భారతి చివరి భాగం

 

భారతి చివరి భాగం

 

మనోజ్ వెళ్ళిన తర్వాత భారమైన మనసుతో, హృదయం తో అందరూ ఇంటికి వచ్చారు, ఇల్లంతా బోసి పోయినట్టుగా, బావురుమన్నట్టుగా కనిపించింది అందరికి. ఇన్నాళ్ళు నవ్వులతో, కేరింతలతో, సంతోషంగా ఉన్న ఇల్లు ఇప్పుడు మనోజ్ వెళ్ళిపోవడం తో ఒక్కసారిగా సంతోషం ఆవిరి అయినట్టుగా అందరికి దిగులు ఆవరించింది.

భారతికి మనసు బాధగా ఉంది, మనోజ్ ను వెళ్ళమని అన్నది కాని తను వెళ్ళాక మాత్రం ఏదో కోల్పోయినట్టుగా, శరీరం లోంచి సగ భాగం వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఒళ్ళంతా నిసత్తువగా, నీరసంగా అసలు ప్రాణం లేనట్టుగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు ప్రేమించిన వాడి కోసం ఎదురుచూసింది, అతని కోసం ఎంతో కష్టపడి  వెతికింది, ఆశగా ఎదురుచూసిన తనకు ఇక రాడు అని అనుకుంటున్నా సమయం లో తన జీవితంలో ప్రవేశించాడు. తానూ కోరుకున్న వాడు తన కోసం వచ్చాడు.

అనే సంతోషం లో అతనికి మాట ఇచ్చింది. తనకు కూడా దేశానికి సేవ చేయాలనీ ఉంది. చేసింది కూడా కానీ ఇంకో ప్రాణికి జన్మనిస్తున్నా అనే విషయం తెలిసాక , అతను వెళ్తాను అంటే సగటు ఆడపిల్లగా బాధపడినా, మళ్ళి వస్తాను. అనే అతని మాట వల్ల తన భర్త వెళ్ళడానికి ఒప్పుకుంది భారతి.

ఒక భార్యగా, ఒక ఇల్లాలిగా, ఒక ప్రియురాలిగా, తను అతనికి అండదండగా, అతని ఆదర్శాలకు విలువ ఇస్తూ, తన ఆశయాన్ని తీర్చాలి కానీ కాబోతున్న తల్లిగా, ఒక ప్రాణికి  జన్మ నివ్వబోతున్న తను ఇలా నీరసంగా బాధగా ఉండడం వల్ల తనను నమ్ముకున్న వృద్దులు అత్తామామలు, తల్లిదండ్రులు తనని చూసి భాదపదకూడదు.

వాళ్ళకు తానె ధైర్యం చెప్పాలి, తానె ఒక కొడుకు లాగా వాళ్ళను చూసుకోవాలి, ఒక మేజర్ భార్యను అయిన నేను ఇలా ఆలోచించడం ఏంటి అని భారతి రకరకాలుగా అలోచించిన తర్వాత , ఇక నేను ఇలా ఉండకూడదు, సంతోషంగా ఉండాలి, వాళ్ళను సంతోష పెట్టాలి అని అనుకుని బెడ్ పై నుండి లేచింది.     

********

9 నెలలు గడిచాయి భారతి పండంటి బాబుకు జన్మనిచ్చింది . ఆ విషయం ఫోన్లో మనోజ్ కి వీడియో కాల్ ద్వారా చెప్పారు . వీడియో కాల్ లో అబ్బాయిని కూడా చూపించారు. ఇరవై ఒక్క వ రోజుకి వస్తాను అని చెప్పాడు మనోజ్……

అలా 20 రోజులు గడిచాయి 21వ రోజు రానే వచ్చింది .  ఇల్లంతా పూలతో అలంకరించి బాబు బారసాల కి అంతా సిద్దం చేశారు అన్ని పనులు జరుగుతుండగా ,బాబుని ఉయ్యాలలో వేసే టైం అయిందని పంతులుగారు హడావుడి పడుతూ పిలుస్తున్నారు .  అయ్యా గారు ఇంకా బాబు తండ్రి రాలేదు. వస్తూనే ఉంటారు.

కాసేపు ఆగండి అని చెప్పారు. దానికి పంతులు గారు అయ్యా ఇది మంచి ముహూర్తం దాటిపోతే మళ్ళీ రాదు. పర్వాలేదు భారతమ్మ పక్కన పంచె వేసుకొని అతని తండ్రి అన్నట్టుగా ఉయ్యాలో వేయవచ్చు అని చెప్పాడు పంతులుగారు.

సరేనని మంచి ముహూర్తం దాటిపోతుందని, మనోజ్ వచ్చేసరికి లేట్ అవుతుంది. అని అనడంతో సరేనని అత్తమామలు, తల్లిదండ్రి , భారతి కలిసి ఉయ్యాలలో వేసారు.. బాబుకి పేరు పెట్టాలి. అమ్మ ఏ పేరు పెడతారు? అని అడిగాడు పంతులుగారు. అయ్యా బాబు పేరు అభిమన్యు అని పెడదాం అన్నది భారతి.

సరేనమ్మా పళ్ళెం లో అదే పేరు రాయండి అని అనగానే బియ్యంలో ఆ పేరు రాసి , బాబు చెవిలో మూడుసార్లు అభిమన్యు ,అభిమన్యు, అభిమన్యు  అని పిలిచింది భారతి. ఆ తర్వాత తల్లి,తండ్రి అత్త ,మామ అందరూ బాబు పేరును మూడుసార్లు పలికారు. ఇంతలో బయట ఒక జీపు , ఆంబులెన్స్ రెండు వచ్చి ఆగాయి. ఎవరో వచ్చారని చూద్దామని వెళ్ళిన భారతి తండ్రి అందులో నుండి దిగుతున్న పోలీసులను చూడగానే, గాబరాగా ఏంటి? ఏమైంది? అని అడిగారు.

ఏం లేదండి మీరు ముందు కూర్చోండి , గాబరా పడకండి, ధైర్యంగా ఉండండి. అని లోపలికి వచ్చి అందర్నీ చూస్తూ అమ్మ అందరు స్థిమితంగా ఉండండి, దయచేసి మీరు పానిక్ అవ్వద్దు, అని అందర్నీ చూస్తూ ఇక్కడ భారతి అంటే ఎవరమ్మా ? అని అడిగాడు పోలీస్ ఆఫీసర్ . నేనేనండి అంటూ ముందుకు వచ్చింది భారతి.

 

అమ్మా మీ వారు యుద్ధం లో అమరులు అయ్యారు. ఇది మీకు బాధగా ఉన్నా, మన దేశ రక్షణలో అమరులయ్యారు అందుకు మనం సంతోషించాలి, అంత గొప్పవారు మీ భర్త కావడం మీ అదృష్టం తల్లి.

అమ్మా మనోజ్ సార్ అమరులు అయ్యే ముందు ఆసుపత్రిలో మీకు ఇమ్మని ఈ కవర్ ఇచ్చారు  అని అంటూ కానిస్టేబుల్ కవర్ ను భారతి చేతిలో పెట్టాడు.

వణికే చేతులతో ఆ కవర్ తీసుకున్న భారతి, రాబోతున్న దు:ఖాన్ని ఆపుకుంటూ, దాన్ని విప్పింది. మనోజ్ చివరిగా రాసిన ఆ అందమైన ఆఖరి పదాల వెంట భారతి కన్నీళ్ళ కళ్ళు పరుగులు తీసాయి. అందులో భారతి,  నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోతున్నా , నన్ను క్షమించు నేను యుద్ధంలో ఓడిపోయాను,  నన్ను శత్రువులు పట్టుకొని చిత్రహింసలు చేశారు, దేశం గురించి చెప్పమని అడిగారు. కానీ నేను ఒక్కసారి కూడా నోరు మెదపలేదు. నన్ను చంపాలని అంటున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు.

నిన్ను, బాబు నీ , అమ్మ , నాన్నలని,  అత్తయ్య, మామయ్య ని  బాగా మిస్ అవుతున్నాను. మీ అందర్నీ బాగా చూసుకోవాలని అనుకున్నాను. కానీ నేను రాలేకపోతున్నా, అందుకు నన్ను మన్నించు , నీకు ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకోలేక పోతున్నా, మన బాబు ని మాత్రం నువ్వు బాగా చూసుకో, వాడిని ఒక భాద్యత కలిగిన ఉత్తమ పౌరుడిగా పెంచు, ఇదే నా చివరి కోరిక.

అమ్మ , నాన్న ,జాగ్రత్త.  నువ్వు ఇంకా జాగ్రత్త . నన్ను చూసి నీ భర్త శత్రువుల చేతిలో చిక్కి రహస్యాలు చెప్పకుండా వీరమరణం పొందాడు. అని గర్వంగా చెప్పు. నువ్వు ధైర్యంగా ఉంటూ అందర్నీ చూసుకోవాలి, నా వాళ్ళ, ని వాళ్ళ బాధ్యతలు అన్ని నికే వదిలేసి వెళ్తున్నా, జాగ్రత్తగా ఉంటావు కదూ… బి బ్రేవ్ భారతి, కన్నీళ్ళు వృధా చేయకు, భారతి అని పేరు సార్ధకం చేసుకో , కర్తవ్యాన్ని నిర్వర్తించు.

నా భర్త నాకే సొంతం అనకుండా నువ్వు నా ఆశయాలను గౌరవించావు, నువ్వు వీరుడి భార్యవి, అలాగే నా కొడుకు కూడా  దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుడు అవ్వాలి. ఇదే నా కోరిక, తీరుస్తావు కదూ, దేశం నీకేమిచ్చిందని కాకుండా, దేశానికి నేను ఏమి ఇచ్చాను. అని ఆలోచించు భారతి, నా ఆశయాలను నేరవేరుస్తావని ఆశిస్తూ… మనోజ్ జైహింద్ అని ఉత్తరంలో ఉంది.

ఇంతలో నలుగురు కానిస్టేబుల్స్ చెక్క పెట్టె మోసుకుంటూ వచ్చారు. అందులో మనోజ్ ప్రశాంతంగా నిద్ర పోతున్నట్టుగా గుండెల పై చేయి వేసుకుని నిశ్చింతగా ఉన్నాడు. అది చూసిన తల్లిదండ్రులు ,అత్త మామ భోరున విలపిస్తూ అతని మీద పడిపోయారు.

కానీ భారతి కళ్ళ నుంచి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. అమ్మ భారతి మనోజ్ ఎంత పని చేశాడు తల్లి,  ఇలా జరిగి పోయింది . నీ బ్రతుకు బండ బారి పోయింది, అమ్మ భారతి, చూడమ్మా, చూడు అదేంటమ్మా ఏడవడం లేదు? ఎందుకు అమ్మ భారతీ, నీ గుండెలో ఉన్న బరువు దింపుకో తల్లి అని అన్నది తల్లి.

దానికి భారతి తల్లి వైపు చూస్తూ అమ్మా , నా భర్త దేశం కోసం ప్రాణాలు అర్పించారు .అతను శత్రువుల చేతిలో చిక్కినా, దేశ రహస్యాలు చెప్పకుండా, మన దేశం గురించి పోరాడి వీర మరణం పొందాడు. దానికి ఆనంద పడాలి కానీ ఏడవడం ఎందుకమ్మా, నా భర్త స్థానం లో దేశానికి సేవ చేయడానికి నేను, నా కొడుకు సిద్దంగా ఉన్నాం, ఉంటాం, మా జీవితాలు దేశానికే అంకితం అని అంటూ మనొజ్ పార్థివ దేహానికి సెల్యూట్ చేసింది భారతి… దేశం కొసం, ప్రాణాలు కోల్పోయిన మన వీర జవాను లకు ఈ కథ అంకితం…

– భవ్య చారు

Related Posts

2 Comments

Comments are closed.