భరించు.. భరిస్తూనే ఉండు

భరించు.. భరిస్తూనే ఉండు

 

అమ్మా తాత కొట్టాడు

అమ్మా భరించు,

అమ్మ నాన్న తిట్టాడు

భరించు అమ్మ,

అమ్మ అన్నయ్య కొట్టాడు

భరిచు అమ్మ,

అమ్మ తమ్ముడు నా పుస్తకాలు లాక్కున్నాడు

భరించు అమ్మ,

అమ్మ బళ్ళో మాస్టారు దగ్గరగా పిలిచి చేతులు వేసాడు.

అవునా అయ్యో పరువు పోతుంది తల్లి భరించు.

అమ్మా కాలేజీలో ఎవడో ర్యాగింగ్ చేస్తున్నాడు.

అమ్మో నలుగురికి తెలిస్తే నవ్వుతారు తల్లి కొద్ది కాలం భరించు,

అమ్మా ఆఫీస్ లో వెధవ వెకిలి చేష్టలు చేస్తున్నాడు.

అయితే ఉద్యోగం మానెయ్యి తల్లి పెళ్లి చేస్తాం.

అమ్మా నా మొగుడు తిట్టాడు

భరించు అమ్మ,

అమ్మా నా మొగుడు కొట్టాడు.

అవునా తల్లి పెళ్లి అయ్యి ఆరునెలలే అయ్యింది, భరించి ఉండు తల్లి.

మగాడు ఏం చేసినా, మీరు నోరు మూసుకుని, కళ్ళు అప్పగించి చూస్తూ ఉండాలి తల్లి ,

శరీరం, గుండె రాయి చేసుకుని అడది రాయిలా ఉండాలి. మా

రాలి తల్లి భరించు. పిల్లల కోసం భరించాలి తల్లి,

అమ్మా నా మొగుడు నాకు సిగరెట్ వాతలు పెడుతున్నాడు.

భరించు తల్లి,

అమ్మా బెల్ట్ తో కొడుతున్నాడు.

భరించు తల్లి,

అమ్మ కిరోసిన్ పోశాడు ,

భరించు తల్లి,

అమ్మా తగల బెడుతున్నాడు.

తగలబడి పో తల్లి.

అమ్మా ఒకడు నన్ను వేధిస్తున్నాడు.

ఏంటి ఆ మాటలు నువ్వేం చేశావు

ఏం చేయలేదు,

అయితే భరించు లేదా కాలేజీ మానేసేయ్.

అమ్మో చదువుకోవద్దా భరిస్తా అమ్మా,

అమ్మ వాడు చున్నీ లాగాడు.

భరించు తల్లి,

అమ్మా వాడు నన్ను ఎత్తుకు పోతున్నాడు,

భరించు తల్లి,

అమ్మా వాడు మానభంగం చేశాడు పోలీస్ కేస్ పెడతాను.

అమ్మో పరువు పోతుంది భరించు తల్లి.

అమ్మా, నాన్న, నన్ను చంపుతున్నారు.

అవును తల్లి మానభంగం అయిన పిల్ల ఇంట్లో ఉంటే పరువు పోతుంది.

తల్లి భరించి చచ్చిపో తల్లి,

అమ్మా తాత నన్ను పైన కూర్చో బెట్టుకుని ఏదో చేస్తున్నాడు.

అయ్యో తల్లి ఎవరూ నమ్మరే

భరించు తల్లి,

అమ్మా, అమ్మా, అమ్మా, తాత నన్ను నలిపేస్తున్నాడు.

అయ్యో తల్లి భరించి చావు తల్లి.

నేను ఏదైనా అంటే నన్ను కూడా చంపేస్తారు తల్లి.

అమ్మా ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించాడు నా మొగుడు.

అవునా తల్లి, ఏం చేస్తాం ఖర్మ భరించి మగపిల్లాడిని కను తల్లి,

అమ్మా, పుట్టిన మగ పిల్లలు, నా భర్త, నా మాట వినడం లేదు.

భరించు తల్లి, వాళ్ళే తెలుసుకుంటారు.

అయ్యో నా పిల్లలు నన్ను తిడుతున్నారు.

భరించు అమ్మ,

నాకు తిండి పెట్టడం లేదు అయ్యో, చచ్చిపో అని తిడుతున్నారు.

అయ్యో అమ్మా, నీ కడుపులో పుట్టిన పిల్లలే కదా భరించు తల్లి,

అయ్యో నన్ను చంపేస్తున్నారు భరించు తల్లి….

భరించు.. భరిస్తూనే ఉండు
భరించు.. భరిస్తూనే ఉండు

ఇలా ఆడవాళ్ళు పుట్టిన దగ్గరి నుండి, చచ్చే వరకు మగాడు చేసే ప్రతి పనిలోనూ, ప్రతి చర్యలను చూస్తూ, వాడు పెడుతున్న బాధలను అన్ని భరిస్తూ, తమ ఉనికే లేకుండా,  ప్రతి విషయంలోనూ అణిచివేతకు గురవుతూ ఉన్నారు. ఆడది మగాడి చేతిలో పుట్టినప్పటి నుండి, చచ్చే వరకు ప్రతి సెకండ్ హింసకు గురి అవుతున్నారు. ఆడవాళ్ళు రాజ్యాలు ఏలుతున్నారు, మగాడిని ఆడిస్తున్నారు, అనేది చాలా అబద్దం.

ఎందుకంటే, బయటకు కనిపించని వెన్నో అఘాయిత్యాలు మన చుట్టూ జరుగుతున్నాయి. అవి మనం కళ్ళతో చూస్తూ కూడా, మనం నమ్మలేక పోతున్నాం. ఉదాహరణకి ఒక భువనేశ్వరి, ఒక దేవిక, మొన్న అన్న, తండ్రి చేతుల్లో చెట్టుకు కట్టేసి కొట్టిన ఒక చెల్లి మంజుల, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో మనకు ఎదురుగా కనిపిస్తున్న నిజాలు. మగాడి ఆగడాలను భరిస్తున్నంత కాలం ఇవి జరుగుతూనే ఉంటాయి. నిజానికి ఆడది తల్చుకుంటే ఏదైనా చేస్తుంది.

కానీ, ఎక్కడో ఒక చోట ఆమెను నలిపే, ఆమెను నాశనం చేస్తున్న మగవాళ్ళు ఉండడం వల్ల, ఆమె ఏదీ సాధించలేకపోతుంది. ఒక వేళ సాధించినా,  ఆమె ఎవరికో ఒకరికి లొంగి ఉంటుంది. అంటే వాడు అరాచకం భరిస్తేనే ఏదైనా సాధించి, ప్రపంచానికి చూపుతుంది. లేదంటే, ఎంత సాధించినా, ఒక ఇన్స్పెక్టర్ ఒకడి వేధింపులను భరించలేక కడుపులో బిడ్డను చంపుకున్నట్టు, వాడి ఆగడాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది.

అలా మిగతా వాళ్ళు చేయలేక, అయిదు నిమిషాలు కళ్ళు మూసుకుని వాడిని భరిస్తే, మా గురించి ప్రపంచం తెలుసుకుంటుంది అనే ఒకే ఒక్క కారణంతో ఆడది మగాడిని భరిస్తుంది. ఇలాంటి భరింపులు లేకుండా, ఎలాంటి అత్యాచారాలు జరగకుండా, ఎలాంటి ఆగడాలు ఏ మగాడు చేయకుండా ఆడది తన శక్తితో ఎప్పుడైతే విజయం సాధిస్తుందో, అప్పుడే ఆడవాళ్ళు విజయం సాధించినట్టు.

ఈ భరింపులు ఇంకెంత కాలం? ఇంకెన్ని రోజులు? ఇంకెన్ని రోజులు ఇవన్నీ భరించాలి? మనం మగాడి చేతిలో కీలబొమ్మగా ఎప్పుడైతే ఉండమో అప్పుడే విజయం సాధించినట్టు. అలాంటి ఒక రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. 

– భవ్య చారు (గారి రచన)

Related Posts

1 Comment

  1. బాగుంది.ఎమోషనల్ గా ఉంది.ఆ రోజు తప్పకుండా వస్తుంది.

Comments are closed.