చెల్లని నాణాలు
“ఎందుకమ్మా ఏడుస్తున్నావు?” ఏడేళ్ల చిన్ని తల్లిని అడిగింది.
“ఏడవక ఏమి చెయ్యాలమ్మా. నాన్నకేమో అట్లావుంది. రేపేమో నీ పుట్టినరోజు. కొత్త గౌను కొనలేని పరిస్థితి. నాన్న మందులు కొనాలి. చేతిలో డబ్బు లేదు” అంది విమల పిల్లలిని దగ్గరకు తీసుకుని.
“నాకు కొత్త గౌను వద్దమ్మా. నాకు చాలా గౌన్లు వున్నాయి.”
“వచ్చే నెల్లో నా పుట్టినరోజు కదా. నాక్కూడా వద్దమ్మా “అన్నాడు బాబీ.
“ఆడబ్బులన్నీ పెట్టి నాన్నకి మందులు కొను. ఇంకా కావాలంటే నా దగ్గరున్నాయి ” లోపలికెళ్లి తన కిడ్డి బ్యాంకు తెచ్చింది. “అన్నయ్య నీది కూడా తే.. అమ్మకిద్దాం “అంది. తల్లి చేతిలో పెట్టింది.
“ఇవన్నీ చెల్లని నాణాలు.”
“అంటే “అర్ధం కాక అడిగారు.
“వీటితో ఏమీ కొనుక్కోలేం “అంది విమల.
“డబ్బు కాదా?”
“డబ్బే కాని చెల్లు బాటు కాదు “
“పనికి రాని డబ్బు అన్నమాట ” అంది చిన్ని.
– మోటూరి శాంతకుమారి