భయం – అభయం

భయం – అభయం

బతుకును శ్వాసిస్తుంటాను
బంధాల బాటను బాగుచేయమని
భయాన్ని ద్వేషిస్తుంటాను
నిరాశను సాగుచేస్తుంటావని

ఆశను ప్రేమిస్తుంటాను
రేపటి దారి చూపకపోదా అని
పేరాశను గమనిస్తుంటాను
చొరబడితే జ్వరపడతానని

కాలం ఇంద్రజాలాన్ని
ప్రేమిస్తుంటాను
చిక్కుముడులను చూలాగ్గా విప్పుతుందని
మనసుకు ఎంతో నప్పుతుందని

మారే మనిషి భయపెడుతుంటాడు
వంటరి ద్వీపమై వెలుగుతు
స్వార్థానికి సమిధై
ద్వేషయజ్ఞం చేస్తున్నాడని

విద్వేషాల వీధుల్లో మనిషే కాలిపోతుంటే
మనసు వాలిపోతోంది
ఏ భయం భయపెడుతుందిక
ఏ అభయం కనపడుతుందిక

– సి. యస్.రాంబాబు

Related Posts