్కయ్యను…

అసలు అలా జరుగుతుందని అసలు ఇలా చేస్తారు అని ఎవరు అనుకోరు ఎక్కడో ఎవరో చెప్తుండగా కూడా నేనది ఎప్పుడూ వినలేదు. అదేంటంటే, నా కూతురు చదివేది ఆడవాళ్ళ కాలేజి లోనే…

వాళ్ళు నా కూతురి తెలివి తేటలు, మంచిగా చదవడం అందరూ తననే మెచ్చుకోవడం చూసి తన మిద పగ పెంచుకుని తనని ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు ఆరు నెలల నుండి తనని టార్చర్ తో పాటూ అత్యాచారం చేస్తున్నారు.

ఇది ఎవరికైనా చెప్తుందేమో అని దాని బట్టలు విప్పి కేమెరాలు అద్దెకు తెచ్చి మరీ ఫోటోలు తీసి ఎవరికైనా చెప్తే లేదా పిర్యాదు చేస్తే ఫోటోలు అన్ని గోడలపై పోస్టర్లు వేస్తాం అని బెదిరించారంట.

ఇదంతా చెప్పి చాలా ఏడ్చింది బాబాయికి కూడా చెప్పలేక పోయింది భయం వల్ల. నేను అనవసరంగా మా మరిది గారిని అనుమానించాను. విషయం తెలిసిన నా భర్త, నా మరిది ఇద్దరూ వెళ్లి వారి అంతు తేలుద్దాం అన్నారు

కానీ నేను ఆలోచించాను వాళ్ళు చేసేది ఎదో చేసారు జరగాల్సిన ఘోరం జరిగి పొయింది. ఇప్పుడు వారిని బయటకు లాగడం వల్ల వారి జీవితం నాశనం అవ్వడం ఇష్టం లేక వద్దు అనడంతో వాళ్ళు కూడా అలోచించి ఊరుకున్నారు.

ఇక దీని వల్ల సరిగ్గా చదవలేక మౌనంగా ఎప్పుడూ గది లోనే కూర్చునేది, ఇంట్లో కొన్నాళ్ళు మౌనం రాజ్యం ఏలింది మాట్లాడడం తగ్గించాము. కానీ, తన మనసు మూగ పోయింది, అలాగే తన గొంతు కూడా మాట్లాడడం మర్చి పొయింది.

కలెక్టర్ కావాలనుకున్న నా కూతురు ఇప్పుడు కనీసం మాట్లాడలేదు ఎప్పుడూ గోదారిలా గలగలా మాట్లాడే నా అందాల యువరాణి మౌనముని లా మారింది.

ఇక మెల్లిమెల్లిగా  తాను మానసికంగా కూడా దెబ్బతిని ఏం చేస్తుందో కూడా తెలియదు అన్నీ నేనే చూసుకోవాలి.

కష్టమే, కానీ తనని నేను ఉన్నంత కాలం ఇదిగో ఇలానే కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని చెప్పింది అత్తయ్య. విన్న నా మనసు ద్రవించి పొయింది.  

అమ్ములు తినడం అయిపోయింది. కంచం తీసుకుని అత్తయ్య వంట గది లోకి నడిచింది నేనూ తన వెంటే నడిచాను సాయంత్రం తిరిగి వెళ్ళి పోయాం ఇంటికి..

పది రోజుల తర్వాత మాకు మా చిన్నత్త చనిపోయింది అని తెలిసి చాలా భాద పడ్డాము ఇక అమ్ములు పరిస్థితి ఏంటని, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది తానూ ఒంటరిగా వెళ్ళలేదని అన్నట్టుగానే తానూ తనతో పాటు తన కూతుర్ని కూడా తీసుకుని వెళ్ళి పొయింది.

అసలు సంగతి తెలిసి నేను వాళ్ళిద్దరి బంధానికి  ఆశ్చర్య పోయాను విషయం ఏంటంటే వంట చేస్తుండగా తన చీర అంటుకుంది. తాను ఇక బ్రతకలేను అని తెలిసిన అత్తయ్య తన కూతుర్ని కూడా కౌగిలించుకుంది.

అన్నీ మంచిగా ఉన్న వారిపైనే ఏవేవో జరుగుతున్నాయి ఇక అమ్ములు ని ఎవరేం చేస్తారో అనే భయం తో తనతో పాటే తీసుకుని వెళ్ళింది ఆ మహాతల్లి.

అలా ఒక కుసుమం నెల రాలింది ఎన్నో ఆశలు పెట్టుకుని చదువుకుని కలెక్టర్ గా అవ్వాలనుకున్న తన కలలు అన్ని కల్లలు గా మారాయి.

తన కూతుర్ని ఉన్నతంగా చూడాలనుకున్న ఒక మాతృమూర్తి తన చేతులతో తనని అంతం చేసింది. అప్పటికే అక్కలకు పెళ్ళిళ్ళు అయిపోయి, తండ్రికూడా చనిపోవడంతో తోబుట్టువులు ఎవరూ కూడా తనని చూడరు అనాధల మారుతుందని భావించి, తొమ్మిది నెలలు మోసి కన్న తన కూతుర్ని చివరికి తనతో పాటే తీసుకుని వెళ్లి పొయింది.  

ఎంత ఆస్థి ఉన్నా, మనం ఎంత బాగున్నా, ఎంత బాగా చదివినా పర, పరిసరాలు, పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నా కూడా ఒక్క అసూయ, స్వార్ధం అనే రెండు ఉన్నంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి..

అలాగే ఈ కాలేజీల్లో, స్కూల్ లోనూ ర్యాగింగ్ ఎలా ఉండేదో ఎంతలా వెర్రి తలలు వేసేదో దీన్ని బట్టి అర్ధం అవుతుంది. ఇలాంటివి ఇప్పటికి ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి జరుగుతూనే ఉన్నాయి కాదంటారా ???

-భవ్య చారు

Related Posts

1 Comment

Comments are closed.