చేవ్రాలు

చేవ్రాలు

ఎడారిలో కోయిలలా
కాంక్రీటు రోడ్డు పై
ఆత్మీయతను నాటినట్లున్న
ఆ మొక్క నా కుశలమడుగుతుంది

జాలి దయలేని కాలం కాటేసిందనో
అవమానాల విపణిలో నను వేలం వేసిందనో
కప్పిపుచ్చుకుంటుండగా
పచ్చని చూపును నాపై ప్రసరిస్తుంది

తన తనువంతా గాయాలే
లేపనం పూసేవారే లేరని తెలిసినా
గుర్తించని నేను
నా మేనంతా మోసాల పుండేనంటాను
సంతోషాల ‘మేనా’లో కూచోపెడతావాని వెటకరిస్తాను

పూల శరీరం పచ్చని నవ్వై ప్రకాశిస్తుండగా
బుద్ధభగవానుడిలా చూస్తుంది
అప్పుడు వెలిగిన నా బుద్ధి కొంచెం సిగ్గుపడుతుంటుంది

దారంతా రాళ్ళున్నా
దీవించే మెత్తని ఇసుకా ఉన్నట్టే
మట్టిలో కలిసేముందు
కాస్త మానవీయ స్పర్శను
వళ్ళంతా హత్తుకోవాలి

బట్వాడా అవుతున్న భావాలు
ఆ మొక్క చేవ్రాలని తెలుస్తుంటే
నా కళ్ళువాలిపోతున్నాయి
మనసు సోలిపోతోంది

– సి. యస్. రాంబాబు

Related Posts