చైత్ర వెన్నెల

చైత్ర వెన్నెల

కొన్నిరోజులుగా నిఖిల్ ఎక్కువగా మాట్లాడ్డం లేదు. కారణం తెలుసుకుందామంటే మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదు రామారావుకి, సీతకి.

ఇంతకీ సీతా, రామారావులు నిఖిల్ తల్లిదండ్రులు. నిఖిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. బ్రైట్ స్టూడెంట్. మధ్యతరగతి కుటుంబాల్లో పేరెంట్స్ ఆశలన్నీ పెద్దపిల్లాడి మీదే ఉంటాయి. కుటుంబాన్ని ఆదుకుంటాడనో, తర్వాతి పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాడనో… ఇలా అనేక కారణాలున్నట్టే రామారావుకు నిఖిల్ మీద ఎన్నో ఆశలున్నాయి.

నిఖిల్ కు ఒక చెల్లెలు కూడా ఉంది. తన పేరు నీల. ఇంటర్మీడియెట్ చదువుతోంది. డాక్టర్ని చేయాలని సీతా, రామారావులు కలకన్నా అంతకన్నా ముందే నిఖిల్ నీలకు ఆ కలను ఎక్కించేశాడు. ఇంట్లో అయినా, కాలేజీలో అయినా నిఖిల్ చాలా యాక్టివ్.

అలాంటి నిఖిల్ కొద్దిరోజులుగా సైలెంట్ అయిపోయాడు. ఎప్పుడూ తలుపేసుకునుంటాడు. ఏం చేస్తున్నాడో చెప్పడు. ముందుగా ఈ విషయాన్ని గమనించింది సీత. కీడు శంకిస్తూ విషయాన్ని భర్తకు చెప్పింది. ముందు భార్య భయాన్ని కొట్టిపడేసినా రామారావుకు కూడా అనుమానం రోహిణీకార్తె ఎండలా కాల్చేయసాగింది.

పరీక్షలకి ఇంకా టైముంది. కొడుకు మీద నమ్మకమున్నా చుట్టూవున్న వాళ్ళ మీద లేదు. ఎవరి ఇన్ఫ్లూయన్స్ ఎలా ఉందో.. అసలే రోజులు బాలేవు. ఎటుచూసినా యూత్ చుట్టూ డ్రగ్స్ ఉచ్చులే..

ఇలా ఆలోచనలు చుట్టుముట్టేస్తుంటే ఒక నిర్ణయానికి వచ్చాడు రామారావు. దాన్ని భార్యకు చెప్పాడు. నిఖిల్ బయటక వెళితే తన రూం వెతకాలనుకున్నాడు. అదేమైనా క్లూ ఇస్తుందేమోననే ఆశ రామారావుది. అలాంటి అవకాశం ఎదురుచూస్తుండగా ఒకరోజు నిఖిల్ బయటకు వెళుతున్నానని తల్లికి చెప్పి వెళ్లాడు.

అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన రామారావు చెవిలో విషయాన్ని వేసింది.. అంతే బట్టలు కూడా మార్చుకోకుండా కొడుకు రూమ్ లోకి వెళ్ళి ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని భయం భయంగా వెతకసాగాడు. ఎలాంటి అవాంఛనీయమైనవి దొరక్కుండా చూడమని తనకు తెలిసిన దేవుళ్ళందరినీ ప్రార్థిస్తున్నాడు..

కొడుకు లాప్ టాప్ పక్కనే 2022 డైరీ కనిపించింది. అది తనిచ్చిందే అనుకున్నాడు రామారావు. ఇప్పటి పిల్లలకు డైరీ గురించి తెలియదని ఒకవేళ తెలిసినా డైరీ రాసే అలవాటు మాత్రం ఇంపాసిబుల్ అన్న నిర్ణయానికి ఎప్పుడో వచ్చేశాడు రామారావు.

డైరీని చూడగానే దాన్ని వాడుతున్నారో లేదో చెప్పేసే అలవాటుంది రామారావుకి. అలా ఆ డైరీని చూడగానే కొడుకు డైరీ వాడుతున్నాడని అర్థమయింది రామారావుకి. ఇంకొకళ్ళ డైరీ చూడొచ్చా లేదా అన్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఎదురయింది రామారావుకు.

తప్పని తెలిసినా ఆ డైరీ క్లూ ఇవ్వకబోదు అనుకుంటూ డైరీ తెరిచాడు. మొదటి నెల,నెలన్నర వరకూ డైరీ అంతా లెక్కలు కొంత నోట్స్ కొన్ని డయాగ్రామ్స్ కనిపించాయి.. ఒకచోట ఆగిపోయాడు….

*ఏప్రిల్ పదమూడవతేదీ బుధవారం*

అమ్మా, నాన్నలు తమతో నేను మాట్లాడటం లేదని చాలా బాధపడుతున్నారు.అది నేను గమనించానని వాళ్ళకు తెలీదు. కానీ వాళ్ళకు ఎలా చెప్పాలి?

నాన్నకు కాస్త హెల్ప్ చేద్దామని నేనో ప్రాజెక్టుకు పనిచేస్తున్నానని, ఎలా తెలియచేయాలి? నీల ఖచ్చితంగా ఎమ్.బి.బి.ఎస్.లో సీటు సాధిస్తుందన్న నమ్మకం నాకుంది. ఎంతోకొంత క్యాష్ రెడీ చేసిపెట్టాలి. ఈ ప్రాజెక్టు నాకో ఛాన్సిస్తుంది. దాంతో పాటు ఈనెలలో అమ్మా, నాన్నల వెడ్డింగ్ యానివర్సరీ. వాళ్ళకో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి.”

అక్కడితో ఆగిపోయింది డైరీ.. మళ్ళీ ఏవో నోట్స్, డయాగ్రామ్స్ ఉన్నాయి.

రామారావుకు కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. ఆ డైరీ అక్కడే పెట్టేసి భార్య దగ్గరకు వెళ్ళాడు. తన చేతులు తీసుకుని కళ్ళకద్దుకున్నాడు.. భర్త ఆకస్మిక చర్యకు తెల్లబోయిన సీతను దగ్గర తీసుకుంటూ చెప్పాడు.

రేపు మన పెళ్ళిరోజు గుర్తుంది కదా. దాన్ని గుర్తుంచుకుని నీకో స్పెషల్ గిఫ్ట్ తేవడం కోసం వెళ్ళాడు నీ కొడుకు. ఆ తర్వాత కొడుకు డైరీలో రాసుకున్న విషయాలన్నీ భార్యకు చెప్పాడు.

ఈసారి సీత కళ్ళు కన్నీటి సంద్రాలయ్యాయి.. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది.. ఎదురుగా నవ్వుతూ చేతిలో పేకెట్లతో నిఖిల్, నీలలు.

కొడుకు కష్టాన్ని రికార్డు చేసిన డైరీకి కృతజ్ఞతలు చెబుతూ కొడుకుని ఆలింగనం చేసుకున్నారు సీతా, రామారావులు. ఊహించని ఈ పరిణామానికి చైత్ర పున్నమి చంద్రుడు కూడా ఆనందంతో ఇంకొంచెం వెన్నెల ధారను కురిపించాడు.

– సి.యస్.రాంబాబు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *