బ్రాహ్మీముహూర్తం
బ్రహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు రెండు గడియలు ముందున ఉన్న సమయం.. మొదటి 48 నిమిషాల్లో ఆసురీముహూర్తం అంటారు.. అంతకు ముందు నలభై ఎనిమిది నిమిషాల ముందు ఉన్న ముహూర్తాన్ని బ్రహ్మీ ముహూర్తం అంటారు .. ఆ సమయంలో పంచభూతాల యొక్క సృష్టి బ్రహ్మ చేత జరిగింది అని అంటారు .
అందుకోసం అని చెప్పేసి అది చాలా శుభప్రదమైన శ్రేష్టమైన ముహూర్తం అంటారు… పదిగంటల లోపున పడుక్కుని ఆ టైంలో లేవడానికి ప్రయత్నించండి. పిల్లల్ని ఆ టైంలో లేపి కానీ చదువు చెప్పినా వారంత వారు చదువుకున్నా చక్కగా చదువు అబ్బుతుంది. ఆ సమయంలో జ్ఞాపకశక్తి అద్భుతంగా ఉంటుంది . ఎందుకంటే మైండ్ చాలా ఫ్రెష్ గా ఉండడమే కాకుండా భగవత్ సహకారం కూడా చాలా ఉంటుందని నమ్మకం ..
ఇది నమ్మకమే కాదు. మా మీద ప్రయోగించ బడి నిజమని నిరూపితమైంది కూడా.. మా చిన్నప్పుడు మా నాన్నగారు పొద్దున్నే లేపేస్తుండేవారు . ఆ టైంలో లేచి చదువుకుంటే మాత్రం జెరాక్స్ మైండ్ ఉంటుందనేది మాత్రం నిజం.. అన్నీ కూడా చాలా చక్కగా గుర్తుండిపోతాయి. నేను చిన్నప్పటినుంచి క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లోనే ఉండేదానిని. పదహారేళ్ళకి పెళ్ళి ఐంది. మావారు నా ఇరవై ఒక్క ఏళ్ల కి సిక్ అయ్యేరు. మా బాబు పదినెలలవాడు…
అప్పుడు చదువు ప్రైవేట్ గా మొదలుపెట్టి బిఏ ఆంగ్ల సాహిత్యంలో చేసాను. ఈసమయంలో చదువుకుని బాబు పనులు మావారిపనులూ చూసుకుంటూ ఇల్లు తుడుచుకుంటూ వంటచేసుకుంటూ బట్టలు ఉతుకు కుంటూ చదివిన చదువు నెమరువేసుకుంటూ ఉండేదానిని. అలా అన్నీ గుర్తు ఉండిపోతాయి. మాహస్బెండ్ 1980లోపోయారు.. తర్వాత జాబ్ చేసుకున్నాను…
అది నాడైలీ రొటీన్ గా ఉండేది.
ఎమ్మే ( ఆంగ్లం)బిల్ ఎస్సీ.. లైబ్రరీ సైన్స్ కోర్సు ప్రైవేటు గా చేసాను. ఏభై ఏళ్ళ వయసులో నెట్ అనే పరీక్ష పాసయ్యేను.సంగీతం డిప్లొమా ఫస్టియర్ లో ఆగిపోయింది… చాలా మందికుర్రవాళ్ళు… ఈవిడ ఈ నెట్ ఎగ్జాం ఎలా పాసైంది అని ఆశ్చర్యం తో నాదగ్గరికి వచ్చి మరీ అభినందించారు… నామీద బ్రాహ్మీముహూర్త బలం బాగానే పనిచేసింది…అని చెప్పడానికి ఇంత సుత్తి వేసాను.
ఇప్పటికీ ఆ సమయంలోనే రచనలు చేయడం అలవాటు… ఆలోచనలు వరదలాగా వస్తాయి… ఇలా నాకు అలవాటైపోయింది కాబట్టి చెబుతున్నాను… ఇప్పుడు నావయసు ఏడుపదులు ఆగస్టు లో దాటాయి. చాలవరకూ శుభముహూర్తాలన్నీ కూడా ఆ టైంలోనే ఉంటూ ఉంటాయి ఎందుకంటే ఏపని చేసినా నిర్విఘ్నంగా నిరాటంకంగా జరుగుతుంది..అని పెద్దలు చెప్పడం వల్ల…
ఆసమయంలో ఏపని చేసినా మంచిదే… పూజలు సత్ఫలితాలను ఇస్తాయి.. ఇది విశ్వాసమేకాదు. నిరూపించబడ్డ సత్యం… ముఖ్యమైన పనులు అప్పుడు ఐపోతే మిగిలిన పనులకి మనకి చేతిలో చాలా సమయం ఉంటుంది. అన్ని పనులూ నిర్విఘ్నంగా జరుగుతాయని పెద్దల నమ్మకం.. అది నిరూపితమైన నిజం.. పిల్లలకు అలవాటు చేయండి…
అందుకని లేచి చూడండి.. లాభాలు పొందండి…
– ఉపద్రష్ట సుబ్బలక్ష్మి