చింతపండు చారు

చింతపండు చారు

ఆ గ్రూప్ పేరు కార్డ్స్ (CARDS). ఇందులో ఒక్కొక్క అక్షరం ఒక స్నేహితుడి పేరు ని సూచిస్తుంది. ఈ గ్రూపులో కొత్తగా ఎవరు చేరి నా చివరి అక్షరం ఎస్(S), లో కలిపేస్తాము. తర్వాత చేరిన వాళ్ళ అందరి పేర్లు ఈ ఎస్ తోనే ఉండడం విచిత్రం.

ఇక మొదటి రెండు అక్షరాల కి వద్దాం. ఇవి రెండూ జీవికా జీవులు. చక్రవర్తి మరియు ఆనంద్. దాదాపు డిగ్రీ పూర్తయ్యేంత వరకూ వీరు ఒకేచోట చదువుకున్నారు. వీరిద్దరే కాదండీ మిగిలిన వారు కూడా చిన్న నాటి నుంచి ఒక చోట చదువుకున్న వాళ్లే.

అందరిదీ ఇంటర్మీడియట్ పూర్తయిపోయింది. వీరిద్దరు మాత్రం ఊర్లో కాకుండా వరంగల్ కి వెళ్లి వెలుగ పెడదామని కంకణం కట్టుకున్నారు.

మిగిలిన వారు విముఖత చూపడంతో, వీరిద్దరూ వరంగల్ లోని ఎల్బీ కాలేజీ లో చేరిపోయారు. చదువుల్లో వజ్రాలు, దాంతో ఇద్దరికీ మొదటి జాబితాలోనే సీటు లభించింది.

దాంతో వీరి మకాం వరంగల్ మారిపోయింది. వేయి స్తంభాల గుడికి ఎదురుగా ఉన్న వీధిలో వీరిద్దరూ ఒక చిన్న గది కిరాయికి తీసుకున్నారు.

కాలేజీ కొంచెం దూరమైనా మీరిద్దరూ నడిచి వెళ్లి నడిచి రావడం అలవాటు చేసుకున్నారు. సాయంత్రం వేళల్లో గుడి లో కూర్చుని పర్యాటకులను వీక్షిస్తూ కాలం గడిపేవారు.

వంట చేయడం రాదు ఇద్దరికీ ఆనంద్ కాస్త ముందుగా లేచి ఒక అర్ధ పావు చింతపండు నానబెట్టి, మిగిలిన తన కార్యక్రమాలు పూర్తి చేసుకునే వాడు. చిన్న కిరోసిన్ స్టవ్ ఒకటి పెట్టుకున్నాం.

ఇక అన్నం అవ్వగానే నెక్స్ట్ ఐటమ్ చింతపండు చారు. నానిన ఆ చింతపండు ని బాగా పిసికేసాడు. తొక్కు పడేసి స్టవ్ మీద పెట్టేవాడు ఆనంద్.

అది మరుగుతున్నప్పుడే ప్రయోగంలో భాగంగా ఉప్పు, కారం వేసేవాడు. చివర్లో తాలింపు. ఇదేనండి, మా బ్రేక్ ఫాస్ట్ అండ్ డిన్నర్. ఇలా ఈ స్టార్ హోటల్ ఫుడ్ తో ఒక రెండు నెలలు గడిపాము.

నేను కాస్త గడుసు. నాకు మా ఇంటి యజమానికి పొత్తు అస్సలు కుదరలేదు. వాడితో గొడవ. ఆనంద్ అంటాడు, “ఒరేయ్, కొన్ని మనము పట్టించుకోకూడదు రా… చూసీచూడనట్టు వదిలేయాలి”, అని. నాకేమో కాస్త ఉద్రేకం ఎక్కువ.

అసలు ఏం జరిగిందంటే….! బాత్ రూం లోకి ఎవరు వెళ్లి వచ్చినా… లోపల పెద్ద రెండు ప్లాస్టిక్ బకెట్ లు ఉండేవి. వాటిని వెళ్లి వచ్చిన వారు వెంటనే నింపి వేయాలి.

మేమిద్దరం ఆ కార్యక్రమాన్ని చాలా విధేయతతో చేస్తున్నాం. ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏంటంటే…. మేము ఎప్పుడు లోపలికి వెళ్లినా, రెండు బకెట్లు ఖాళీగానే కనబడేవి. అంటే ఆ చట్టబద్ధమైన నియమము మా ఇద్దరికె అన్నమాట.

ఒక రోజు ఇంటి యజమాని టాయిలెట్ కి వెళ్లి ప్రశాంతంగా చేతులు దులుపుకుంటు ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు..

ఆయనకి ఒక ఇరవై నిమిషాలు సమయాన్ని ఇచ్చాం. వస్తాడేమో, వస్తాడేమో, అని ఎదురు చూసాము. కానీ ఆ పెద్దమనిషి రాలేదండీ.

నేను వెళ్లాల్సిన ఆనంద్ ని ఆపి. మా ఓనర్ డోర్ దగ్గర నిల్చొని అంకుల్, అంకుల్ అని పిలిచాను. ఆయన బయటికి రాగానే అంకుల్ టాయిలెట్ లో రెండు బకెట్లు ఖాళీగా ఉన్నాయి. కాస్త నీళ్లు పోయండి అని కొంచెం దురుసుగా చెప్పాను. ఇక యుద్ధం మొదలు.

భార్యా భర్తలిద్దరూ మమ్మల్ని వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమన్నారు. చిన్న వయసు పైగా చిలిపి వయసు కావడంతో ఆ సంఘటనని మేమిద్దరం వెంట్రుక ముక్కతో సమానంగా భావించాం. ఇల్లు ఖాళీ చేసే వరకూ ఆ సంఘటనని గుర్తు తెచ్చుకొని ఇద్దరం బిగ్గరగా నవ్వుకునే వాళ్ళం.

ఇల్లు ఖాళీ చేయడం ఏంటి కర్మ, మేమిద్దరమూ వరంగల్ నే ఖాళీ చేసి మా స్వగ్రామానికి చేరాము. స్థానిక డిగ్రీ కళాశాల లో ఇద్దరము ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ పై ప్రవేశము పొందాము.

మొన్న 31 డిసెంబర్ 2021 న, మా స్నేహితులం అందరం అంటే కార్డ్స్ గ్రూపులో ఉన్న వాళ్ళందరము ఆనంద్ ఇంట్లో మకాం పెట్టేశాము.

మధ్యరాత్రి అందరము శుభాకాంక్షలు చెప్పుకుని దాదాపుగా ఒంటి గంట అవుతోంది భోజనాలకి కూర్చున్నాము.

ఆనంద్ లోపలినుంచి పగలబడి నవ్వుతూ ఒక వేడి వేడి గిన్నె తీసుకొచ్చే నా ముందు పెట్టాడు. ‘ఎందుకు నవ్వుతున్నావు ఏంటి ఇది?’, అని అడిగాను.

‘నీకోసం’, ఇది నేను చేసిన స్పెషల్. ‘తినే ముందు రుచి అడుగకు. అదేంటో నువ్వే మూత తీసి చూడు’, అని మళ్లీ పగలబడి నవ్వుతూ అన్నాడు.

అత్యుత్సాహంతో మూత తీసి చూశాను. నాకూ నవ్వాగలేదు. ఆ డిష్ చూశాక అందరము ఒక సాంగ్ వేసుకుని నృత్యం చేశాము.

మరి ఆ అమోఘమైన డిష్, నన్ను అంతగా నవ్వించిన ఆ వంటకం, ఏమై ఉంటుందో మీరే ఊహించండి.

– వాసు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress