చిలిపి దొంగతనం

చిలిపి దొంగతనం

 

చిన్నప్పుడు నేను చాలా దొంగతనాలు చేశాను. కానీ, అవన్నీ స్కూల్ లో పక్క నున్న పొరల్ల దగ్గర నచ్చిన బలపం, పెన్ను, పెన్సిల్, నోట్స్ బుక్ లు చాలా చేశాను. అయితే అవన్నీ అవసరానికి మాత్రమే. ఎందుకంటే, పేరుకే బడి పంతులు పిల్లలం. కానీ, కొనడానికి డబ్బులు ఉండేవి కావు. అందువల్లనే దొంగతనాలు చేశాను, కానీ, ఎవరికీ నష్టం కలగకుండా చేశాను.

పక్కనున్న నా దోస్తులు నాకు వారంతట వారే ఇచ్చేవారు ఒక్కొక్కసారి. కానీ, పెద్ద బలపం ఎవరి దగ్గర ఉందో వారి దగ్గర మెల్లిగా చేరేవాడిని. తర్వాత వాళ్లను మాటల్లో పెట్టేసి, తన బలపం తీసుకునే వాడిని. వాడు బలపం కోసం వెతుకుతూ ఉంటే నేను లోలోపల నవ్వుకునే వాడిని. ఇలా చిన్నతనం గడిచింది. ఆరో తరగతికి వచ్చాక అలా దొంగతనం చేయకూడదు అనుకున్నా. కానీ, పరిస్థితులు నన్ను దొంగతనం చేసేలా చేశాయి.

నాన్నకు వచ్చిన జీతం అంతా నాన్నమ్మ వారికి పంపేవాడు. దాంతో, మేము సగం కడుపుకు తింటూ ఉండేవాళ్ళం. అలాగే చదువుకోవడానికి, రాసుకోవడానికి నోట్స్ కూడా ఉండేవి కావు. నాన్న హాస్టల్ పిల్లలకు సాయంకాలాలు, పరీక్షలు పెట్టి వాళ్ళు రాసిన నోట్స్ కరెక్షన్ కోసం ఇంటికి తెచ్చేవారు. ఆయన చూడకుండా నేను ఆ బుక్స్ లోని మధ్య పిన్ పేజిలు గబగబా చింపేసేవాడిని. తెలిస్తే చంపేస్తారు, కొనివ్వమని అడిగే ధైర్యం లేదు ,పరిస్థితులు అలాంటివి మరీ.

 

చిలిపి దొంగతనం

ఆ పేజీలను అన్నిటినీ చింపేసి నేను నా స్నేహితుల కాపి లోంచి తీసిన పేజీలతో కలిపి, అన్నిటినీ అమ్మకు ఇచ్చి ఒక పెద్ద నోట్ లా కుట్టమని ఇచ్చేవాడిని. అవన్నీ అమ్మ మంచిగా నీట్ గా పేర్చి, పెద్ద సూది దారం పెట్టి కుట్టి ఇచ్చేది. అదే నోట్ ను నేను స్కూల్ కి తీసుకుని వెళ్లేవాడిని. అందులో ఆరు సబ్జెక్ట్స్ కి ఆరు భాగాలుగా చేసి రాసుకునే వాడిని.

నా చదువు పది వరకు అలాగే సాగింది. పది తర్వాత కాలేజీ. దాంతో నేను గవర్నమెంటు కాలేజీలో చేరాను. అప్పటికి కష్టాలు తీరలేదు. కానీ, పొద్దున పేపర్ వేస్తూ వచ్చిన డబ్బుతో నోట్స్ కొన్నాను, చదువుకున్నాను. ఇప్పుడు ఒక ఆఫీస్ లో అకౌంటెంట్ గా పని చేస్తూ వచ్చిన జీతంలో నాలాంటి కష్టపడుతున్న పిల్లలకు నోట్స్ కొనిస్తూ చేతనైన సాయం అందిస్తూ ఉన్నాను.

ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. అదండీ నా చిలిపి దొంగతనం.

 

– కుమార్

Related Posts