చిన్ననాటి స్మృతులు

చిన్ననాటి స్మృతులు

 

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరూ చిన్న తనం నుండి వచ్చినవారే. ప్రతి ఒక్కరూ వారి వారి చిన్నతనంలో చిలిపి చేష్టలు, దొంగతనాలు  చేసే ఉంటారు. ఆ సమయంలో తెలిసి చేసినా, తెలియక చేసినా, అవి ఆ సమయంలో ఆ పనులు పెద్దవారికి కోపం వచ్చే విధంగా ఉన్నా, పెద్ద అయ్యాకా అవే పనులు తీపి గుర్తుతులు గా, మధుర జ్ఞాపకాలుగా మారుతాయి.

అదే విధంగా నా చిన్న తనంలో కూడా నేను చేసిన చిలిపి చేష్టలు కొన్ని మీతో పంచుకోవాలనీ అనుకుంటున్నాను.

నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక రోజు నేను మా పెద్ద తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇల్లు, మా ఇల్లు పక్క పక్కనే ఉంటాయి. అయితే, అక్కడ మా చిన్న అత్త మొహం కడుక్కొని వచ్చి అద్దంలో చూసుకుంటూ….  మొహానికి ఏదో పెట్టుకుంటుంది. నేను అలాగే మా అత్తని చూస్తూ ఉండిపోయాను. 

ఆ తరువాత నేను మా ఇంటికి వచ్చాను. నేను కూడా మొహం కడుక్కొని వచ్చి అద్దంలో చూసుకుంటూ అద్దం ముందు ఏదో సీసాలో కనపడితే… నేను అది తీసుకొని మూత తీసి అందులో వేలు పెట్టు కొంచం తీసి మొహం మీద అక్కడ అక్కడక్కడ పెట్టి ఆ తరువాత మొహానికి అంతా రాశాను. ఇక అంతే…. నా మొహం, నా కళ్ళు మండి పోతున్నాయి.

ఇక ఏడవడం మొదలు పెట్టాను. నేను ఏడుస్తుంటే అమ్మ, నాన్న, నాన్నమ్మ అందరూ వచ్చేశారు. ఏమైంది…? ఏం జరిగింది…? అని.. నన్ను చూసి కంగారు పడ్డారు.

“నా మొహం మండుతుంది” అని చెప్తూ…. ఏడుస్తున్నాను. ఎందుకు అని అడిగితే, నేను ఏమి చెప్పలేదు.  వాళ్ళే ఆ వాసనను చూసి,  అయ్యో…!  ఎవరైనా ఇది పెట్టుకుంటారా మొహానికి… ఎవరూ చెప్పారు నీకు అంటూ… తిడుతూ… మొహనీకి సబ్బు పెట్టి, మూడు, నాలుగు సార్లు కడిగింది మా నానమ్మ…

ఇంతకీ నేను మొహానికి పెట్టుకుంది ఎంటో తెలుసా? “జండుబామ్” 😂😂

కాసేపు అయ్యాక మొహానికి మంట తగ్గిపోయింది. కళ్ళు ఎర్రగా మారాయి. ముందు మా వాళ్లు తిట్టినా నేను ఊరుకున్నాక… ఎవరైనా మొహానికి జండు బామ్ పెట్టుకుంటారా? అని నన్ను చూసి అందరూ నవ్వారు.

ఒకసారి ఏం జరిగిందంటే….. మా ఊర్లో  ఒకరి ఇంట్లో పెద్ద రేగు పండ్ల చెట్లు ఉంది. చెట్టు నిండా రేగు పండ్లు ఉంటాయి. వాళ్ళని అడిగితే కొన్ని ఇచ్చేవారు. అంతే… మళ్లీ నాకు ఆ రేగు పండ్లు తినాలనిపించేది.

నేను పదే పదే… ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చూసేదాన్ని, ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా, లేదా, చూసి ఎవరూ లేకపోతే అక్కడ కింద ఉన్న రాళ్ళను వెతికి రేగు పండ్ల ను కొట్టేదాన్ని, అప్పుడు ఒకటి రెండు పడేవి. కట్టేతో కొడితే ఎక్కువగా పడతాయని కట్టె కోసం చూసాను. కట్టె కనపడింది. కానీ చాలా పెద్దగా ఉంది. అది నేను పట్టుకుని, రేగు పండ్లను కొట్టడం నాకు రాకపోయేది మరి చిన్నదాన్ని కదా…!

మరొక్కసారి ఏం జరిగింది అంటే చూడండి…..

మా ఇంటికి కొంచం దూరంలో ఒకరి ఇంట్లో మల్లే చెట్టు ఉండేది. చాలా పెద్ద చెట్టు. ఆ చెట్టు నిండా పువ్వులే. అసలే నాకు  పువ్వులు అంటే చాలా ఇష్టం. అలాంటిది వాటిని చూస్తే అవి ఎలాగైనా తెంపి పెట్టుకోవాలని అనిపించేది. వాళ్ళని అడిగితే అస్సలు ఇచ్చేవారు కాదు. నాకే కాదు. ఎవరికి ఇవ్వరు. చెట్ల మీదనే పువ్వులు పూసి వాడిపోయేవి. వారు మాత్రం ఎవరికీ ఇవ్వరు.

నేను వాళ్లు లేనప్పుడు చూసి, గోడ పక్కన నిలబడి మల్లె పూలు తెంపెదాన్ని, ఎవరైనా వస్తున్నారు అని అనిపిస్తే… వెళ్ళిపోయేదాన్ని.

మరో సారి…..

మా ఇంటి వెనుక ఒక మామిడి చెట్టు ఉండేది. దానికి మామిడి కాయలు చాలా ఉండేవి. అవి చూడగానే తినలనిపించేది.  చాలా సార్లు తెంపాలని చూసా… పెద్ద గోడ ఉండేది. ఆ గోడ మీద నుండి కట్టెతో కొట్టాను, ఆ మామిడి కాయ ఒకటి వచ్చింది. మరో సారి కట్టెతో మరో కాయను  కొడితే, అది వెళ్ళి వాళ్ళ ఇంటి వైపు  పడింది. ఆ శబ్దానికి ఇంట్లో నుండి ఆ ఆంటీ బయటకు వచ్చి…

‘ ఎవరూ….మామిడి కాయలు తెంపేది…? అని అంది. ఆ మాటకి నేను భయం తో ఇంట్లోకి వెళ్లి పోయాను. ఇక ఇంకో సారి ఆ చెట్టు వైపు చూడలేదు.

ఇవి నా మధుర జ్ఞాపకాలు…

– అనూష, వరంగల్.

Related Posts

1 Comment

  1. Ha ha ha 😂 మీ చిన్న నాటి అనుభవాలు చాలా బాగున్నాయి..

Comments are closed.