చిదాకాశం
జీవితం దగా చేసినప్పుడు
మనసు దిగాలు చెందినప్పుడు
ఆకాశం నాకో దివిటీ
నల్లని మేఘాల గుబులు
తెల్ల మబ్బుల హొయలు
నాకేదో ఆశలు కల్పిస్తుంటాయి
కాలం ఉయ్యాలలో ఊగుతుంటాం కదా
తూగుతున్నట్టుండదు
తుంపర్ల సౌందర్యమూ ఉండదు
తూట్లు పొడిచే కాలనాళికలే ఉంటాయి
అప్పుడే చిదాకాశం పొత్తిళ్ళలో ఒదిగిపోతుంటాను
-సి.యస్.రాంబాబు